ఏపీలో జీబీఎస్ తొలి మరణం కేసు నమోదు
గుంటూరు జీజీహెచ్‌లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళనకరంగా మారింది.;
By : Admin
Update: 2025-02-16 14:42 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) వణికిస్తోంది. గుంటూరులో తొలి మరణం కేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమ్మలమ్మ అనే మహిళకు రెండు రోజుల క్రింత ఈ గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ బారిన పడ్డారు. తీవ్ర జ్వరం రావడంతో పాటు ఆమె కాళ్లు చచ్చుబడి పోయాయి. దీంతో ఆందోళన చెందిన కమలమ్మ కుటుంబ సభ్యులు చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులుగా వెంటీలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కమలమ్మ జీబీఎస్‌తో మృతి చెందినట్లు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధృవీకరించారు.
గుంటూరు ఇంకా మరి కొంత మంది జీబీఎస్ బారిన పడిన రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ ఒక్క రోజే ఏడుగురు జీబీఎస్ బాధితులు చికిత్సల కోసం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరో ముగ్గురు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు.
ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సలు పొందుతున్న జీబీఎస్ బాధితుల్లో ఇద్దరు రోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుంటూరు జీజీహెచ్ వైద్య వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిని ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు.
గతంలో కరోనా బారిన పడిన బాధితుల్లో జీబీఎస్ ఎక్కువుగా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది రోగులు జీబీఎస్ వ్యాధితో బాదపడుతున్న వారు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ అంటు వ్యాధి కాకపోయినా అప్రపమత్తంగా ఉండాల్సిందేనని వైద్య వర్గాలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సారిగా ఈ కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకరంగా మారింది.
జీబీఎస్ వ్యాధి చాలా అరుదైన రోగం. లక్షమందిలో ఒకరిద్దరికే వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది కూడా ఒక రకమైన పక్షవాతం వంటి రోగం. ఇతర రకాల ఇన్‌ఫెక్షన్లు వచ్చిన వారికి చాలా వరకు ఈ జీబీఎస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది ముదిరే కొద్ది కండరాలు చచ్చుబడుతాయి. ఈ లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వైద్యుల వద్దకెళ్లి చికిత్సలు పొందితే దీని బారి నుంచి బయట పడొచ్చు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. ఒకప్పుడు పెద్ద వారికే సొకే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలకు కూడా వస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
రోగం లక్షణాలు
వేళ్లు, మడమలు, మణికట్టు వద్ద సూదులతో పొడుస్తున్నట్లు అనిపించడం. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటగా అనిపించడం. సరిగ్గా నడవలేక పోవడం, తూలడం, మెట్లు ఎక్కలేక పోవడం, నోరు వంకర పోవడం, మాట్లాడటం, నమలడం, మింగడంలో ఇబ్బందిగా ఉండటం. మెడ నిలబడక పోవడం, ముఖ కండరాలలో కదలికలు లేక పోవడం వంటి లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. వీటిని గుర్తించి తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్సలు తీసుకోవాలి. నర్వ్ కండక్షన్, ఎలక్ట్రోమయోగ్రఫీ, సీఎన్‌ఎఫ్, ఎంఆర్‌ఐ తదితర పరీక్షల ద్వారా జీబీఎస్ వ్యాధిని నిర్థారిస్తారు. కాచి వడబోసిన నీళ్లను తాగాలి. కూరగాయలు, పళ్లను బాగా కడిగి ఉపయోగించాలి. మాంసం, చేపలు, రొయ్యలు వంటి నాన్‌వెజ్ ఐటమ్స్‌ను బాగా ఉడికించిన తర్వాతనే తినాలి. పచ్చి గుడ్లు తినడం ఆపేయాలి.