జగన్‌కు నైతిక హక్కు లేదు
సూపర్ సిక్స్ అమలు చేయడంలో సీఎం చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.;
By : Admin
Update: 2025-02-19 13:02 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు.
ఆమె ఏమన్నారంటే..
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై , సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించండి. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయండి. ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోండి. అంటూ సీఎం చంద్రబాబుకు సూచించారు.
ఇక కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదు. జగన్ మోహన్ రెడ్డి నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది. కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు. ప్రెస్ మీట్‌లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలి. అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.