మోహన్ బాబు ఇదేం పద్దతి...? ఫీజులతో దోపిడీ చేస్తారా..?
రూ. 26 కోట్లు విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఉన్నత విద్యామండలి ఆదేశం.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-08 04:33 GMT
సినీ కథానాయకుడు నిర్మాత మంచు మోహన్ బాబుకు మరో వివాదం చిక్కుకున్నారు. కుటుంబంలో చెలరేగిన గొడవలు సద్దుమణిగాయని అనుకుంటూ ఉండగానే.. మోహన్ బాబు యూనివర్సిటీ ( Mohan Babu University MBU)లో అవకతవకలపై ఉన్నత విద్యామండలి కన్నెర్ర చేసింది. విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయాలు వారికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఎంబీయూ గుర్తింపు రద్దుకు కూడా సిఫారసు చేసింది.
సిఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి స్పందించారు.
"విద్యార్థుల నుంచి అక్రమంగా 26 కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేసిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి". అని డిమాండ్ చేశారు.
తిరుపతికి సమీపంలోని రంగంపేట వద్ద ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీపై విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఫిర్యాదు నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి స్పందించింది. ముగ్గరు సభ్యుల కమిషన్ జరిపిన విచారణలో హాజరు తక్కువగా ఉందని విద్యార్థుల నుంచి అదనంగా డబ్బు వసూలు చేయడం వంటి ఆరోపణలపై 15 లక్షల రూపాయలు జరిమానా విధించింది. దీంతో మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఆ సొమ్ము చెల్లించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 22, 17, 52, 872 రూపాయలు తిరిగి చెల్లించాలని గత నెల 17వ తేదీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను వెబ్సైట్లో కూడా ఉంచింది.
వేధింపులు ఎక్కువ..
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) అధికంగా ఫీజులు వసూలు చేసిన విషయం ఆడిట్ నివేదికల్లో కూడా రుజువైందని సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపుమురళీ గుర్తు చేశారు.
ఈ యూనివర్సిటీలో విద్యార్థులు, ఫ్యాకల్టీలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించడం,. యుజిసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం మోహన్ బాబు యూనివర్సిటీలో అలవాటుగా మారిందని గంగారపురలి ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడం బెదిరింపులకు కొనుక్కోవడం గతం నుంచి మోహన్ బాబు కాలేజీలో ఉన్న యాజమాన్యం ప్రతినిధులకు ఓ అలవాటుగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నత విద్యా మండలి ఏం చెబుతుందంటే..
తిరుపతికి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గ రంగంపేట వద్ద మోహన్ బాబు విద్యాలయాలు ఏర్పాటు చేశారు. 2022లో శ్రీవిద్యానికేతన్ ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. ఈ యూనివర్సిటీలో 2022- 23 విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయం అదనంగా 26.17 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. ఈ మొత్తం విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని కూడా ఆదేశించింది. యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎంబీయూ గుర్తింపును ఒక రద్దు చేసుకోవడంతో పాటు యుజిసి, ఏఐసిటిఈ, పిసిఐ, ఐసిఆర్, ఎంసీఏ, హెచ్ పి హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కు కూడా సిఫారసు చేసింది. ఇదిలా ఉంటే..
సీట్లు... ఫీజులు..
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేట వద్ద శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను సినీ కథానాయకుడు, నిర్మాత మంచు మోహన్ బాబు నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలను 2022లో ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటివరకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాజాలలో ఉన్న సీట్ లో 70 శాతం ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ పథకం కింద ప్రారంభించే కోర్సుల్లోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే విధంగా నిబంధనలు ఉన్నాయి. దీనికి ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంది. ఆ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో...
రంగంపేట సమీపంలోని మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఫీజులు అదనంగా వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తో పాటు విద్యాశాఖ మంత్రి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అందులో
"బిల్డింగ్ టిషన్ ఫీజుతో పాటు ఇతర అనేక రకాల పేర్లతో హాస్టల్లో లేకున్నా.. వారి నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు" అని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారని సమాచారం. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నత విద్యా కమిషన్ ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. దీనిపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పరిస్థితుల్లో ఉన్నత న్యాయస్థానం గత నెల 26వ తేదీ మూడో వారాల పాటు తాత్కాలిక స్టే విధిస్తూ తదుపరి విచారణ ఈనెల 14 వాయిదా వేసినట్లు తెలిసింది.
క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
తిరుపతికి సమీపంలోని రంగంపేట వద్ద ఉన్న మోహన్ బాబు వర్సిటీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
"మోహన్ బాబు వర్సిటీలో జరిగిన ఉల్లంఘనలు, అక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ గుర్తించింది. విద్యార్థుల హాజరు నమోదులోనూ అక్రమాలు జరిగాయి" అని ఆయన వివరించారు.
"విద్యార్థులు తరగతులకు హాజరైనా, కానట్లు చూపించి రూ. 7500ల వంతున అదనంగా వసూలు చేశారు. ఉన్నత విద్యా కమిషన్ కు సరైన సమాచారం ఇవ్వడం లేదు. వసూలు చేసిన ఫీజుల సమాచారాన్ని కమిషన్ కు వెల్లడించలేదు" అని కమిటీ తెలిపిన అంశాల్ని గుర్తు చేశారు.
ఇష్టానుసారంగా వసూలు..
మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థుల నుంచి రూ. ఐదు వేలః నుంచి రూ.4,5000లు అదనంగా వసూలు చేశారని మురళీ వివరించారు. డిగ్రీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏ విద్యార్థుల నుంచి రూ.18 వేల నుంచి రూ. 25 వేల రూపాయలు అదనంగా వసూలు చేయటం, బీఫార్మసీ ఫార్మా డి విద్యార్థుల నుంచి 25 వేల నుంచి 40 వేలలు, బీఎస్సీ ఆనర్స్, అగ్రికల్చర్ విద్యార్థుల నుంచి ₹22,000 నుంచి ₹33,000 పారా మెడికల్, హెల్త్ కేర్ సైన్సెస్ విద్యార్థుల నుంచి రూ. 40 వేల నుంచి 45 వేలు అదనంగా వసూలు చేశారని ఆయన ఆరోపించారు.
2023లో 2 .59 లక్షల రూపాయలు, 2024 లో 10 .65 కోట్లక్షలు, 25 లో 12 . 93 కోట్ల రూపాయలు మొత్తం 26 కోట్లకు పైగా అదనంగా వసూలు చేయడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా అధిక ఫీజులు చెల్లించారాని అడ్డగోలు వాదనలు చేస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కందారపు మురళీ డిమాండ్ చేశారు.