రాజధాని అమరావతికి వరదల తలపోటు
అమరావతికి అన్నీ సమకూరుతున్నాయన్న సమయంలో వరదలు తలనొప్పిగా మారాయి. నేలంతా బురద మయం అయింది.;
రాజధాని అమరావతికి రాజకీయ అస్థిరతతో పాటు మరో తలపోటు ఎదురైంది. ఇప్పటికే వివిధ రాజకీయ, ఆర్థిక కారణాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్ లో పాల్గొనేందుకు పెట్టుబడిదారులు గుంజాటన పడుతున్నారు. రాజధాని నిర్మాణాన్ని తిరిగి గాడిన పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న తరుణంలో వచ్చిన వానలు, వరదలు ఇన్వెస్టర్లను, పాలకుల్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి.
వరద నీరు రాజధాని ప్రాంతాన్ని ముంచెత్తింది. అమరావతి వరుసగా రెండో ఏడూ వరద ముంపుకు గురవుతోంది. గత సంవత్సరం కొండవీటి వాగు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతం అనూహ్యంగా వరద నీటితో నిండిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టనున్న వరద నిరోధక ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కాలేదు. మొదటి నుంచే పర్యావరణ నిపుణులు అమరావతిని రాజధాని స్థలంగా ఎంపిక చేయడంపై హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతంగా ఉంది. ప్రతి ఏడాదీ వచ్చే వరదలు రాజధాని నిర్మాణాన్ని మరింత ఆలస్యం చేసే అవకాశం లేకపోలేదు.
నిర్మాణంలో ఉన్న కార్యదర్శుల భవనాల సముదాయంలోకి వచ్చిన వరద నీరు
రాజకీయ అస్థిరత, వరదల ప్రభావం
అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పటి నుంచి పర్యావరణ నిపుణులు వరదల ప్రమాదంపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. రాజధాని ప్రాంతం ఒకప్పుడు కృష్ణా నది డెల్టాలో తీవ్రమైన వరదలకు గురయ్యే ప్రాంతంలో ఉంది. గత సంవత్సరం కొండవీటి వాగు వరదల వల్ల భారీగా నీరు చేరడం, ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి పునరావృతం కావడంతో ఈ హెచ్చరికలు వాస్తవమని స్పష్టమవుతోంది. ముఖ్యంగా రాజధానిలోని మట్టి స్వభావం అంటే బంకమట్టి కావడం వల్ల నీరు త్వరగా ఇంకిపోవడం లేదు. ఇది నిర్మాణ పనులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నిర్మాణ స్థలాలలోని పునాదుల్లో నీరు నిలిచిపోవడం వల్ల ఇంజిన్ల సహాయంతో నీటిని తోడివేయాల్సి వస్తోంది, ఇది పనుల ఆలస్యానికి, అదనపు ఖర్చులకు దారితీస్తోందని స్వయానా సీఆర్డీఏ అధికారులే వాపోతున్నారు.
అమరావతి ప్రాంతంలోని నీరుకొండ పొలాల్లోకి చేరిన వరద నీరు
అంతర్జాతీయ భాగస్వామ్యం
రాజకీయ అస్థిరత కూడా పెట్టుబడిదారులను వెనక్కి తగ్గేలా చేస్తోంది. అమరావతి ప్రాజెక్టులో భాగం కావడానికి సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా అక్కడి పెట్టుబడిదారులు నేరుగా ప్రాజెక్టులో భాగస్వాములు కాలేమని స్పష్టం చేశారు. అయితే ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల ద్వారా పరోక్షంగా సహకారం అందించడానికి వారు సుముఖత చూపారు. ప్రపంచ బ్యాంకు సహకారం ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు నేరుగా ముందుకు రాకపోవడం ప్రాజెక్టు భవిష్యత్తుపై అనుమానాలను రేకెత్తిస్తోందని సామాజిక సేవా కార్యకర్త టి.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవీటి వాగు
నిర్మాణంలో ఆలస్యం...
ఈ వరుస వరదలు, పెట్టుబడిదారుల వెనుకంజ, నిధుల కొరత వంటి సమస్యలు అమరావతి నిర్మాణాన్ని మరింత ఆలస్యం చేసే అవకాశం ఉంది. వరద నివారణ ప్రాజెక్టులు, శాశ్వత పరిష్కార మార్గాలను ప్రభుత్వం వెంటనే చేపట్టడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. కొండవీటి వాగు వంటి ప్రాంతాల్లో వరద నివారణ చర్యలు చేపట్టడం, పర్యావరణ నిపుణుల సలహాలను పాటించడం, మట్టి స్వభావాన్ని బట్టి ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతులను అనుసరించడం వంటివి ఈ సవాళ్లకు పరిష్కారాలుగా చెప్పవచ్చు. మొత్తం మీద అమరావతి ప్రాజెక్టుకు ప్రస్తుతం వరదల వల్ల ఏర్పడుతున్న సమస్యలు కేవలం పర్యావరణ సవాలు మాత్రమే కాకుండా ఆర్థిక, రాజకీయ సవాళ్లతో ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు.
ముందు నుయ్యి... వెనుక గొయ్యి: రాయలసీమ విమోచన సమితి
అక్కడ పది అడుగుల ఎత్తుతో 50వేల ఎకరాలను పూడ్చగలిగితే అమరావతి రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణం సేఫ్. అలా చేస్తే మరో ప్రమాదం కూడా లేకపోలేదు. విపరీతమైన కాంక్రీటు వర్క్, భూమి హైట్ పెంచడం జరిగితే అమరావతి చూట్టూ ఉన్న మరో లక్ష ఎకరాలు మరెన్నో గ్రామాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ‘ముందుకు పోతే నుయ్యి-- వెనకకు వస్తే గొయ్యి’ అన్నట్లు ఉంది అన్నారు రాయలసీమ విమోచనా సమితీ నేత టి నాగార్జున రెడ్డి.