ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయి.;
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నానికి ఇది దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.