పవన్ ఫొటోపై పిటీషన్‌ను కొట్టేసిన హైకోర్టు
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఏర్పాటును కొండలరావు అనే రైల్వే విశ్రాంత ఉద్యోగి కోర్టులో సవాల్ చేశారు.;
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పొటో ఏర్పాటును నిషేధించాలనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటీషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ఏర్పాటు చేయకూడదనే నిషేధం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. అంతేకాకుండా ఈ వ్యాజ్యంపై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. రాజకీయ దృష్టితో పాటుగా ఉద్దేశపూర్వకంగానే ఈ పిటీషన్ దాఖలైందని అభిప్రాయపడిన ఏపీ హైకోర్టు.. ప్రజాహిత ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొంది. అయితే నిజమైన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దాఖలు చేసే పిటీషన్లను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పాటుగా రాజకీయపరమైన లక్ష్యాలతో కోర్టులను వేదికగా మార్చేందుకు చేసే ప్రయత్నాలు సరైనవి కాదని సూచించింది.