వివాహేతర సంబంధం–తల్లి, ఇద్దరి కూతుళ్లను బలితీసుకుంది
ఈ నెల 13న కాకినాడలో జరిగిన హత్య కేసు వివరాలను ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు.;
By : The Federal
Update: 2025-08-07 08:55 GMT
కాకినాడ జిల్లా సామర్లకోటలో వివాహేతర సంబంధం ఓ తల్లి, ఇద్దరు కుమార్తెల హత్యకు కారణమైంది. రెండేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా వివాహేతర సంబంధం నెరిపిన సురేష్, ఈ విషయం ఎవరి కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఈ విషయం పొక్కడం, అది కాస్త తన భార్యకు తెలియడంతో సురేష్ తన ప్రియురాలు మాధురిని, ఆమె ఇద్దరు కుమార్తెలను కర్కశంగా చంపేశాడు. కాకినాడ జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం వెల్లడించారు. ఈ హత్యలకు వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో తేలిందని ఎస్పీ పేర్కొన్నారు.
నిందితుడు సురేష్ హత్యకు గురైన తల్లి మాధురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా మాధురితో సురేష్ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మాధురికి సుమారు రూ. 7లక్షల వరకు ఖర్చు పెట్టి ఆమె అడిగిన వస్తువులు కొన్చిచ్చాడు. సురేష్‌కి, మాధురికి మధ్య నడుస్తున్న వివాహేతర సంబంధం రెండేళ్ల పాటు గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇది బయటకు పొక్కింది. అది కాస్త సరేష్ భార్యకు తెలిసింది. దీనిపైన సురేష్‌ను అతని భార్య నిలదీసింది. భార్య ముందు భర్త సురేష్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రియురాలు మాధురితో తన వివాహేతర సంబంధంపై సురేష్‌కి విరక్తి పెంచుకున్నాడు. దీంతో పాటుగా ఆమెపై కక్ష కూడా పెంచుకున్నాడు. అంతేకాకుండా మాధురిని అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. అదును కోసం ఎదురు చూశాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ అర్థరాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో మాధురి ఇంట్లోకి ప్రవేశించాడు సురేష్. తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో మాధురిపై దాడి చేసి ఆమె తలపై మోది అంతమొందించాడు. అప్పటికే మంచి నిద్రలో ఉన్న మాధురి ఇద్దరు కుమార్తెలు ఇంట్లో అలికిడి కావడంతో లేచారు. మాధురిని చంపిని విషయాన్ని బయటపెడుతారేమో అని భావించిన సురేష్ వారి పట్ల కర్కశంగా వ్యవహరించాడు. పసిపిల్లలని కూడా చూడకుండా వారిపైన దాడికి పాల్పడి ఆ ఇద్దరు కుమార్తెలను కూడా అంతమొందించాడు.
అయితే తాను హత్య చేసినట్లు తెలియకుండా ఉండేందుకు సరికొత్త ప్లాన్ చేశాడు. ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా, చోరీ కోసం వచ్చిన దొంగలు తల్లి మాధురిని, ఆమె ఇద్దరు కుమార్తెలను చంపేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఇంట్లో నగదు, నగలు కూడా సురేష్ ఎత్తుకెళ్లిపోయాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సురేష్ మీద అనుమానాలు రావడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని కాల్‌డేటాను పరిశీలించారు. హత్యకు గురైన మాధురి, నిందితుడు సురేష్‌ల మధ్య దాదాపు 1044 కాల్స్ ఉన్నట్లు గుర్తించి ఆ వివరాలను సేకరించారు. సురేష్ వద్ద నుంచి మాధురి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన నగదు, నగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు.