మెగాస్టార్ నే పట్టించుకోని జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మెగాస్టార్ చిరంజీవికే చుక్కులు చూపించారు;
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మెగాస్టార్ చిరంజీవికే చుక్కులు చూపించారు. ఇళ్ళ నిర్మాణాల అనుమతుల కోసం ప్లాన్ సబ్మిట్ చేసినవాళ్ళకు, నిర్మించిన ఇళ్ళకు మార్పులు, చేర్పులు చేసిన తర్వాత క్రమబద్దీకరణకు ఎంతోమంది తమ ఇళ్ళ ప్లాన్లను జీహెచ్ఎంసీకి(GHMC) దరఖాస్తు చేసుకుంటారన్న విషయం తెలిసిందే. అలాంటి దరఖాస్తులను మాములుగా అయితే సంబంధిత అధికారులు ఒకసారి ఫీల్డ్ తనిఖీలు చేసి అభ్యంతరాలు ఉంటే చెప్పాలి, లేకపోతే అనుమతిస్తు సమాచారం అందించాలి. అయితే రివాజుగా జరిగిపోవాల్సిన వ్యవహారాలు జీహెచ్ఎంసీలో జరగవు. ఎందుకంటే సంబంధిత సెక్షన్లలో అటెండర్ దగ్గర నుండి పై స్ధాయి అధికారులవరకు ఆమ్యామ్యాలు సమర్పించుకోనిదే పనులు కావనే ఆరోపణలు చాలాకాలంగా వినబడుతున్నదే. ఏదో అవస్తలు పడి జనాలు తమ ప్లాన్లను ఓకే చేయించుకుంటుంటారు.
అయితే కొందరి విషయంలో అంటే బాగా పలుకుబడి ఉన్న ప్రముఖల విషయంలో ఇదే అధికారులు మరోరకంగా వ్యవహరిస్తారు. వాళ్ళదరఖాస్తులు ఆఘమేఘాల మీద పరుగులు పెట్టేస్తాయి. రోజుల వ్యవధిలోనే అన్నీ అనుమతులు లేదా మార్పులు, చేర్పులకు ఓకే చెప్పేసి సమాచారాన్ని నోటీసు రూపంలో అందించేస్తారు. అయితే ఇపుడు విషయం ఏమిటంటే మెగాస్టార్(Megastar) చిరంజీవి(Chiranjeevi)కే జీహెచ్ఎంసీ అధికారులు స్టార్లను చూపించారు. విషయం ఏమిటంటే 2002లో మున్సిపాలిటి అనుమతి తీసుకుని చిరంజీవి జీ+2 అంతస్తుల ఇంటిని నిర్మించుకున్నారు. ఈమధ్యనే అదే ఇంటికి మార్పులు చేసి పునర్ నిర్మించుకున్నారు. పునరుద్ధరించిన తనింటిని తనిఖీ చేసి చట్టప్రకారం క్రమబద్ధీకరించాలని మొన్నటి జూన్ 5వ తేదీన చిరంజీవి మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు ఉలకలేదు పలకలేదు. మెగాస్టార్ అంటే ఎవరు అన్న విషయాన్ని చిల్లపిల్లాడిని అడిగినా చెప్పేస్తారు. చిరంజీవి లాంటి ప్రముఖుడి దరఖాస్తును జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఎన్నిసార్లు కలిసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. దాంతో మున్సిపల్ అధికారుల వైఖరిని సవాలు చేస్తు మెగాస్టార్ హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. ఆకేసు సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ సందర్భంగా జడ్జి ఆశ్చర్యపోయినట్లు సమాచారం. దరఖాస్తును పరిశీలించి ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని జడ్జి అడిగినా మున్సిపల్ లాయర్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. చట్టప్రకారం దరఖాస్తుపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుందని మాత్రం హామీ ఇచ్చారు. రెండువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి నాలుగు వారాల్లోగా దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.