అమెరికా వీసా రాలేదని యువ డాక్టర్ ఆత్మహత్య
గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ రోహిణి ఏడాదిగా అమెరికా వీసా కోసం ఎదురు చూస్తున్నారు.
అమెరికా పిచ్చితో ప్రాణాలు తీసుకుంది. పైగా ఆమె వైద్యురాలు కూడా. కష్టపడి వైద్య విద్యను చదువుకుంది. తల్లిదండ్రులు ఆమెను కష్టపడి చదివించి ప్రోత్సహించారు. ఆమె మెడిసిన్ చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టారు. అయితే అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేయాలని ఆశపడింది. అమెరికా వెళ్లాలనే కోరికను తన మనసులో బలంగా పెంచుకుంది. అందుకు అవసరమైన పరీక్షలు రాసి పాసైంది. వీసా కోసం ఏడాదిగా ఎదురు చూస్తోంది. కానీ వీసా రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. చివరికి బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకుంది. కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఏమి జరిగిందింటే..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువ వైద్యురాలు డాక్టర్ రోహిణి, హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమెరికాలో ఉన్నత విద్య (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫెలోషిప్) పూర్తి చేయాలని కలలకు కన్నారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన జే-1 వీసా కోసం గత ఏడాది నుంచి ఎదురుచూస్తూ మానసిక ఒత్తిడికి గురైన ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకుని హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న రోహిణి, అమెరికాలో స్పెషలైజేషన్ కోసం కష్టపడి పరీక్షలు రాసి ఎంపికైనప్పటికీ, అక్కడి ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, ప్రాసెసింగ్ జాప్యం కారణంగా ఆమెకు వీసా జారీ కాలేదు.
హైదరాబాద్‌లోని తన ఫ్లాట్‌లో అపస్మారక స్థితిలో పడివున్న రోహిణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా నిర్థారించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు. రోహిణి మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె తల్లిదండ్రులు, సోదరులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా వెళ్లాలన్న ఆమె కలలు, కష్టపడి చదువుకున్న జీవితం అర్థ్రాంతరంగా ఆగిపోవడంతో కుటుంబం మొత్తం గుండెలు బాదుకుంటూ రోదించారు.