టిడిఆర్ కుంభకోణం ఎలా జరిగింది?
రాష్ట్రంలో ఇదో కొత్తరకం కుంభకోణం. టీడీఆర్ అనేది పదేళ్ల నుంచి మాత్రమే అమలులోకి వచ్చింది. అసలు టీడీఆర్ అంటే ఏమిటి? కుంభకోణం ఏమిటి?
Byline : G.P Venkateswarlu
Update: 2024-07-25 11:44 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కుంభకోణాలకు కొదవలేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అవినీతి కుంభకోణాలపై బాణం ఎక్కుపెట్టింది. అందులో భాగంగానే స్వేత పత్రాలు విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు వెలుగు చేసినవన్నీ తెలిసిన కుంభకోణాలే. రాష్ట్ర మునిసిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి నారాయణ తన శాఖలో జరిగిన అవినీతిని కొత్తగా కనిపెట్టారు. టీడీఆర్ కుంభకోణం సుమారు రూ. 700 కోట్ల వరకు జరిగిందని మీడియాకు వెల్లడించారు.
టీడీఆర్ అంటే ఏమిటి?
ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టిడిఆర్) మునిసిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వానికి అవసరమైన భూమిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు భూ సేకరణ చట్టం కింద, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల చట్టం కింద స్వాధీనం చేసుకుని భూమి సొంత దారుకు పరిహారం చెల్లిస్తున్నారు. ప్రాజెక్టుల కింద కూడా భూసేకరణ చట్టం కింద భూమిని ప్రాజెక్టుకు స్వాధీనం చేసుకుని భూమి కోల్పోయిన వారికి పునరావాసంతో పాటు పరిహారం కూడా ఇస్తారు. టీడీఆర్ బాండ్స్ అంటే ప్రభుత్వానికి అవసరమైన భూమిని తీసుకున్నప్పుడు భూమి కోల్పోయిన వ్యక్తికి భూసేకరణ చట్టం కింద పరిహారం కాకుండా టీడీఆర్ బాండ్స్‌ను రిలీజ్ చేస్తుంది. ఉదాహరణకు ఒక నగరంలో రోడ్డు విస్తరణ చేయాల్సి వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపుల స్థలాలు కోల్పోయేవారు ఉంటారు. వారికి పరిహారానికి బదులు టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. ఈ బాండ్స్ అమ్ముకునేందుకు, వేరే వారికి రిజిస్టర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ బాండ్ తీసుకున్న వ్యక్తికి వేరేచోట స్థలం ఉంటే అందులో భవనాలు కట్టుకునేందుకు అనుమతులు ఉంటాయి. సాధారణంగా అందరూ నాలుగు అంతస్థుల భవనం కడితే టీడీఆర్ బాండ్స్ ఉన్న వారికి ఆరు అంతస్తుల భవనం కట్టేందుకు వీలు ఉంటుంది.
బిల్డర్లకు ఉపయోగం
బిల్డర్లు టీడీఆర్ బాండ్స్‌ను కొనుగోలు చేస్తారు. ఆ తరువాత వారు భవనాలు కట్టేందుకు అనువైన ప్రదేశంలో ఈ బాండ్స్‌ను ఉపయోగించి మునిసిపాలిటీ నుంచి అనుమతులు ఈజీగా తీసుకుంటారు. ఎవరికి వారు సొంతగా ఉపయోగించుకోవచ్చు. లేదా బిల్డర్లకు అమ్ముకోవచ్చు. ఈ బాండ్స్ ఎవరి వద్ద ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్స్ ఉన్నాయి. మునిసిపల్ వెబ్‌సైట్స్‌లో కూడా టీడీఆర్ బాండ్స్ తీసుకున్న వారి వివరాలు ఉంటాయి. ఈ వివరాల ప్రకారం బిల్డర్లు వారిని సంప్రదించి బాండ్స్ కొనుగోలు చేస్తారు.
ఏపీలో కుంభకోణం ఎలా జరిగింది?
టీడీఆర్ బాండ్స్ కుంభకోణం జరిగిందని మునిసిపల్ శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. అయితే ఎలా జరిగింది. టీడీఆర్ అంటే ఏమిటనేది మాత్రం వివరించలేదు. విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతిలో టీడీఆర్ బాండ్లు జారీ చేసిన మునిసిపల్ టౌన్ ప్లానింగ్ వారు భారీగా అవినీతికి పాల్పడినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. తణుకులో జరిగిన అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక అందింది. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. తణుకులో 29 బాండ్లు జారీ చేస్తే అన్నీ అక్రమమే అని తేలిందన్నారు. బాండ్ల జారీలో ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉన్నప్పటికీ చదరపు గజాల ప్రకారం భూమి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒక చదరపు గజానికి రు. 4,500 విలువ ఉండగా రూ. 22,000 లుగా లెక్క కట్టినట్లు చెప్పారు. అంటే తక్కువ విలువైన స్థలానికి ఎక్కువ విలువ కట్టి బాండ్స్ ఇచ్చారు. స్థలం కోల్పోతున్న వారి భూమి ధర కంటే దానికి 1.4 కిమీ దూరంలో ఉన్న భూమి విలువను పరిగణనలోకి తీసుకుని బాండ్లను జారీ చేయడం అనేది ఒక పెద్ద స్కాం అని మంత్రి చెప్పారు. తణుకులో బాండ్ల జారీలో అక్రమాలకు పాల్పడ్డ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఎక్కడైతే బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయో అలాంటి చోట్ల ఇచ్చిన బాండ్లను నిలిపివేసినట్లు చెప్పారు. కోర్టుకు వెళ్లిన 300 మంది బాండ్లను మార్చుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో పాలకుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగినట్లు మంత్రి చెప్పారు.
ఇక తిరుపతిలో కూడా రెండు టీడీఆర్ బాండ్లలో చదరపు గజం విలువ రూ. 40,000 గా అధిక ధర చూపించడం, గుంటూరులో చదరపు గజం విలువ రూ. 9,000 ఉంటే రూ. 20,000 గా చూపించి బాండ్లు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు. విశాఖపట్నంలో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా నోటరీ అప్రూవల్‌తో బాండ్లు జారీ చేసి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. బాండ్ల జారీలో అక్రమాలపై మరికొన్ని కమిటీలు వేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఎన్ని అంతస్తుల భవనం నిర్మాణం అయినా అనుమతులను ఆన్‌లైన్ లోనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లోగా దరఖాస్తు పరిశీలించి ఎక్కడైనా సమస్య ఉంటే మరోసారి అర్జీడారునికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరైనా మంచి పేరైనా తీసుకురావడంలో టౌన్ ప్లానింగ్ కీలకమైందన్నారు. అందుకే ఈ విషయంలో ముఖ్యమంత్రి తనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెప్పారు.