వైఎస్ఆర్ కు ఎవరికి వారుగానే కుబుంబీకుల నివాళి..
జనసంద్రంగా మారిన ఇడుపులపాయ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-02 04:36 GMT
కడప జిల్లా ఇడుపులపాయ జనసంద్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబీకులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద అభిమానులు, వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద ఆయన భార్య వైఎస్. విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వారి కొడుకు, మాజీ సీఎం వైఎస్. జగన్ కూడా హాజరయ్యారు. ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి మాత్రం వేరుగా వచ్చిన తండ్రి సమాధి వద్ద అంజలి ఘటించారు.
కుటుంబ కలహాలు, రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో వైఎస్. జగన్ ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి ఇడుపులపాయలు ఎడమొఖం పెడముఖంగానే వ్యవహరించారు. వారి మధ్య పలకరింపులు కూడా కనిపించలేదు. ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్దకు షర్మిల వచ్చేసరికి చాలామంది వైసిపి నాయకులు ఆమెను పలకరించారు. ఆమె వెళ్లిన తర్వాత జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు.
కడప జిల్లాలోని వైసిపి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధుల తో పాటు రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. అంతకుముందు పులివెందుల నివాసం నుంచి ys. జగన్ పార్టీ నాయకులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. అప్పటికే ఆయన తల్లి వైయస్ విజయమ్మ కూడా అక్కడికి చేరారు. జగన్ చెల్లెలు వైయస్ షర్మిలారెడ్డి వేరుగా వచ్చి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబీకులు బంధువులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. దాదాపు గంటపాటు సర్వమంతా ప్రార్థనలు జరిగాయి. వైయస్సార్ సమాధి వద్ద బైబిల్ సూక్తులను పటిస్తూ వైయస్ విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రార్థన ముగిసిన తర్వాత కొడుకు జగన్ను ఆలింగనం చేసుకున్న విజయమ్మ తన మాతృ ప్రేమ చాటుకున్నారు. ఆ సమయంలో వైయస్సార్ ఘాటు వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ప్రార్థనల అనంతరం జగన్ లింగాల మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు.