బాబు కళ్ళలో ఆనందం కోసం... తమ్ముళ్ల ఆరాటం..

యాత్రికుల సెంటిమెంట్ గాలికి పోయింది. పదవుల వేటలో ఉన్న నేతల్లో ఇంకా ఆశలు తగ్గలేదు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం గొంతుతో గొంతు కలుపుతున్నారా?

Update: 2024-09-26 11:38 GMT

సీఎం చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడడమే ఆ పార్టీ నాయకులకు ఇష్టం. చివరాఖరికి ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీ నేతలకు కూడా. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు పట్టించుకోవడం అంటుంచి రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మినహా, సున్నితంగా వ్యవహరించడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు.

"తిరుమల లడ్డు తయారీకి వాడిన వెయ్యిలో కల్తీ జరిగింది" ఇది సీఎం చంద్రబాబు వారం కిందట పేల్చిన ఆరోపణల తూటాలు. రెండు నెలల తర్వాత టీటీడీ ఈవో జే శ్యామరావు కూడా అదే పాట అందుకున్నారు. వీరి వ్యవహారం పక్కకు ఉంచితే.. సీఎం చంద్రబాబు చెప్పిన మాటలనే ఆ పార్టీ నేతలు కూడా సమర్థిస్తున్నారు. మినహా ఇందులో వాస్తవికత ఎంత? అనేది ఏ మాత్రం ఆలోచన చేసిన దాఖలాలు మచ్చులు కూడా కనిపించవు. వీరి సంగతి ఇలా ఉంచితే,

తిరుపతి, తిరుమలలో పూర్తి తెలిసిన వ్యక్తులు వివిధ పార్టీలో నాయకులుగా ఉన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఔన్నత్యం, ప్రాసస్త్యం అనేవి పక్కకు ఉంచితే, లడ్డు తయారీ ప్రక్రియ, తిరుమల ఆచార వ్యవహారాలు, పద్ధతులు స్థానికులకు కొట్టిన పిండి. నిద్ర లేపి అడిగినా, శ్రీవారికి ఏ సమయంలో ఎలాంటి సేవలు నిర్వహిస్తారు. లడ్డూ కథ ఏంది. శ్రీవారి దర్శనం టికెట్లు ఎలా తీసుకోవచ్చు. ఏ మార్గంలో వెళితే పని అవుతుంది. అనే విషయాలు అనర్గళంగా చెప్పగలరు. వీరితో పాటు సీఎం చంద్రబాబు కూడా స్థానికుడే. 15 కిలోమీటర్ల దూరంలోని చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు కాలేజీకి ఎలా వచ్చేవారు. తిరుపతి పరిస్థితి ఎలా ఉన్నది. యాత్రికుల సంఖ్య ఏంటి? వారికి ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలను చూస్తూ పెరిగడమే కాదు. నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. వీరితోపాటు ఆ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులకు కూడా తిరుమలపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తులే.
"వారు కూడా చంద్రబాబు నాయుడు తెర మీదికి తీసుకువచ్చిన నెయ్యిలో కల్తీ వ్యవహారం పై కూడా తీవ్రస్థాయిలోనే ఆరోపణలు చేస్తున్నారు. మినహా, అందులో వాస్తవికత , సాధ్యసాధ్యాలను బేరేజు వేసుకోవడం పక్కన ఉంచారు.
యాత్రికుల మనోభావాలు గాలికి
తిరుమల లడ్డూ వ్యవహారంలో యాత్రికుల మనోభావాలను గాలికి వదిలేశారు. రాజకీయ లబ్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
"ప్రస్తుతం తమిళమాసం (తైమాసం) తిరుమల గత వారం నుంచి శనివారాలు ప్రారంభమయ్యాయి. వాటిని తమిళులతో పాటు ఆ ప్రభావం ఎక్కువగా ఉండే తిరుపతిలో కూడా నియమ నిష్టలతో పాటించడానికి ప్రాధాన్యం ఇస్తారు" గోవిందమాల ధరించే వారు పసుపు దుస్తులు ధరిస్తారు. మూడు లేదా ఐదో శనివారం లేదంటే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే అక్టోబర్ నాల్గవ తేదీ నుంచి తిరుమలకు వెళ్లి దీక్ష విరమిస్తారు.
ఇంతటి బలమైన సెంటిమెంట్ పాటించే తిరుపతి ప్రజల మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. వారి మనోభావాలు రెచ్చగొట్టే విధంగా తిరుమల లడ్డూపై రాజకీయ వేడిని రగులుస్తున్నారు. దీనిపై
వైఎస్. జగన్ ఈ నెల 28వ తేదీ తిరుమల పర్యటనపై తిరుపతికి చెందిన టీడీపీ కార్యదర్శి జీ. నరసింహయాదవ్ లడ్డూ వ్యవహారంపై స్థానిక సెంటిమెంట్ ప్రయోగం చేశారు. అవసరమైతే తిరగబడతారు. అని వ్యాఖ్యానించారు. శ్రీవారి భక్తులు, పీఠాధిపతులు, రాజకీయాలకు అతీతంగా వైఎస్. జగన్ ను ప్రజలు అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు.
2014లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన బీజేపీ అధికార ప్రతినిధి జీ. భానుప్రకాష్ కూడా లడ్డూ వ్యవహారంపై వైసీపీపై విరుచుకుపడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ కూడా ఏమన్నారంటే.. "తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, కోనేటిలో మునిగి ప్రమాణాలు చేస్తే, పాపాలుపోవు" అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
"శ్రీవారి కైంకర్యాల్లో అవినీతికి పాల్పడిన వారికి భగవంతుడు సరైన శిక్ష విధిస్తారు" అని జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ శాపనార్థాలు పెట్టారు. ఇలా కూటిమి నేతల్లో ఎవరికి ఎవరూ తగ్గని స్థితిలో సీఎం చంద్రబాబు గొంతుతో గొంతు కలుపుతున్నారు.
కారణం అదేనా...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100 రోజుల పండుగ జరుపుకుంటోంది. రెండు రోజుల కిందట కొన్ని కార్పొరేషన్ పదవుల భర్తీ ప్రక్రియకు తెరతీశారు. మొదటి విడతలో పదవులు ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు.
"ఇంకా మిగిలిన పదవులు ఉన్నాయి. కలత చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది" అనే సీఎం చంద్రబాబు మాటలు వారికి ఆశావహులకు ఊరట కల్పించాయి.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తిరుపతిలో సీనియర్ నేతల్లో జీ. నరసింహయాదవ్ కు క్యాబినెట్ హోదా కలిగిన తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ) పదవి దక్కింది. ఈయన పార్టీ అవిర్బావం నుంచి టీడీపీకి ఉత్తమ భక్తుడు. అలాగే సీనియర్ నేతల్లో మరొకరు ఆర్సీ మునికృష్ణకు తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి మాత్రమే దక్కింది. మిగతా అనేక మంది సీనియర్లకు మొండిచేయి మిగిలింది. బీజేపీ అధిష్టానం సూచనలతో తిరుపతికి చెందిన భానుప్రకాష్ కు టీటీడీ బోర్డులో పదవి దక్కింది.
2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆ టికెట్ దక్కక భంగపడిన మాజీ ఎంఎల్ఏ ఎం. సుగుణమ్మ పదవుల రేసులో ఉన్నారు. ఇప్పటికే ఆమె సీఎం చంద్రబాబుతో పాటు, ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ తో అనేకసార్లు కలిసి మాట్లాడారు. జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ తిరుపతి నుంచి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, సుభాషిణి, రాజారెడ్డి వంటి వారు పదవుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో నేరుగా సంబంధాలు కలిగిన వారంతా ఆశగా ఉన్నారు. అదే విధంగా బీజేపీ నుంచి భానుప్రకాష్ అదిష్ఠానం నుంచి ఒత్తిడి తెచ్చే పనిలో ఉన్నారు.
వారిలో చాలా మంది కళ్లు టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యత్వంపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో తిరుమల, తిరుపతి ఆధ్యాత్మికతను కాపాడాల్సిన నాయకులందరూ పదవుల వేటలో సీఎం చంద్రబాబు ఆశీస్సుల కోసం పోటాపోటీగా ఉన్నారు. వారి కల ఎంతమేరకు నెరవేరుతుందనేది చంద్రబాబు స్పందనపై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. దసరా తరువాత మళ్లీ పదవుల పందేరం అనే వార్తలు వినిపిస్తున్నాయి. వారి ఆశలు ఎంతమేరకు నెరవేరుతాయనేది కాలం చెప్పే సమాధానం కోసం ఎదురుచూడాల్సిందే.
Tags:    

Similar News