శ్రీవారికి ఆస్తులు దారదత్తం చేసిన హైదరబాద్ యాత్రికుడు
టీటీడీకి మాజీ ఐఆర్ ఎస్ అధికారి వీలునామా అందించిన ట్రస్టు సభ్యులు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-24 10:44 GMT
తన మరణానంతరం ఆస్తి మొత్తం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి సమర్పించాలని హైదరాబాదుకు చెందిన మాజీ ఐఆర్ ఎస్ అధికారి వీలునామా రాశారు. ఆ మేరకు రూ. మూడు కోట్ల విలువైన ఇల్లు, బ్యాంకు ఖాతాలోని రూ. 66 లక్షల నిధులు ట్రస్టు సభ్యులు గురువారం తిరుమలలో అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి అందించారు.
టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి వీలునామా పత్రాలు అందిస్తున్న భాస్కరరావ్ ట్రస్టు సభ్యులు
హైదరాబాద్ నగరం వనస్థలి పురానికి చెందిన వైవిఎస్ఎస్. భాస్కరరావు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (Indian Revenue Service IRS ) పదవీ విరమణ చేశారు. ఆయన జీవించి ఉండగానే వనస్థలిపురంలోని ఇల్లు బ్యాంకు ఖాతాలోని డబ్బు తిరుమల శ్రీవారి పేరిట వీలునామా రాశారు.
వనస్థలిపురంలోని "ఆనంద నిలయం" పేరిట 3,500 చదరపు అడుగుల్లో భవనం నిర్మించుకున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఈ ఇంటిని వినియోగించాలని కూడా భాస్కరరావు వీలునామా రాశారు.
మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కరరావు ఇటీవల మరణించారు. దీంతో ఆయన కోరిక మేరకు ట్రస్టు సభ్యులు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్ వీలునామాతో పాటు, ఆస్తి పత్రాలు కూడా టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి తిరుమలలో అప్పగించారు. వీలునామాలో ఏమి రాశారంటే.
"మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కరరావు జీవించి ఉండగానే ఆస్తులను టీటీడీ పేరిట రాశారు. అందులో
తను బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, శ్రీవేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వండి" వీలునామాలో రాశారని ట్రస్టు సభ్యులు తెలిపారు.
తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో అంకితమై ఉండాలని భాస్కరరావు ఆకాంక్షించారని ట్రస్టు సభ్యులు తెలిపారు. ఆయన అంతిమ కోరిక మేరకు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సీ.హెచ్. వెంకయ్య చౌదరి అందజేశారు.వారిని అదనపు ఈవో సత్కరించారు. మంచి కార్యానికి కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు.