Elephant attack | ప్రాణం మీదికి తెచ్చిన టిఫిన్ బాక్స్ మోత

ఏనుగులు దాడిలో ముగ్గురి ప్రాణాలు తీసింది. ఆ ఏనుగులు చిత్తూరు నుంచి జొరబడ్డాయా? ఇంతకీ ఈ సంఘటన ఎలా జరిగింది?;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-25 10:15 GMT

ఏనుగుల దాడి ఘటనతో ఈ ఏడాది మహా శివరాత్రి కడప జిల్లాను విషాదంలో నింపింది. అటవీ ప్రాంతానికి సమీపంలోనే అనేక గ్రామాలు ఉన్నాయి. మొదటిసారి ఏనుగుల దాడిలో ముగ్గురు మరణించడం, ఇద్దరు గాయపడిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. సుమారు 15 మంది శివభక్తుల బృందంలోని ఓ బాలుడు ఆకతాయితనంతో తన వెంట ఆహారం తీసుకుని వెళ్లిన స్టీల్ బాక్స్ మూతతో భీకర శబ్దాలు చేయడం వల్లే ప్రమాదం ముంచుకొచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అటవీప్రాంతం సమీపంలోని గ్రామాలు ఆందోళనతో ఉన్నాయి. ఈ గ్రామాలకు సమీపంలో సాకులోని మామిడి, బొప్పాయి తోటల వద్దకు వెళ్లడానికి కూడా బిక్కుబిక్కుమనే పరిస్థితి ఏర్పడింది.

ఏనుగుల దాడిని ప్రత్యక్ష్యంగా చూసి, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన సిద్ధయ్య అనే వ్యక్తి రైల్వేకోడూరు ప్రభుత్వాస్పత్రి వద్ద మీడియాతో ఏమన్నారంటే..


"మా బృందంలోని ఒక వ్యక్తి టిఫిన్ క్యారియర్ మూతతో భీకర శబ్దాలు చేశాడు. వెంటనే ఏనుగులు మాపైకి దూసుకుని వచ్చాయి" అని సిద్ధయ్య చెప్పాడు. "చప్పుడు చేయకుండా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అని అని ఆయన సిద్ధయ్య భయం గొలుపుతున్న గొంతుతో అన్నాడు. ఈ సంఘటనపై అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి విచారణ చేపట్టారు. బాధితుల కుటుంబీకులతో మాట్లాడారు. ప్రత్యక్ష్యసాక్షుల నుంచి వివరాలు సేకరించారు.


కొండకోనలకు నెలవు...

అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న రైల్వే కోడూరు, రాయచోటి నుంచి కడప వరకు శేషాచలం అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న ఈ ప్రదేశం. వన్యప్రాణుల ఆవాసానికి నిలయం కూడా. మొదటిసారి జరిగిన ఘటనతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దులోని రాపూరు అటవీ ప్రాంతంలో గుండాలకోన. ఓబులవారిపల్లె మండలం ఎర్రగుంట కోటకు సమీపంలో మరో గుండాలకోన ఉంది. ఈ మార్గం నుంచే నేరుగా అటవీ ప్రాంతంలో చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని తలకోన వద్ద ఉన్న సిద్దేశ్వర ఆలయం వరకు చేరుకోవచ్చు. ఏటా శివరాత్రి సందర్భంగా దట్టమైన అడవిలోని శైవ క్షేత్రాలకు వెళ్లడం ఈ ప్రాంత పల్లె ప్రజలకు సర్వసాధారణం. ఈ ఏడాది అదే మరణశాసనం రాసింది.
ఆ పల్లెల్లో తీరని విషాధం

చిత్తూరు జిల్లా నుంచి ఏనుగులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాయనే సందేహాలు కూడా అటవీశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో వంకాయల దినేష్ (34), తుపాకుల మణెమ్మ (40), తిరుపతి చంగల్ రాయుడు (35) ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనతో కన్య గుంట ఎస్టీ కాలనీ ఉల్లగట్టుపోడు అరుంధతివాడలో తీవ్ర విషాదం అలుముకుంది. రైల్వే కోడూరు ప్రభుత్వాస్పత్రి వద్ద మృతుల సంబంధీకుల రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. మహాశివరాత్రి ఆ రెండు పల్లెల్లో చేదుగుళికగా మారింది.

అడవిలో జరిగిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ. పది లక్షలు, తీవ్రంగా గాయపడిన పరిగెల రాజశేఖర్, పాపమ్మ (అమ్ములు)కు చొరో ఐదు లక్షల పరిహారం చెల్లించడానికి డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. వారిద్దరినీ మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరికి కరకంబాడి సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఘటన నేపథ్యంలో, శేషాచలం అటవీ ప్రాంతం మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అని చెప్పడం కంటే అసలు ఈ విషాద ఘటన జరగడానికి దారి తీసిన పరిస్థితి ఏమిటనేది 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధి సేకరించిన వివరాలు ఇవి.
బేస్ క్యాంప్ దాటి..
రైల్వే కోడూరు నుంచి ఓబులవారిపల్లె మండలం ఎర్రగుంట కోట (వై.కోట) వరకు సుమారు 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అక్కడినుంచి 2:30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అటవీశాఖ చెక్ పోస్టు ఉంది. ఎర్రచందనం స్మగ్లర్లు అడవి ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఇక్కడ టాస్క్ ఫోర్స్ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడి నుంచి నాలుగు నుంచి ఆరు కిలోమీటర్లు దూరం అడవిలో ప్రయాణిస్తే దట్టమైన అటవీ ప్రాంతంలోని గుండాలకోన కూడా వస్తుంది. ఇక్కడికి ఆర్టీసీ అధికారులు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది. అంటే రోడ్డు మార్గం ఉన్నట్లు లెక్క. పగలు ఆ ప్రదేశానికి కాలినడకన వెళ్లే శివ భక్తులు జాగారం చేయడం ఆనవాయితీ. కాగా,
ఓబులవారిపల్లె మండలం ఉర్లగట్టుపోడు అరుంధతి వాడ, సమీపంలోని కన్నెమడుగు ఎస్టీ కాలనీ కి చెందిన సుమారు 20 మంది శివ భక్తులు బయలుదేరారు. వై కోటకు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద మంగళవారం సాయంత్రం కొంతమందిని నిలిపివేశారు. సాధారణంగా అడవి ప్రాంతం లోకి సామాన్యులను వెళ్లకుండా ఆ శాఖ ఆంక్షలు విధించింది.
"నిత్యం ఈ ప్రదేశాలలో ఆంక్షలు ఉంటాయి" అని అటవీశాఖ బాలుపల్లి రేంజ్ అధికారి ప్రభాకర్ రెడ్డి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
_శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతంలోని గుండాలకోన, తలకోన ప్రాంతాలకు అనుమతిస్తున్నది కూడా అనాధికారమే" అని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజులపాటు శివ భక్తులు వెళ్లడానికి అభ్యంతరం చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోమని అవసరమైన సూచనలు చేశాం. అని ఎఫ్ ఆర్ ఓ (forest range officer) ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద కూడా సిబ్బంది అప్రమత్తం చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
చెక్ పోస్ట్ దాటాక..
ఓబులవారిపల్లె మండలం ఉల్లగట్టుపోడు, కన్నగుంట ఎస్టీ కాలనీ చెందిన శివ భక్తుల బృందం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు కాలినడకన చేరుకుంది. వీరు అక్కడినుంచి కుడి పక్కకు తిరిగి, అడవిలోకి ప్రవేశించారు. అటవీ మార్గంలోనే 37 కిలోమీటర్లు ప్రయాణించి చిత్తూరు జిల్లా భాకరాపేటకు సమీపంలోని తలకోన వద్ద ఉన్న సిద్దేశ్వరాలయం అటవీ ప్రాంతంలోకి చేరాలనేది గమ్యంగా ఎంచుకున్నారు. సోమవారం సాయంత్రం తమ గ్రామాల నుంచి బయలుదేరిన శివ భక్తులు రాత్రికి గుండాలకోన సమీప అటవీ ప్రాంతంలోకి చేరుకొని, అనువైన ప్రదేశంలో సేదతీరేందుకు జామాయల గడ్డ వద్దకు చేరారు. అదే సమయంలో ఏనుగుల మందను గమనించారు.
శివ భక్తుల బృందంలో ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి ఆంజనేయులు ఏమంటున్నారంటే..

" రెండు గ్రామాల నుంచి సుమారు 15 మంది తలకోనకు బయలుదేరాం. అదే సమయంలో మాకు ఏనుగులు కనిపించాయి. మా శబ్దాల దెబ్బకు ఏనుగులు దూసుకు రావడంతో ప్రాణమయంతో పరుగులు తీశాం" అని ఆంజనేయులు చెప్పాడు. ఎవరికి వారు ప్రాణాలు దక్కించుకునేందుకు భయం తో చెట్టు పుట్ట వెంట పరుగులు పెట్టాం. అయినా, వెంటపడిన ఏనుగులు ఘీంకారాలు చేస్తూ తరిమినాయి" అని భయం గొలిపిన గొంతుకతో వివరించారు. అప్పటికి ఆయన గొంతులో భయం ఛాయలు ఏమాత్రం వీడలేదనే విధంగానే కనిపించింది.
ఇదే మొదటిసారి..
రైల్వే కోడూరు అటవీ ప్రాంతానికి సమీపంలో చిట్వేలి మండలంలో పెద్దూరు నుంచి సుమారు 15 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది గుండాలకోన ఒకటి ఉంది. ఓబులవారిపల్లె మండలం ఎర్రగుంటకోట నుంచి ఐదు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం విషాద ఘటన చోటు చేసుకున్న ప్రదేశం నుంచి మరో గుండాల కోన కూడా ప్రకృతి ఒడిలో ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ప్రస్తుతం శివ భక్తులు ఎంచుకున్న మార్గం తలకోనకు వెళ్లడానికి తిరుపతి నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి.
ఇవన్నీ పక్కకు ఉంచితే, ఈ అటవీ ప్రాంతంలో సాధారణ వన్యప్రాణులకు తోడు చిరుతపులుల సంచారం కూడా ఎక్కువే. కానీ ఇంతవరకు ఎలాంటి దుర్ఘటన జరిగిన దాఖలాలు మాత్రం లేవు. దీనిపై బాలుపల్లె ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (forest range officer-fro) ప్రభాకర్రెడ్డి ఆసక్తికర విషయం చెప్పారు.
"బాలుపల్లి అటవీ ప్రాంతంలో ఒంటరి ఎనుగు ఉంది. చాలాసార్లు తారసపడింది. నేను ఫోటో కూడా తీశా" అని చెప్పారు. "ఓ సందర్భంలో సిబ్బందితో కలిసి అడవిలోకి వెళ్ళినప్పుడు ఏనుగుల మంద కూడా కనిపించింది. జాగ్రత్తగా అక్కడ నుంచి తప్పుకున్నాం" అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
"అడవిలోకి వెళ్లే చాలామంది ఉంటారు. ప్రకృతి ప్రేమికులుగా టెక్కర్స్ మాకు మంచి స్నేహితులు. ముందస్తు సమాచారంతోనే వారు వస్తారు" అని చెబుతున్న ప్రభాకర్ రెడ్డి ఏనుగుల మానసిక స్థితిని అర్థం చేసుకొని మెలగాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అటవీ ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి వచ్చేవారు ముందస్తు సమాచారం ఇస్తారు. వారికి మెలకువలు చెబుతాం. ఎలా వెళ్లాలని కూడా గైడింగ్ మా సహకారం తీసుకుంటారు. అని ఎఫ్ఆర్ఓ ప్రభాకర్ రెడ్డి వివరించారు.
చిత్తూరు ఏనుగులేనా..
రైల్వే కోడూరు సమీపంలోని ఓబులవారిపల్లె మండలం ఎర్రగుంట కోట వద్ద దాడికి పాల్పడిన ఏనుగులు చిత్తూరు ప్రాంతం నుంచి ప్రవేశించ ఉండవచ్చు అనేది అటవీ శాఖ అధికారుల సందేహం.
చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి పలమనేరు వరకు, ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్న కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల మంద ప్రవేశించి ఉండవచ్చు అనేది అటవీ అధికారుల అభిప్రాయం. కౌండిన్య అటవీ ప్రాంతం అటు కర్ణాటక ఇటు తమిళనాడు సరిహద్దుల్లో విస్తరించిన విషయం తెలిసిందే. ఈ అటవీ ప్రాంతానికి శేషాచలం అభయారణ్యం కూడా సమీపంలోనే ఉండడం వల్ల ఆ ప్రాంతం నుంచి ఏనుగులు ప్రవేశించబండవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి.
"తమకు పరిచయం లేని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే ఏనుగులు అలవాటు పడే వరకు వాటి ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది" అని ఎఫ్ ఆర్ ఓ ప్రభాకర్ రెడ్డి ఏనుగుల మానసిక స్థితిని వివరించారు.
గత నెలలో చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇక్కడి మామిడి తోటల్లో ఏనుగుల దాడి సమాచారం తెలుసుకుని వెళ్లిన నారావారిపల్లె ఉపసర్పంచ్ ఏనుగుల దాడిలో మరణించిన విషయం తెలిసిందే.
ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంట కోట వద్ద అటవీ ప్రాంతంలో ఏనుగులు శివ భక్తులపై దాడి చేసిన తీరు కూడా అలాగే ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నీరు ఆహారం కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"నారావారిపల్లి వద్ద, ప్రస్తుతం ఎర్రగుంట కోట వద్ద జరిగిన సంఘటనకు సారూప్యం ఉన్నట్లే కనిపిస్తోంది"అని ఎఫ్ఆర్ఓ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
గతంలో తనకు తారసపడిన ఏనుగుల మంద కూడా ఇదే కాదా అనేది చెప్పడం కష్టమన్నారు. అయితే, మందలో నుంచి ఓ ఏనుగు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పొలాలను పరిశీలించి వెళ్లే విధానం విచిత్రంగా ఉంటుందన్నారు. అది ఇచ్చే సంకేతాల ఆధారంగా ఏనుగుల మంద పంట పొలాలు, మామిడి తోటలపై దాడులకు దిగుతాయని ఆయన విశ్లేషించారు." ప్రస్తుతం సంచరిస్తున్న ఏనుగులు ఈ అటవీప్రాంతానికి కొత్త అయితే మాత్రం. వాటి ప్రవర్తన భిన్నంగా, భయంతో ఉంటుంది. ఈ పరిసరాలు అలవాటయ్యే వరకు మనుషులు కనిపిస్తే, దాడులకు దిగడానికి వెనకడుగు వేయకపోచ్చుమా బృందంలోని ఒక వ్యక్తి టిఫిన్ క్యారియర్ మూతతో భీకర శబ్దాలు చేశాడు. వెంటనే ఏనుగులు మాపైకి దూసుకుని వచ్చాయి. అని సిద్ధయ్య చెప్పాడు. చప్పుడు చేయకుండా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అని అభిప్రాయం కూడా ఆంజనేయులు వ్యక్తం చేశాడు. అని ఎఫ్ఆర్ఓ ప్రభాకరరెడ్డి అభిప్రాయపడ్డారు.
అటవీ పల్లెల వద్ద భయం
ఈ ఘటనతో అటవీ సమీప గ్రామాలు భయంతో ఉన్నాయి. ఈ ప్రాంతం మామిడి తోటలకు ప్రసిద్ధి, అంతేకాకుండా, బొప్పాయి తోటల సాగు కూడా విస్తారంగా ఉంటుంది. రైల్వే కోడూరు ప్రాంతంలో మామిడి తోటలు 20వేల హెక్టార్లు, అరటి 17 వేల హెక్టార్లు, బొప్పాయి 15వేల హెక్టార్లలో సాగులో ఉంది. రేణిగుంట నుంచి కడపకు వెళ్లేమార్గంలో మామండూరు నుంచి రైల్వే కోడూరు మండలం అటవీప్రాంతం నుంచే ప్రారంభం అవుతుంది. ఇది ఇలాగే ఓబులవారిపల్లె, పుల్లంపేట మండలాల మీదుగా రాయచోటి నియోజకవర్గంలోని సుండుపల్లె, వీరబల్లె, రామాపురం, కడప వరకు విస్తరించి ఉంది. చిట్వేలి మండల కేంద్రం నుంచి రాపూరు మార్గం, రైల్వేకోడూరు నుంచి చిట్వేలి మార్గంలో రాపూరు అడవులు దట్టంగా ఎర్రచందనం వనాలతో విస్తరించి ఉంది. ఈ ప్రాంతానికి చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంత కౌండిన్య అరణ్యం నుంచి తిరుపతి శేషాచలం అటవీప్రాంతం విస్తరించి ఉన్న సమీప గ్రామాల్లోని తోటల వద్దకు వెళ్లడానికి రైతులు, ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అటవీ సమీప గ్రామాల్లో ఆ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News