గుంటూరు పోలీసు స్టేషన్‌కు గోరంట్ల మాధవ్‌

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ మీద దాడికి ప్రయత్నించారని పోలీసులు మాధవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.;

Update: 2025-04-10 14:06 GMT

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, మాజీ పోలీసులు అధికారి గోరంట్ల మాధవ్‌ను గురువారం గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్య వైఎస్‌ భారతిరెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తుండగా.. ఆ విషయం తెలుసుకున్న గోరంట్ల మాధవ్‌ చేబ్రోలు కిరణ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని వెంబడించారు. గుంటూరు వరకు వెంబడించిన గోరంట్ల మాధవ్‌ చేబ్రోలు కిరణ్‌ అంతు చూస్తానని బెదిరింపులు, దాడి చేసేందుకు ప్రయత్నించారు, దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో గోరంట్ల మాధవ్‌ను గుంటూరు చుట్టుగుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను గుంటూరు నగరపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ వైఎస్‌ భారతిరెడ్డి మీద తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ రంగంలోకి దిగింది. వైఎస్‌ భారతిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ మీద టీడీపీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల మీద కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అనంతరం చేబ్రోలు కిరణ్‌ను అరెస్టు చేయాల్సిందిగా టీడీపీ పెద్దలు పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో చేబ్రోలు కిరణ్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఆయనను అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తుండగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఎపిసోడ్‌ తెరపైకొచ్చింది. చేబ్రోలు కిరణ్‌ను అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న గోరంట్ల మాధవ్‌ అలెర్ట్‌ అయ్యారు. చేబ్రోలు కిరణ్‌ను తరలిస్తున్న పోలీసుల వాహనాన్ని వెంబడించి కిరణ్‌ మీద దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని గుంటూరు నగరపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Tags:    

Similar News