ఉన్నత విద్యకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏదో తెలుసా?

ఉన్నత విద్య కు అత్యధికంగా నిధులు ఖర్చు పెడుతున్న రాష్ట్రాల వరుసలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఎందుకు ఆ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?;

Update: 2025-02-19 12:07 GMT

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యను అత్యంత ఖరీదైన విద్యగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విద్యగా కేరళ ప్రభుత్వం భావించింది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అందులోనూ ఉన్నత విద్యను అభ్యసిస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని కేరళ ప్రభుత్వం ఆలోచించింది. మొత్తంగా దక్షిణ భారత దేశం నుంచి విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు నిధులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి.

నీతి ఆయోగ్ నివేదిక కేరళ రాష్ట్ర స్థూల నమోదు నిష్పత్తి 41.3 శాతం గా గుర్తించింది. ఇది జాతీయ సగటు 28.4 శాతం కంటే చాలా ఎక్కువ. భారతదేశంలో ఉన్నత విద్య స్థితిపై నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, యువతకు ఉన్నత విద్యపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాలలో కేరళ ఒకటిగా కొనసాగుతోంది.

రాష్ట్రంలో డిజిటల్-లెర్నింగ్ విధానం వినూత్న పద్దతిలో ఎంతో బాగుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ విధానాన్ని మంచి పద్ధతిలో అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కేరళ ఏకైక రాష్ట్రమని నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొంది. రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడానికి తయారు చేసే విధాన పత్రంలో విద్యకు నిధుల కేటాయింపు ఆందోళన కరమైన ధోరణిలో ఉందనే విషయాన్ని నివేదిక హైలైట్ చేసింది.

14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పన్ను వికేంద్రీకరణను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని సిఫార్సు చేసినప్పటికీ, ఈ పెరుగుదల విద్యా వ్యయంలో అన్నింటి లాగా పెరుగుదలకు దారితీయలేదని పేర్కొంది. 2005-06, 2019-20 మధ్య ఉన్నత విద్యపై ఖర్చు పెరుగుదల, రాష్ట్రాలలో విద్య వ్యయంపై వాటా తగ్గుదలని నివేదిక సూచించింది. ఉన్నత విద్యపై సగటున ఒక్కో యువత ఖర్చులో సానుకూల ధోరణి ఉందని నివేదిక పేర్కొంది. ఇది రూ. 2,174 నుంచి రూ. 4,921కి పెరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ 2022 నివేదికను నీతి ఆయోగ్ ఉదహరించింది.

18 నుంచి 23 సంవత్సరాల వయస్సు గల యువతకు ఉన్నత విద్యపై తెలంగాణ, కేరళ అత్యధిక మొత్తాలను ఖర్చు చేశాయని నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో సహా ఇతర దక్షిణ భారత రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం పెట్టుబడి పరంగా కేరళ తన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 3.46 శాతం విద్యకు కేటాయిస్తుంది. 0.53 శాతం ప్రత్యేకంగా ఉన్నత విద్య వైపు మళ్లిస్తుంది.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం స్థూల నమోదు నిష్పత్తి (GER) 41.3 శాతం అని గుర్తించింది, ఇది కేరళలో ఆకట్టుకునే విధంగా ఉందని తెలిపింది. ఇది జాతీయ సగటు 28.4 శాతం కంటే చాలా ఎక్కువ. తమిళనాడు 47 శాతం GER తో ముగిసినట్లు నివేదికలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచడం వల్ల మాత్రమే విద్యార్థుల నమోదు పెరగదని, ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే విషయాన్ని నివేదిక నివేదికలో స్పష్టం చేశారు.

లింగ సమానత్వం ...

దేశంలోనే అత్యధిక లింగ సమానత్వ సూచిక (GPI) కేరళ లో ఉంది 1.44 శాతం. ఇది పురుషుల కంటే ఎక్కువ మంది మహిళా విద్యార్థులతో బలమైన లింగ సమతుల్యతను ప్రతిబింబిస్తుందని నివేదిక పేర్కొంది. జాతీయ GPI 1.01 వద్ద ఉంది. కేరళ, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు పురుషుల కంటే ఎక్కువ మహిళా నమోదు రేట్లను కలిగి ఉన్నాయి. ఇది మహిళలకు ఉన్నత విద్యను ఎక్కువగా పొందేందుకు విజయ నమూనాలు గా పనిచేస్తుందని నివేదిక వెల్లడించింది.

డిజిటల్ లెర్నింగ్ ...

2021లో ప్రారంభించబడిన ‘కేరళ లెట్స్ గో డిజిటల్’ చొరవకు చాలా ప్రశంసలు లభించాయి. కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, డిజిటల్ యూనివర్సిటీ కేరళ మధ్య సహకారంతో ఏర్పడిన ఈ ప్రాజెక్ట్, మోడల్ ఆధారిత అభివృద్ధి, కంటెంట్ సృష్టిలో శిక్షణపై దృష్టి సారించింది. సాంకేతికతతో నడిచే బోధనా విధానాన్ని ప్రోత్సహించడానికి అనుకూలమైన సిలబస్‌లను అభివృద్ధి చేసిన డిజికోల్ చొరవ వంటి ఇతర విజయవంతమైన ప్రాజెక్టులు కూడా రాష్ట్రంలో విద్యలో మంచి మార్పులు తీసుకు రావడానికి వారు చేసిన కృషికి గుర్తింపు లభించింది.

కేరళ తన ఉన్నత విద్యా రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని, గత నాలుగు సంవత్సరాలలో రూ.6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలు చేసినట్లు ఉన్నత విద్య, సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆర్ బిందు ప్రకటించారు. ఉన్నత విద్యలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండే విధంగా రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి ప్రస్తావించారు. కేరళ ఇన్ ఫ్రా స్టక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ బోర్డు (KIIFB), ప్లాన్ ఫండ్ రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ (RUSA) నిధులను ఉపయోగించి మౌలిక సదుపాయాల విస్తరణకు రూ. 2వేల కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు.

Tags:    

Similar News