ఓ ఐఏఎస్ సత్సంకల్పం.. గిరి గర్భిణులకు వరం!

మన్యం జిల్లాలో మూడు చోట్ల ప్రిగ్నెంట్ హాస్టళ్ల ఏర్పాటు. డోలీ మోతల నుంచి విముక్తి. తగ్గిన గిరిజన మహిళల మాతా శిశు మరణాలు. దేశంలోనే తొలిసారిగా ప్రయోగం విజయవంతం.

By :  Admin
Update: 2024-10-06 06:25 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

ఓ ఐఏఎస్ అధికారి సంకల్పం గిరిజన గర్భిణుల పాలిట వరంగా మారింది. పలువురి తల్లీబిడ్డలకు ప్రాణభిక్షను పెడుతోంది. ఎత్తైన కొండల్లో జీవనం సాగిస్తున్న గిరిజన మహిళలు గర్భం దాల్చాక దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారు నెలలు నిండాక ప్రసవాలకు కొండ దిగువన ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లడానికి సరైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేవు. అలాంటి వారిని కుటుంబ సభ్యులో, గ్రామస్తులో కిలోమీటర్ల కొద్దీ పడుతూ లేస్తూ డోలీలో మోసుకుని మైదాన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. ఇలా పలువురు మార్గమధ్యలోనే ప్రసవిస్తున్నారు. ప్రసవ సమయంలో తగిన వైద్యమందక వీరిలో కొందరు తల్లీబిడ్డలు అశువులు బాస్తున్నారు. గిరిజన గర్భిణుల ఈ దుర్భర స్థితిపై ప్రభుత్వాలు స్పందించడం లేని కొంతమంది లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు చేశారు. అయినా ఏళ్ల తరబడి ఏ అధికారి వీరి సమస్యను పట్టించుకోలేదు. అయితే వీరి పరిస్థితి 2018లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా వచ్చిన లక్ష్మీశాను కదిలించింది. దీంతో ఆయన గుమ్మలక్ష్మీపురం, సాలూరుల్లోని యూత్ ట్రైబల్ సెంటర్లలో గిరి శిఖర గర్భిణుల వసతి గృహాల

ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దేశంలోనే గిరిజన గర్భిణుల కోసం ఇలాంటి హాస్టల్స్కు తొలిసారిగా శ్రీకారం చుట్టారాయన. ఒక్కో హాస్టల్లో 40 మంది గర్భిణులు ఉండేలా సదుపాయాలు కల్పించారు. ఆయా గిరిజన గ్రామాల్లో గర్భిణుల వివరాలను సంబంధిత అంగన్వాడీ టీచర్లను సేకరిస్తారు. ఈ గర్భిణులకు ఏడో నెల వచ్చాక కొండలపై నుంచి అంబులెన్స్ ఈ హాస్టల్స్కు తీసుకొస్తారు. ఈ వసతి గృహాల్లో వీరికి రాగి సంకటి, రాగి జావ, గుడ్లు, పాలు, టీ, కాఫీ, పండ్లతో పాటు బలవర్ధకమైన ఇతర పౌష్టికాహారాన్ని అందజేస్తారు. రోజుకు మూడు షిఫ్టుల్లో ఎఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, సిబ్బందితో పాటు వైద్యాధికారి కూడా అందుబాటులో ఉంటారు. వైద్య సిబ్బంది 24 గంటలూ వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. నెలలు నిండాక పురిటి నొప్పులు మొదలు కాగానే అంబులెన్స్లో సమీపంలోని పీహెచ్సీ / సీహెచ్సీల్లో చేర్పించి వైద్యాధికారులతో ప్రసవాలు చేయిస్తారు. అంతేకాదు. గర్భిణులు ప్రసవానంతరం తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వీడియోల్లో ప్రదర్శిస్తారు. దీనివల్ల బాలింతలు, నవజాత శిశువుల మరణాలను తగ్గించగలుగుతున్నారు.

ఈ హాస్టళ్లలో ఇంకేమున్నాయి?

ఈ గర్భిణుల హాస్టళ్లలో పౌష్టికాహారాన్ని అందించడమే కాదు.. సుఖ ప్రసవానికి వీలుగా యోగా, నడక, తేలికపాటి వ్యాయామం వంటివి చేయిస్తారు. వీరికి సౌకర్యవంతమైన పరుపుల మంచాలు, కుర్చీలు, వినోదాన్ని అందించేందుకు టీవీలను కూడా ఏర్పాటు చేశారు. కొత్తగా సీతంపేటలో మరొకటి.. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇప్పటికే సాలూరు, గుమ్మలక్ష్మీపురంలలో రెండు గిరి శిఖర గర్భిణుల వసతి గృహాలున్నాయి. కొత్తగా ఆగస్టు 30న సీతంపేటలో మరొకటి ఏర్పాటు చేశారు. త్వరలో పార్వతీపురంలో గిరి గర్భిణుల కోసం నాలుగో హాస్టల్ను ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఇప్పటివరకు 2,500 మందికి పైనే..

ఈ హాస్టళ్లు ఏర్పాటయ్యాక ఇప్పటివరకు కొండలపై ఉంటున్న 2,500 మందికి పైగా గర్భిణులను ప్రసవాల కోసం చేర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ హాస్టళ్లను అందుబాటులోకి తెచ్చాక గిరిజన గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల మరణాలు గణనీయంగా తగ్గుతున్నాయని పార్వతీపురం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి విజయ పార్వతి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. 2022లో 22 మంది, 2023లో 12 మంది, ఈ సంవత్సరం ఇప్పటివరకు నలుగురు మాత్రమే గర్భిణులు/బాలింతలు/నవజాత శిశువుల మరణాలు సంభవించాయని తెలిపారు.

నీతి ఆయోగ్ మెచ్చుకోలు..

గిరిజన ప్రాంతాల్లో ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివశిస్తున్న వారి కోసం దేశంలోనే తొలిసారిగా ప్రిగ్నెంట్ హాస్టళ్ల ఏర్పాటును నీతి ఆయోగ్ ఎంతగానో మెచ్చుకుంది. వీటికి శ్రీకారం చుట్టిన అప్పటి ఐటీడీఏ పీవో లక్ష్మీశాకు అవార్డును కూడా ప్రదానం చేసింది. గతంలో నీతి ఆయోగ్ అధికారులు కూడా ఈ హాస్టళ్లను సందర్శించి అభినందించి వెళ్లారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంత జిల్లాల్లో ఇలాంటివి ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలని ఈ అధికారులు సిఫార్సులు చేశారు. కానీ అవేమీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల గిరిజన సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన సమీక్షా సమావేశంలో గరిజన జిల్లాకో గిరి శిఖర గర్భిణుల హాస్టల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. అవెప్పుడు కార్యరూపం దాలుస్తాయో చూడాలి.

సిబ్బందికి జీతాల్లేవ్..

ఈ హాస్టళ్లలో గిరిజన గర్భిణులకు సేవలందిస్తున్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందికి గత మూడేళ్లుగా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ వీరు తమ సేవలను కొనసాగిస్తున్నారు. గతంలో ఈ హాస్టళ్లకు కేటాయించిన అంబులెన్స్లో డీజిల్ పోయించని పరిస్థితులు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించి ఇటవల సీతంపేటలో ఏర్పాటు చేసిన హాస్టల్ను వైద్యారోగ్యశాఖ రెగ్యులర్ సిబ్బందితోనే నడుపుతున్నారు.

ఆనంద 'డోలి’కల్లో గిరిజనులు..

ఏళ్ల తరబడి మైళ్ల కొద్దీ దూరం కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, అరణ్యాలను దాటుకుంటూ గర్భిణులను అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో డోలీల్లో మోసుకుంటూ కొండ దిగువకు తెచ్చే వారు. మార్గమధ్యలోనే ముందుగానే ప్రసవించడమో, సరిగా ప్రసవం జరగక చనిపోవడమో జరిగేది. ఈ ప్రిగ్నెంట్ హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాక అలాంటి అవస్థలు తప్పాయి. పలువురి గిరిజన గర్భిణులు, నవజాత శిశువుల మరణాలు చాలా వరకు తగ్గాయి. దీంతో డోలీ మోతల నుంచి విముక్తి పొందిన వీరు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. గతంలో ఐటీడీఏ పీవోగా ఉన్న సమయంలో గిరి శిఖర గర్భిణుల హాస్టళ్లకు పురుడు పోసిన లక్ష్మీశా.. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మన్యం ప్రాంత గిరిజనులు ఆడ, మగ తేడా లేకుండా ఇప్పుడు ఆయనను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News