కొండపల్లి ఖిల్లాలో ట్రైనీ ఐఏఎస్ లు
కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ చేసిన అధికారులు.
శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారుల టీమ్ కొండపల్లి ఖిల్లాను సందర్శించింది. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ లాల్‌బహదూర్ శాస్త్రీ నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 20 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు బుధవారం కొండపల్లి కోటను సందర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వారికి కొండపల్లి ఖిల్లా చరిత్ర, గొప్పతనం గురించి వివరించారు. ఫీల్డ్ స్టడీ, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా కొండపల్లికి వచ్చిన ఈ ట్రైనీ అధికారులు లక్ష్మీషా ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ చేశారు.
చారిత్రక ప్రాధాన్యతపై చర్చ
కొండపల్లి కోట శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనమని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఈ సందర్భంగా కోట చారిత్రక ప్రాధాన్యత గురించి శిక్షణార్థులతో వివరంగా చర్చించారు. కోట చరిత్ర ఈ శిక్షణా కార్యక్రమంలో ఒక ముఖ్య అంశంగా ఉంటుందని తెలిపారు.
మ్యూజియం, కోట నిర్మాణ విశేషాలు
అనంతరం కోటలోని మ్యూజియంలో ఉన్న విశేషాలను ట్రైనీ ఐఏఎస్ అధికారులకు వివరించారు. ప్రధాన ద్వారం, పాలనా విభాగం, పర్యవేక్షణ వ్యవస్థ తదితర అంశాలను ఆయన వారికి వివరంగా తెలియజేశారు.
పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు
ఎన్టీఆర్ జిల్లాలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం కలిసి ఉన్న విశిష్టతను దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.