చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ నెట్వర్క్ నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నడుపుతున్న గ్లోబల్ ఆసుపత్రిని మూసి వేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా డిప్యూటీ డీఎం అండ్ హెఓ రమేశ్ బాబు చెప్పారు. కిడ్నీ తొలగిస్తుండగా మరణించిన విశాఖపట్టణానికి చెందిన యమున మృతదేహాన్ని పంచనామా కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
పేదల ఆర్థిక అవసరాలు, వారి అవయవాలనే పెట్టుబడిగా మార్చుకున్న కిడ్నీ రాకెట్ ముఠా వెనక ఉన్న అనేక కఠోర వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ ఆస్పత్రి నిర్వాహకుడు జిల్లా స్థాయి అధికారి కావడం కూడా ఇక్కడ గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా, పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేకపోవడం వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో చెప్పడానికి మదనపల్లిలో ఊహించని విధంగా కిడ్నీ రాకెట్ తెరమీదకి రావడమే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.
ప్రభుత్వాసుపత్రి నుంచే నెట్వర్క్..
మదనపల్లి ప్రభుత్వాసుపత్రి కేంద్రంగానే కిడ్నీ రాకెట్ ముఠా నెట్వర్క్ విస్తరించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రి యజమానితో సహా ఆయన కోడలు, డయాలసిస్ కేంద్రాల నిర్వహణందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులు కావడం అనేది ఇక్కడ కీలకంగా కనిపిస్తోంది. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ కోసం వారికోసం పెద్ద నెట్వర్క్ ని నడిపినట్లు తెలుస్తోంది. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు..
విశాఖపట్నం మధురవాడకు చెందిన 29 సంవత్సరాల యమున ముగ్గురు దళారులు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్ మాటలు నమ్మింది. వారి వెంట మదనపల్లెకు యమున వచ్చింది. ఈమెకు తోడుగా వచ్చిన హరిబాబు భర్త అని చెప్పుకున్నాడు. మదనపల్లి కు చేరిన వీరంతా యమునను గ్లోబల్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. మత్తుమందు ఇచ్చిన తర్వాత ఓ డాక్టర్ యమున నుంచి కిడ్నీలు తొలగిస్తుండగా మూర్చ రావడంతో మృతి చెందిందని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఈ ముఠాలోని ఓ మహిళ యమునా తల్లి. సూరమ్మకు ఫోన్ చేసి..
"నీ కూతురు చనిపోయింది. విశాఖపట్నం అని తీసుకుని వస్తున్నాం". అని చెప్పడంతో యమున తల్లి సూరమ్మ తీవ్ర ఆందోళన చెంది బంధువులకు విషయం తెలియజేసింది. వారిలో ఓ వ్యక్తి విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నీ రాకెట్ ముఠా అనే విషయం తెలియకపోయినప్పటికీ అందులోని ఓ మహిళ ఫోన్ చేసిన నెంబర్కు మళ్ళీ కాల్ చేసిన సమాధానం లేదు. దీంతో డయల్ 112 నెంబర్ కు ఫోన్ చేయడంతో తిరుపతి జిల్లా పోలీసులు స్పందించారు. ఆ సెల్ ఫోన్ నెంబర్ సిగ్నల్ ఆధారంగా మదనపల్లిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మదనపల్లి టూ టౌన్ సిఐ రాజారెడ్డికి సమాచారం అందించడంతో మంగళవారం రాత్రి ఆసుపత్రి పై దాడి చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో
మదనపల్లెలో కిడ్నీ రాకెట్ ముఠా పనిచేస్తుందని విషయం బయటపడింది.
విశాఖపట్నం నుంచి యమునను తీసుకువచ్చే సమయంలో దాదాపు 8 .50 లక్షలు చెల్లించే విధంగా ధర మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఊహించని విధంగా యమున చనిపోవడంతో, ఆ నగదు పంపకాల్లో వచ్చిన తేడా వల్ల హరిబాబు (యమున వెంట వచ్చిన వ్యక్తి) ముఠా సభ్యులతో గొడవపడ్డాడని తెలిసింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తన కూతురు మరణించిందనే సమాచారంతో బంధువులతో కలసి మదనపల్లెక చేరుకున్న యమున తల్లి సూరమ్మ కన్నీరుమున్నీరైంది. మాయమాటలు చెప్పి ఇంతదూరం తీసుకుని వచ్చారంటూ తల్లడిల్లింది. సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మదనపల్లి టూ టౌన్ సిఐ రాజారెడ్డి చెప్పారు.
"గ్లోబల్ ఆస్పత్రి నిర్వాహకుడైన చిత్తూరు డిసిహెచ్ఎస్ ఆంజనేయులు, యమునను విశాఖ నుంచి తీసుకుని వచ్చిన పెళ్లి పద్మ, కాకర్ల సత్య, సూరిబాబు, మదనపల్లి కదిరి డయాలసిస్ కేంద్రాల మేనేజర్లు బాలరంగబాలు, మెహరాజ్ పై హత్య మానవ అవయవాల అక్రమ రవాణా కు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదు చేశాం" అని సీఐ రాజారెడ్డి చెప్పారు.
"మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో బెంగళూరు నుంచి వచ్చిన డాక్టర్ కిడ్నీ తొలగించారు. ఆయన పేరు ఏమిటో కూడా తెలియడం లేదు" అని మదనపల్లి టూ టౌన్ ఎస్ఐ రహీం చెప్పారు.
"కిడ్నీ రాకెట్ లో గ్లోబల్ ఆసుపత్రి, యజమాని, చిత్తూరు డిసిహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు కోడలు డాక్టర్ శాశ్వతి పాత్ర ఏమిటి అనేది కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది" ఎస్ఐ రహీం చెప్పారు.
అక్రమంగా కిడ్నీలు మార్పిడి చికిత్స చేస్తున్న గ్లోబల్ ఆసుపత్రిని బుధవారం సాయంత్రం సీట్ చేశారు. పోలీసుల దర్యాప్తు సాగడానికి వీలుగా తాత్కాలికంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మూసివేశారు. ఈ ఆసుపత్రిని డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ రమేష్ బాబు, అన్నమయ్య జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్ మీడియా అధికారి దేవసేరోమని, డాక్టర్ శ్రీధర్ బాబు, 104 ఓఈ ప్రవీణ్, డిప్యూటీ హెచ్ఈఓ రాజగోపాల్ పరిశీలించారు. గ్లోబల్ ఆసుపత్రిలో కూడా వారంతా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
"గ్లోబల్ ఆసుపత్రిలో తనిఖీలు చేశాం. కిడ్నీల మార్పిడి వ్యవహారం పై పరిశీలన కూడా చేసాం. ఈ నివేదికను జిల్లా వైద్యశాఖ అధికారులకు, కలెక్టర్ కు అందిస్తాం" అని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ రమేష్ బాబు చెప్పారు.
"కిడ్నీల మార్పిడికి కేంద్రంగా మారిన గ్లోబల్ ఆసుపత్రిని పూర్తిగా సీజ్ చేయాలని అనుకున్నాం. పోలీసుల దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతుంది. వాస్తవాలు వెలుగులోకి రావడానికి వీలుగా ఆ ప్రైవేట్ ఆసుపత్రిని తాత్కాలికంగా మూసి వేయించాం" అని డిప్యూటీ డిఎంహెచ్వో రమేష్ బాబు వివరించారు.
తిరుపతికి యమున మృతదేహం...
కిడ్నీలు తొలగిస్తుండగా మరణించిన విశాఖపట్టణానికి చెందిన యమున మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మదనపల్లె ఆస్పత్రిలో శవపరీక్ష జరిగింది. అయితే, యమున శరీరం నుంచి రెండు కిడ్నీలు తొలగించారా? లేదా ఒకటా? ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆమె మరణించడానికి దారి తీసిన పరిస్థితి ఏమిటనేది తేల్చడానికి తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసుల ద్వారా తెలిసింది.
మదనపల్లెకు గురువారం ఇద్దరు మంత్రులు రానున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి నిరసన సెగ తగలకుండా, యమున మృతదేహాన్ని తిరుపతికి తరలిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. దీనిపై స్పందించిన మదనపల్లె టూ టౌన్ ఎస్ఐ రహీం మాట్లాడారు.
ఈ వ్యవహారంపై మదనపల్లె టూ టౌన్ ఎస్ఐ రహీంతో ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి మాట్లాడారు.
" యుమున మృతదేహానికి మదనపల్లో ప్రభుత్వాస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం చేశారు. కిడ్నీలకు సంబంధించి మదనపల్లె ఆస్పత్రిలో వైద్యుడు లేరు. కిడ్నీలు తొలగిస్తుండగా, యమున మరణించిందనే విషయం వెలుగు చూసింది. ఈ విషయం నిర్థారించడానికి యమున మృతదేహాన్ని తిరుపతికి తరలిస్తున్నాం" అని ఎస్ఐ రహీం చెప్పారు. ఆ మేరకు మదనపల్లె ప్రభుత్వాస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, షుకూర్, ఆసత్పి సూపరింటెండెంట్ సిఫారసు చేశారని కూడా ఆయన వివరించారు.