ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వాలు వివిధ పేర్లతో నిర్వహించే సమ్మిట్లకు విశాఖపట్నమే అనువైనదిగా పాలకులు భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో విశాఖ నగరాన్ని ఎంచుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటివరకు నాలుగు నాలుగు పార్టనర్‌షిప్ సమ్మిట్లు నిర్వహించారు. ఈ నాలుగూ విశాఖలోనే జరిగాయి. వీటిలో తెలుగుదేశం ప్రభుత్వం మూడు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒకటిæ నిర్వహించాయి. టీడీపీ పాలనలో జరిగిన వాటికి పార్టనర్‌షిప్ సమ్మిట్‌లు అని, వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన సమ్మిట్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని పేర్లు పెట్టారు. ఇప్పుడు అంటే.. ఈనెల 14, 15 తేదీల్లో మళ్లీ టీడీపీ పాలనలో జరగబోయే సదస్సుకు కూడా పార్టనర్‌షిప్ సమ్మిట్‌గానే వ్యవహరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం నాలుగు, వైఎస్సార్‌సీపీ ఒకటి చొప్పున ఈ సమ్మిట్లను నిర్వహించారన్న మాట!
2016 పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు
వైజాగ్‌నే ఎందుకు ఎంచుకుంటున్నారు?
పార్టనర్‌షిప్ సమ్మిట్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్.. ఇలా పేర్లు వేరైనా వాటి లక్ష్యం ఒక్కటే! ఎందుకంటే? అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకుని ఈ సదస్సులను నిర్వహిస్తాయి. ఈ సదస్సులకు విశాఖనే ఎందుకు ఎంచుకుంటున్నారంటే? ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖపట్నమే. రాజధాని అమరావతి అయినప్పటికీ ఇంకా అది పురిటి దశలోనే ఉంది. దానికి సమీపంలోనే విజయవాడ నగరం ఉంది. విశాఖపట్నంతో పోల్చుకుంటే విజయవాడలో మౌలిక వసతులు, హంగులూ, ఆర్భాటాలు తక్కువ. వైజాగ్‌లో అలా కాదు.. ప్రకృతి సౌందర్యం ఈ నగరం సొంతం. వీటన్నిటì తో పాటు పర్యాటక రంగంలోనూ అగ్రగామిగా ఉంది. ఒకపక్క సాగరతీరం. మరోపక్క పచ్చని తూర్పు కనుమల పర్వత శ్రేణులు. పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి చెందిన గ్రేటర్ సిటీ. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం. స్టీల్‌ప్లాంట్, హిందుస్థాన్ షిప్‌యార్డు, నేవల్ డాక్‌యార్డు, ఎన్‌ఎస్‌టీఎల్, హెచ్‌పీసీఎల్.. ఇంకా మరెన్నో ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. రైలు, రోడ్డు, సముద్ర, వాయు మార్గాలున్న ఏకైక మహా నగరం విశాఖ. ఇన్ని వసతులు, సదుపాయాలు, వనరులు ఉన్న నగరం కావడంతో వైజాగ్ పెట్టుబడులకు అనువైనది అనే నమ్మకం దేశ, విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారుల్లో కలుగుతుంది. సానుకూల ధృక్పథం ఏర్పడుతుంది. పైగా దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, డెలిగేట్లకు అవసరమైన స్టార్ హోటళ్ల వసతి సదుపాయం కూడా విశాఖలో పుష్కలంగా ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నందునే ప్రభుత్వాలు విశాఖను పార్టనర్‌షిప్ సమ్మిట్లకు వేదికగా చేసుకుంటున్నాయి.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వైఎస్ జగన్, ముఖేష్ అంబానీ తదితరులు
విశాఖలో జరిగిన సమ్మిట్లను పరిశీలిస్తే..
+ రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిన్నర తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2016 జనవరి 10, 11, 12 తేదీల్లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ విశాఖలో నిర్వహించారు. సాగరతీరానికి చేరువలో ఉన్న ఏపీఐఐసీ స్థలంలో జరిగిన ఆ సదస్సులో 4.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 331 ఎంవోయూలు కుదిరాయి.
+ 2017 జనవరి 27, 28 తేదీల్లో విశాఖ కేంద్రంగా రెండ్రోజుల పాటు పెట్టుబడిదార్ల భాగస్వామ్య సదస్సు జరిగింది. ఇందులో 10.54 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం 665 ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
+ 2018 ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో విశాఖ ఏపీఐఐసీ గ్రౌండ్‌లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ జరిగింది. ఆ సదస్సుకు 50 దేశాల నుంచి నాలుగు వేల మంది డెలిగేట్స్ హాజరయ్యారు. 734 ఎంవోయూలు జరిగాయి. రూ.4.39 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మూడు సదస్సులను చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా నిర్వహించారు.
+ 2019లో వైస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరిట 2023 మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించింది. ఈ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల విలువైన 352 ఎంవోయూలు కుదిరాయి. దీనికి 40 దేశాల ప్రతినిధులు, ఎనిమిది వేల మంది వరకు డెలిగేట్లు హాజరయ్యారు.
+ శుక్ర, శనివారాల్లో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 410 ఎంవోయూలు లక్ష్యంగా పెట్టుకున్నారు.