మూడో సారి భూ ప్రకంపనలు..వణుకుతున్న ప్రకాశం జల్లా ప్రజలు
ప్రకాశం జిల్లాను భూకంపం వదలడం లేదు. ముండ్లమూరు మండలంలో మూడో సారి భూమి కంపించింది.
By : Admin
Update: 2024-12-23 09:44 GMT
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది వరకే రెండు సార్లు ప్రకంపనలు రాగా తాజాగా సోమవారం మూడో సారి భూమి కంపించింది. దీంతో ప్రకాశం జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. తీవ్ర భూకంపం వస్తుందేమోనని వణికి పోతున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో సోమవారం మూడో సారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముండ్లమూరు, సింగనపాలెం, శంకరపాలెం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు ఇళ్లల్లో నుంచి పరుగులు పెట్టారు. వరుసగా భూ ప్రకంపనలు వస్తుండటంతో తీవ్రమైన విపత్తు ఏమైనా సంభవిస్తుందేమో అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే మండలంలో వరుసగా మూడో సారి భూమి కంపించడంతో ప్రజలు వణికి పోతున్నారు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో సోమవారం, ఆదివారం శనివారం వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11:40 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత శనివారం ఉదయం 7:30 ప్రాంతంలోను స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో మండల పరిధిలోని సింగన్నపాలెం, మారెళ్ల వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. భూమి కుదుపులకు గురికావడంతో ఒక్క సారిగా ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ముండ్లమూరు, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు వంటి ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం రిక్కర్ స్కేలుపై 3.1గా రీడింగ్ నమోదైంది. గత మూడేళ్లుగా ఈ ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అద్దంకి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూమి కంపించడం జరుగుతోంది. గత మూడు రోసులుగా వరుస భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఏప్పుడు ఏమి జరుగుతుందో అని ఆ ప్రాంతాల ప్రజలు హడలి పోతున్నారు.