రుషికొండ ప్యాలెస్ అలియాస్ జగన్ ప్యాలెస్..! గత కొన్నాళ్లుగా ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో విశాఖపట్నం సాగరతీరంలోని రుషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించిన సంగతి తెలిసిందే. దీనికి దాదాపు రూ.453 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారన్న ప్రచారం ఉంది. జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖను పాలనా రాజధానిగా చేసుకుని ఈ భవనాల్లో నివాసం ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారని చెబుతారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోవడంతో జగన్ కల నెరవేరలేదు. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చాక రుషికొండ ప్యాలెస్‌పై దృష్టి సారించింది.
యోగా డే ఖర్చుపై వ్యాఖ్యానిస్తూ వైఎస్ జగన్ యోగ ముద్రలో ఇలా..
రాజకీయ అస్త్రంగా రుషికొండ ప్యాలెస్..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ రుషికొండ ప్యాలెస్ వైపు ప్రతిపక్ష నేతలే కాదు.. ఆ పార్టీ నేతలు సైతం కన్నెత్తి చూసేందుకు అనుమతించలేదు. దీంతో రాజప్రాసాదాన్ని తలపించే ఆ భవనాల్లోకి ఎవరూ అడుగు పెట్టే సాహసం చేయలేక పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ ప్యాలెస్‌లోకి వెళ్లి అందులోని అందాలను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పారు. ఇక అక్కడ నుంచి కూటమి నేతలు ఈ రుషికొండ ప్యాలెస్‌ను రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. రూ.450 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారంటూ వీలు చిక్కినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ ప్యాలెస్ అంటూ ఎగతాళి చేస్తున్నారు.
ప్యాలెస్ లోపల కళ్లు చెదిరే అందాలు ఇలా..
‘రుషికొండ’పై తొలిసారి గళం విప్పిన జగన్..
దాదాపు ఏడాదిన్నరగా కూటమి పక్షాలు రుషికొండ ప్యాలెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా స్పందించని వైఎస్ జగన్. తొలిసారిగా నోరు విప్పారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం రుషికొండలో ప్యాలెస్‌లాంటి భవనాల నిర్మాణానికి రూ.450 కోట్లు ఖర్చు చేశారు. ఆ డబ్బుతో రెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయవచ్చు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. ఇదే విషయాన్ని గురువారం జగన్‌మోహన్‌రెడ్డిని ఓ మీడియా ప్రతినిధి అడిగినప్పుడు ఇలా స్పందించారు. ‘రుషికొండలో రూ.230.. 240 కోట్లతో కట్టిన భవనాలు విశాఖకు మణిహారంగా మారాయి. విశాఖకు అవి తలమానికంగా ఉన్నాయి. ఈరోజు వెళ్లి చూస్తే అది విశాఖపట్నానికి గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. విశాఖకు గవర్నర్ వెళ్లినా, ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినా వారిని ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి భవనమది. లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్న అందులో వారికి ఆతిథ్యం ఇవ్వొచ్చు. అదే చంద్రబాబునాయుడు ఒక్కరోజు యోగా కార్యక్రమం కోసం రూ.330 కోట్లు ఆవిరి చేశారు. దాన్నేమంటారు? ఆరోజు యోగా మ్యాట్లకు ఎంత ఖర్చు పెట్టారో మీకే అర్థమవుతుంది. అమెజాన్‌లోకి వెళ్లి చూస్తే మ్యాట్లకు ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది. వాటిని వీళ్లు ఎంతకు కొనుగోలు చేశారో చూడండి. వాళ్లకంటే 50 శాతం తక్కువ ఉండకపోతే నన్నడగండి. అదో పెద్ద స్కాం కాకపోతే మరేంటి?’ అని జగన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇలా రుషికొండ ప్యాలెస్‌కు, యోగా డే ఖర్చుకు ముడిపెట్టి కూటమి పక్షాలపై ఆయన సరికొత్త అస్త్రాన్ని సంధించారు.
ప్యాలెస్ లోపల కళ్లు చెదిరే అందాలు ఇలా..
వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవన సముదాయం భవిష్యత్తు అవసరాలకు శాశ్వతంగా పనికొస్తాయి. మరి ఒక్క రోజులోనే యోగా డేకి రూ.330 కోట్ల వృధాగా ఖర్చు చేశారు. దానికి చంద్రబాబు, జనసేన నేతలు ఏం సమాధానం చెబుతారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత తాజాగా యోగా డే ఖర్చుపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు సరికొత్త అస్త్రాన్ని అందించినట్టవుతుందని భావిస్తున్నారు.
ఆ ప్యాలెస్ ఖర్చు రూ.453 కోట్లు కాదా?
ఇన్నాళ్లూ వైఎస్ జగన్.. రుషికొండ ప్యాలెస్ కోసం రూ.453 కోట్లు ఖర్చు చేశారంటూ కూటమి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ దీని నిర్మాణానికి తమ ప్రభుత్వం వెచ్చించింది రూ.240 కోట్లేనని జగన్ చెప్పడం ఇప్పుడు దాని ఖర్చుపై సందేహాలను లేవనెత్తుతోంది. తాను రుషికొండ భవనాలకు చేసిన ఖర్చుకంటే వన్‌డే యోగా డే కోసం వెచ్చించిందే ఎక్కువని జగన్ ఆక్షేపించారు. అయితే జగన్ చెబుతున్నట్టు యోగా డేకి ఖర్చు చేసింది రూ.60 కోట్లేనని, అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.21 కోట్లేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ జగన్ తప్పుడు సమాచారంతో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగమేనని వీరు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా యోగా డే వ్యయంపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రుషికొండ ప్యాలెస్‌పై కూటమి నేతలు మునుపటిలా ఆరోపణల దూకుడు తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.