రూ. 10 కోసం కత్తితో పొడిచి చంపేశాడు

విజయవాడ నగరంలో మైనర్ బాలుర్లు దారుణాలకు పాల్పడుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

Update: 2025-12-19 11:07 GMT

విజయవాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మత్తుకు బానిసలవుతున్న యువత ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారనేదానికి ఈ ఘటనే నిదర్శనం. కేవలం పది రూపాయల కోసం జరిగిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం కోసం తాను అడిన పది రూపాయలను ఇవ్వలేదనే కక్షతో ఓ మైనర్ బాలుడు ఒక వ్యక్తని చంపేశాడు.

అసలేం జరిగిందంటే?
కొత్తపేట ప్రాంతానికి చెందిన తాతాజీ (48) అనే వ్యక్తి  శుక్రవారం రాత్రి స్థానిక ఒక బార్ సమీపంలో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ 17 ఏళ్ల బాలుడు, మద్యం తాగేందుకు తన వద్ద డబ్బులు లేవని, రూ. 10 ఇవ్వాలని తాతాజీని అడిగాడు. అందుకు తాతాజీ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కత్తితో విచక్షణారహితంగా దాడి:
గ్రహం కోల్పోయిన ఆ మైనర్ బాలుడు, తన వద్ద దాచుకున్న కత్తిని తీసి తాతాజీపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో తాతాజీ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోరాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పోలీసుల రంగ ప్రవేశం:
సమాచారం అందుకున్న వెంటనే కొత్తపేట (వన్ టౌన్) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడైన మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు గతంలో కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఆందోళనలో స్థానికులు:
జన సంచారం ఉండే ప్రాంతంలో, అది కూడా బార్ల వద్ద ఇలాంటి దాడులు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలవుతున్న మైనర్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
Tags:    

Similar News