అరకు కాఫీ తోటలను అల్లాడిస్తున్న కాఫీ బెర్రీ బోరర్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా దీనిపై పదకొండు మందితో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లోకెల్లా ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే కాఫీ పంట సాగవుతోంది. ఈ జిల్లాలో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ పండుతోంది. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, రసాయన ఎరువులు వాడకుండా పండే కాఫీ కావడంతో ఈ అరకు కాఫీ ఇతర కాఫీలకంటే విభిన్న రుచిని కలిగి ఉంటుంది. ఇలా తన ప్రత్యేక రుచితో అంతర్జాతీయ ఖ్యాతీని ఆర్జించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపుతో పాటు గిరాకీ కూడా ఉంది. ఇప్పటివరకు బోర్రీ బోరర్ పురుగు కాఫీ పండించే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ప్రభావం చూపుతోంది. అయితే అక్కడ కాఫీ తోటలకు రసాయన ఎరువులు వినియోగిస్తారు. కానీ రసాయన ఎరువులకు దూరంగా సంప్రదాయ పద్ధతిలో సాగయ్యే అరకు కాఫీకి తొలిసారిగా బెర్రీ బోరర్ (హైపొతినెమస్ హంపె) అనే కాయ తొలిచే పురుగు సోకినట్టు గత నెల 11న వెలుగు చూసింది. తొలిసారిగా అరకులోయ మండలం పకనగుడలో ఇది బయటపడింది. దీంతో ఈ పురుగు కాఫీ తోటలను సాగు చేసే గిరిజన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని నివారణకు ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది.
కాఫీకి బెర్రీ బోరర్ సోకిన విషయం బయటపడగానే ప్రభుత్వ నివారణ చర్యలకు ఉపక్రమించింది. వెనువెంటనే అల్లూరి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో పది గ్రామాల్లో కాఫీ తోటలకు బెర్రీ బోరర్ పురుగు సోకినట్టు అల్లూరి జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. ఐటీడీఏ, ఉద్యాన శాఖ, కేంద్ర కాఫీ బోర్డు అధికారులు బెర్రీ బోరర్‌ను నియంత్రించే చర్యలు చేపట్టారు. మరోవైపు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీలకు చెందిన 169 మంది విద్యార్థులు, 27 మంది శాస్త్రవేత్తలు ఈ కాఫీ తోటల్లో సమగ్ర సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ కాఫీ తోటలకు బెర్రీ బోరర్ ప్రభావం ఉందో పరిశీలన చేశారు.
అల్లూరి జిల్లాలోని కాఫీ తోటలకు ఇప్పటివరకు 158.17 ఎకరాల్లో పూర్తిగాను, 1,774 ఎకరాల్లో స్వల్పంగానూ బెర్రీ బోరర్ సోకినట్టు నిర్ధారించారు. ఆయా తోటల్లో 17,664 కిలోల కాఫీ కాయలను చెట్ల నుంచి కోయించేశారు. వాటిని వేడి నీటిలో ఉడకబెట్టి గొయ్యి తీసి పాతి పెట్టించారు. ఇంకా బ్రోకో ట్రాప్స్ ఎరలతో తోటల్లో వేలాడదీసి పురుగులను ట్రాప్ చేస్తున్నారు. బెర్రీ బోరర్ పురుగు నివారణకు బవేరియా బేసియానా సిలీంద్రాన్ని పిచికారి చేయిస్తున్నారు. ‘ఇప్పటిదాకా 1,68,689 ఎకరాల్లో బెర్రీ బోరర్‌పై సర్వే జరిగింది. రెండు మూడు రోజుల్లో›సర్వే పూర్తవుతుంది. బెర్రీ బోరర్ నియంత్రణ చర్యల్లో 500 మంది ఉపాధి హామీ కూలీలు, మరో 200 మంది కాఫీ బోర్డు క్షేత్రస్థాయి సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. బెర్రీ బోరర్ సోకిన కాయల తొలగింపు నూరు శాతం పూర్తయింది’ అని ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధికి వివరించారు.
11 మందితో ఉన్నత స్థాయి కమిటీ..
ఇలావుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాఫీకి సోకిన బెర్రీ బోరర్ తెగులు నివారణ కోసం మంగళవారం 11 మందితో స్టేట్ లెవెల్ రెస్పాన్స్ టీమ్ (ఉన్నత స్థాయి కమిటీ)ని నియమించింది. ఇందులో వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (చైర్మన్), గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ (వైస్ చైర్మన్), రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ (మెంబర్ సెక్రటరీ), ఉద్యాన శాఖ డైరెక్టర్, కాఫీ బోర్డు సీఈవో అండ్, సెక్రటరీ, సెర్ప్ సీఈవో, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఎండీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్, సెంట్రల్ కాయిర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌లు ఉన్నారు.
కమిటీ సభ్యులు ఏం చేయాలంటే?
– కాఫీ పండించే ప్రాంతాల్లో బెర్రీ బోరర్ ఉధృతిని సకాలంలో గుర్తించాలి.
– బెర్రీ బోరర్ పునరావృతమైతే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి.
– జిల్లా స్థాయి కంటైన్‌మెంట్ కమిటీ, స్థానిక కమిటీలను కాఫీ తోటల సర్వే, బెర్రీ బోరర్ నియంత్రణకు సంబంధించిన ఇతర పర్యవేక్షణ పనులను వాడుకలో ఉన్న చట్టాల ప్రకారం తక్షణం చేపట్టేలా అవగాహన కల్పించాలి.
– జిల్లా స్థాయి కమిటీ, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించాలి.
– జిల్లా స్థాయి కమిటీ, ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలపై ఈ బృందం అవసరమైన చర్యలు తీసుకోవాలి.
–జిల్లా స్థాయి కమిటీ ప్రతిపాదించిన మేరకు చర్యలను తీసుకోవడంతో పాటు బెర్రీ బోరర్ నియంత్రణకు ఆర్థిక సాయంపై ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి.
– బెర్రీ బోరర్ నియంత్రణ కోసం దీర్ఘకాలిక వ్యూహాలను (విధాన సిఫార్సులను) సూచించాలి. వీటిలో సంబంధిత రైతులకు బీమా కవరేజ్ లేదా ఆర్థిక సాయం పథకాలుంటాయి.
– గుంటూరులోని ఉద్యాన శాఖ, పట్టు పురుగుల శాఖ డైరెక్టర్ తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అని ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది.