TTD | శ్రీవారి ఏడాది ఆదాయం దేశ రక్షణకు ఇవ్వండి

టీటీడీ ఈఓను ఇద్దరు యాత్రికులు ఇరకాటంలో పెట్టారు. మిలిటరీ సిబ్బందికి ప్రత్యేక కోటా సాధ్యం కాదని డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-24 13:58 GMT
టీటీడీ ఈఓ జే. శ్యామలరావు

తిరుమల శ్రీవారి హుండీకి రోజుకు కనీసంగా రూ. మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయాల వరకు ఆదాయం వస్తోంది. వివిధ ట్రస్టులకు కూడా దాతలు రూ. కోట్లలో అందిస్తున్నారు. ఈ నిధులతో టీటీడీ విద్య, వైద్యం, ఇంజినీరింగ్, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

"వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్న శ్రీవారి హుండీకి లభించే ఆదాయం దేశ రక్షణ నిధికి అందించండి" అని ఒంగోలుకు చెంది నారాయ‌ణ‌, ఖమ్మం జిల్లాకు చెందిన గోపి అనే శ్రీవారి భక్తులు కోరారు.
ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించడం, విజయోత్సవాలు నిర్వహించుకున్న నేపథ్యంలో ఆ భక్తులు స్పందించినట్లు కనిపిస్తోంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లోనియాత్రికుల నుంచి సలహాలు,సూచనలు, సమస్యలు తెలుసుకునేందుకు టీటీడీ ప్రతి నెలా "డయల్ యువర్ ఈఓ" కార్యక్రమం నిర్వహిస్తారు.
తిరుమలలోని అన్నమయ్య భవన నుంచి టీటీడీ ఈఓ జే. శ్యామలరావు శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 35 మంది యాత్రికులు ఫోన్ ద్వారా అనేక సమస్యలు వివరించారు. వయోవృద్ధులకు సహాయకులు ఇవ్వడం, సర్వదర్శనం టోకెన్ల జారీ సమయం మార్చడం కుదరదని ఈఓ చెప్పారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరితో పాటు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
1. స‌త్య నారాయ‌ణ-హైద‌రాబాద్‌
ల‌డ్డూ సేవ‌ను 65 ఏళ్లు దాటిన వారికి ఇవ్వండి. ప‌ర‌కామ‌ణి సేవలో పాల్గొన్న‌వారికి రోజూ ద‌ర్శ‌నం క‌ల్పిస్తే బాగుంటుంది?
ఈఓ: ప‌ర‌కామ‌ణి సేవ చేసిన‌వారికి రోజూ ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం సాధ్యంకాదు. ల‌డ్డూసేవ‌ స‌రైన ఫ‌లితాలు రానందున ఆపేశాం.
2. నాగ‌శ్రీను-రాజ‌మండ్రి
జూలై నెల‌లో ద‌ర్శ‌నాల‌కు అద‌న‌పు కోటా విడుద‌ల చేసే అవ‌కాశం ఉందా?
ఈఓ: ఆన్ లైన్ లో అద‌న‌పు కోటా విడుద‌ల చేసే అవ‌కాశంలేదు. క‌రెంటు బుకింగ్ లో మాత్ర‌మే ద‌ర్శ‌న టోకెన్లు అందుబాటులో ఉంటాయి.
3. ఉషారాణి-హైద‌ర‌బాద్‌
సీనియ‌ర్ సిటిజ‌న్ ద‌ర్శ‌నాల్లో స‌హాయ‌కులుగా మ‌రొక‌రిని పంపించేందుకు వీలవుతుందా?
ఈఓ: అలాంటి అవ‌కాశం ఉండ‌దు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌హాయం అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కులు అందుబాటులో ఉంటారు. (గతంలో ఈ సదుపాయం ఉండేది. దీనిని రద్దు చేశారు
4.ప్ర‌సాద‌రాజు-దేవ‌ర‌ప‌ల్లి
గ‌తంలో తిరుమ‌ల‌లో సీఆర్వోలోనే కాకుండా ఇత‌ర ప్రాంతాల్లో గ‌దుల కేటాయించారు. ప్ర‌స్తుతం సీఆర్వోలో మాత్ర‌మే గ‌దులు ఇస్తుండ‌డంతో భ‌క్తులు ఇబ్బంది ప‌డుతున్నారు?
ఈఓ:ఇత‌ర ప్రాంతాల్లో గ‌దుల కేటాయింపు వ‌ల్ల ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని సీఆర్వోకే ప‌రిమితం చేశాం. దీనిపై భ‌క్తుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.
మిలిటరీ కోటా కుదరదు
5.డాక్ట‌ర్ మ‌నోజ్‌- చ‌త్తీస్‌ఘ‌డ్‌
శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి పారామిలిట‌రీ ద‌ళాల‌కు ప్ర‌త్యేక అవ‌కాశం క‌ల్పించండి.
ఈఓ: ఇప్ప‌టికే ఆర్మ‌డ్ ఫోర్స్ కు ఈ అవ‌కాశం ఉంది. కోటా పెంచ‌డం సాధ్యం కాదు. ఆర్మ‌డ్ ఫోర్స్ కోటాలోనే ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తాం.
6.తిరుప‌త‌య్య‌-హైద‌రాబాద్‌
అఖిలాండ వ‌ద్ద చిరు వ్యాపారుల వ‌ద్ద భ‌ద్ర‌తా సిబ్బంది డ‌బ్బు వ‌సూలు చేస్తున్నారు.
ఈఓ: వివ‌రాలు తెలియ‌జేస్తే ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటాం.
7.రేవంత్-అనంత‌పురం
స‌ర్వ ద‌ర్శ‌నానికి వ‌చ్చిన దివ్యాంగులు ఇబ్బంది ప‌డుతున్నారు. వారికి ఏమైన ప్ర‌త్యేక ద‌ర్శ‌న స‌దుపాయం ఉందా?
ఈఓ: ఇప్ప‌టికే రోజుకు 750 టోకెన్లు వృద్ధులు, దివ్యాంగుల‌కు జారీ చేస్తున్నాం. భ‌క్తుల ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌త్యేక ద‌ర్శ‌న స‌దుపాయం క‌ల్పించ‌లేం.
8. గిరిధ‌ర్-విజ‌య‌వాడ‌
సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌యో భారం దృష్ట్యా ఆల‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌స‌తి గ‌దులు కేటాయించండి. అన్న‌ప్ర‌సాద కేంద్రంలో ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉంటుందా?
ఈఓ:గ‌దుల కేటాయింపు విష‌యంలో మీ సూచ‌న‌ను ప‌రిశీలిస్తాం. అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలోని హాల్‌-1లో ఇప్ప‌టికే సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశాం.
9.గోపాల్ రెడ్డి-హైద‌ర‌బాద్‌
బ్రహ్మోత్సవాల్లో దాత‌ల ద‌ర్శ‌న కోటా ర‌ద్దు చేస్తున్నారు. దీనివల్ల ఇబ్బందిగా ఉంది.
ఈఓ:భ‌క్తుల ర‌ద్దీ కార‌ణంగా దాత‌ల ద‌ర్శ‌న కోటా ర‌ద్దు చేస్తున్నాం.
10.అరుణ్‌-హైద‌ర‌బాద్‌
మేము అర్చ‌న‌ టికెట్ బుక్ చేసుకునే స‌మ‌యానికి మా అబ్బాయికి 12 ఏళ్లు. ద‌ర్శ‌నాకి వ‌చ్చేట‌ప్ప‌టికి 13 ఏళ్లు నిండాయి. దీంతో అనుమ‌తించడం లేదు. ఎలా?
ఈఓ: నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డం సాధ్యం కాదు.
11. సుధాక‌ర్-క‌డ‌ప‌
దివ్యాంగుల‌ను వీల్ చైర్ లో ఆల‌యం లోప‌ల‌కి అనుమ‌తించండి.
ఈఓ: ఆల‌యంలో స్థ‌లాభావం వ‌ల్ల సాధ్యం కాదు.
12. బిందు-హైద‌రాబాద్‌
శ్రీ‌వారి పుష్క‌రిణిలో ప‌రిశుభ్ర‌త లేదు. స‌బ్బులు, షాంపుల‌తో స్నానం చేస్తున్నారు.
ఈఓ: విచారించి, చ‌ర్య‌లు తీసుకుంటాం.
13. నారాయ‌ణ‌-ఒంగోలు. గోపి-ఖ‌మ్మం
దేశ ర‌క్ష‌ణ‌కు ఒక సంవ‌త్స‌ర హుండీ ఆదాయాన్ని విరాళంగా ఇవ్వండి. క్యూలైన్ల‌లో 5-10 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు ప్ర‌త్యేక క్యూ ఏర్పాటు చేయండి.
ఈఓ: పిల్ల‌ల‌కు ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌న ఏర్పాట్లు చేస్తున్నాం.
14. ర‌వికుమార్‌-కావ‌లి
టీటీడీ నేత్ర దాన ట్ర‌స్టు ఏర్పాటు చేస్తే ఎంతో మంది భ‌క్తుల‌కు మేలు జ‌రుగుతుంది.
ఈఓ: ఈ అంశంపై ఇప్ప‌టికే అర‌వింద్ కంటి ఆసుప‌త్రితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం. త్వ‌ర‌లో విధివిధానాలు ప్ర‌క‌టిస్తాం.
15. మ‌హేశ్వ‌ర‌రావు-న‌ర్సారావుపేట‌
ఎస్ఎస్‌డీ టోకెన్లు రాత్రి స‌మయంలో జారీ చేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్నాం?
ఈఓ: భ‌క్తుల సూచ‌న మేర‌కు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. దీనిపై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.
16. నర్సా నాయుడు-అనంత‌పురం
శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద న‌డ‌క‌దారిని వ‌చ్చే భ‌క్తులంద‌రికీ టోకెన్లు ఇవ్వండి?
ఈఓ: ఇప్ప‌టికే రోజుకు 3 వేల నుంచి 4వేల వ‌ర‌కు టోకెన్లు జారీ చేస్తున్నాం. ఆ సంఖ్య‌ను పెంచితే స‌ర్వ ద‌ర్శ‌న భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లుగుతుంది.
17. నామాల‌స్వామి-కాకినాడు
శ్యామ‌ల కుమార్‌-కామారెడ్డి
శ్రీ‌వారి సేవ‌కు ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో కూడా అవ‌కాశం ఇవ్వండి.
ఈఓ: ఆఫ్ లైన్ లో ఇవ్వ‌డం వ‌ల్ల చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఫిర్యాదులు రావ‌డంతో ఆన్ లైన్ లో ఇస్తున్నాం. శ్రీ‌వారి సేవ‌లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్నాం.
18. ల‌క్ష్మీ నారాయ‌ణ‌-హైద‌రాబాద్‌
శ్రీ‌నివాస మంగాపురంలో వేద ఆశీర్వ‌చ‌నాన్ని ఏక బ్రాహ్మ‌ణుడే ఇస్తున్నారు..
ఈఓ:ఈ అంశాన్ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటాం.

Similar News