పాత మేయర్ వద్దు..కొత్త మేయర్ కావాలి

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Update: 2025-11-23 12:20 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ రాజకీయాలు హీటెక్కాయి. సిట్టింగ్ మేయర్ గా ఉన్న పోట్లూరి స్రవంతిని దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు గ్రౌండ్ వర్క సిద్ధమైనట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారంలో ఉన్నప్పటికీ, మేయర్ స్రవంతి ఇటీవల మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ అవడం నెల్లూరు టీడీపీ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ భేటీ టీడీపీ అధిష్టానాన్నికోపోద్రేకానికి గురి చేసింది.  దీంతో మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్‌లో ఈ తీర్మానానికి నోటీసు జారీ చేయనున్నారు, దీంతో మేయర్ స్రవంతి పదవీగండం ఖాయమైనట్లు కనిపిస్తోంది.

మరో వైపు మేయర్ స్రవంతి తీరుపై తెలుగుదేశం పార్టీకి చెందిన 40 మంది కార్పొరేటర్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పొంగూరు నారాయణకు ఫిర్యాదు చేశారు. మేయర్ దంపతులు అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని, వారి అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని కార్పొరేటర్లు ఆరోపించారు. ముఖ్యంగా, మేయర్ భర్త జయవర్ధన్‌పై ఫోర్జరీ సంతకాల కేసులో ఇటీవల జైలు శిక్ష అనుభవించడం ఈ ఫిర్యాదులకు నేపథ్యంగా మారింది. దస్త్రాలు కదలకపోవడం, అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కావడం వంటి అనేక సమస్యలు  ఉన్నాయని కార్పొరేటర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ మేయర్ వద్దని, కొత్త మేయర్ కావాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేటర్ల ఫిర్యాదులతో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకీభవించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి మేయర్ స్రవంతిపై  గుర్రుగా ఉన్నట్లు చర్చ ఉంది.

మేయర్ స్రవంతి మొదట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో ఉండే వారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా మేయర్‌గా ఎన్నికయ్యారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరడంతో స్రవంతి కూడా పార్టీ మారారు. ఈ మార్పు తర్వాత కూడా స్థానిక అభివృద్ధి విషయాల్లో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర మేయర్ మార్పు తప్పదనే టాక్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. 

Tags:    

Similar News