తేలని ఆర్ఆర్ఆర్ సీటు పంచాయితీ.. సీన్‌లోకి బీజేపీ నేత
ఆంధ్ర ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజు పోటీ ఎక్కడి నుంచి? ఆయనకు ఉండి టికెట్ ఖరారయిందా? నరసాపురంపైనే రఘురామ గురి ఉందా? అందుకు బీజేపీ ఒప్పుకుంటుందా?
By : S Subrahmanyam
Update: 2024-04-08 01:50 GMT
ఆంధ్రలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు టికెట్ అత్యంత చర్చనీయాంశంగా మారుతోంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో మరో చిచ్చు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తోంది. వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామ.. అప్పటి నుంచి జగన్‌కు పక్కలో బల్లెంలా మారారు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైక క్రమంలో రఘురామ దారెటు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత బీజేపీ నుంచి నరసాపురం టికెట్ వస్తుందని ఆశించిన ఆయనకు బీజేపీ మొండిచేయి చూపింది. దీంతో తాజగా ఆయన టీడీపీ అధినే చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఇప్పుడు రఘురామ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతలోనే రఘురామకు చంద్రబాబు ఉండి నియోజకవర్గం సీటు ఖరారు చేశారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అనేక సీట్ల విషయంలో గందరగోళం నెలకొని ఉన్న సమయంలో రఘురామ ఎంట్రీ ఇవ్వడంతో ఆంధ్ర ఎన్నికల సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో కూడా అర్థం కావట్లేదు. తనకు ఇంకా టీడీపీ అధిష్టానం ఉండి టికెట్ ఖరారు చేయలేదని రఘురామ అంటుంటే తనకు నో చెప్పలేదని సిట్టింట్ ఎమ్మెల్యే రామరాజు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏం ప్లాన్ చేస్తోందనేది తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పోటీ పడతారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించేశారు. కాగా ఇప్పుడు పార్టీలోని రఘురామరాజు చేరడం.. ఆయనకు ఉండి టికెట్ ఫైనల్ అన్న వార్తలు ఉండి రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ఈ వార్తలు విన్న సిట్టింట్ ఎమ్మెల్యే రామరాజు అనుచరులు రోడ్డెక్కి టీడీపీ అధిపతి చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉండి టికెట్‌ను తమ నేతకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా అసలు టికెట్ ప్రకటించిన తర్వాత అభ్యర్థిని ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో భేటి అయిన రామరాజు మాత్రం టికెట్ విషయంలో ఎటువంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు.
రఘురామకు నరసాపురం టికెట్టే వస్తుందా!
ఈ క్రమంలోనే రఘురామకు మళ్ళీ నరసాపురం టికెట్ కన్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పొత్తులోభాగంగా నరసాపురం టికెట్‌ను బీజేపీకి కేటాయించడం.. అక్కడి నుంచి భూపతిరాజు శ్రీనివాసరావును బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగిపోయింది. దీంతో ఇప్పుడు నరసాపురం టికెట్‌ను బీజేపీ నుంచి టీడీపీ ఎలా వెనక్కు తీసుకుంటుంది? అందుకు బీజేపీ ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే బీజేపీ ఖరారు చేసిన అభ్యర్థి సంగతేంటి? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అయితే ఈ విషయంపై బీజేపీతో టీడీపీ అధిష్టానం చర్చలు చేయడానికి సిద్ధమైందని, నరసాపురం టికెట్‌ను తిరిగి తీసుకుని, బీజేపీకి ఏలూరు టికెట్ ఇచ్చే దిశగా చర్చలు చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇందుకు బీజేపీ, టీడీపీ పరస్పరం అంగీకరం తెలిపాయని, త్వరలోనే ఈమేరకు ప్రకటన కూడా రావొచ్చని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ వార్తలను నరసాపురంకు రఘురామ ఊరేగింపు వెళ్లడం బలపరుస్తోంది. మరి ఈ విషయంలో బీజేపీ, టీడీపీ ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.