విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం.. చైనా కంటైనర్‌లోనే..

విశాఖ పోర్ట్‌లోని కంటైనర్ టర్మినల్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చైనా నుంచి వచ్చిన కంటైనర్ నుంచి మంటలు ఎగసి పడ్డాయి.

By :  Vanaja
Update: 2024-09-14 10:44 GMT

విశాఖ పోర్ట్‌లోని కంటైనర్ టర్మినల్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చైనా నుంచి వచ్చిన కంటైనర్ నుంచి మంటలు ఎగసి పడ్డాయి. దట్టమైన పొగ రావడంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటన ఉదయం 11 గంటలకు జరిగినప్పటికీ బయటకు ఆలస్యంగా వచ్చింది. చైనా నుంచి గత నెల 28న ఈ కంటైనర్ వచ్చింది. లిథియం బ్యాటరీలతో వచ్చిన ఈ కంటైనర్ కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఈ కంటైనర్‌ను ఈరోజు ట్రాలర్‌‌పై లోడ్ చేశారు. లోడింగ్ పూర్తయిన నిమిషాల వ్యవధిలోనే కంటైనర్ నుంచి మంటలు ఉత్పన్నమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా నివారించారు. హుటాహుటిన మంటలను అదుపు చేశారు. కాగా ఈ మంటలకు కారణం ఏంటన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

లీకేజీనే కారణమా..

చైనా నుంచి వచ్చిన లిథియం బ్యాటరీల్లో ఏదైనా లీకేజీ ఏర్పడి అదే ఈ ప్రమాదానికి దారి తీసిందా? లేకుంటే ఈ ప్రమాదానికి మరేదైనా కారణం ఉందా అన్న అంశాలపై విచారణ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరుగుతోంది. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని అధికారులు వెల్లడించారు.

దగ్గర్లోనే షూటింగ్

కాగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి అతి చేరువలోనే ఓ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే వారు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి పక్కకు వెళ్లారు. విశాఖ పోర్ట్‌లో సూపర్ స్టార్ రజనీ కాంత్ నూతన సినిమా షూటింగ్ 10 రోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో మూమీ టీమ్‌కు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించినట్లు సమాచారం.

Tags:    

Similar News