ఆదర్శ నాయకుడు బొజ్జా వెంకటరెడ్డి

నంద్యాలలో బొజ్జా వెంకటరెడ్డి 23వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నారు.

Update: 2025-10-23 09:34 GMT

బొజ్జా వెంకటరెడ్డి ఆదర్శవంతమైన నాయకుడు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని బొజ్జా వెంకటరెడ్డి అగ్రికల్చర్ ఫౌండేషన్ కార్యాలయంలో బొజ్జా వెంకటరెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా ఘనంగా వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన నిబద్ధత, సేవా దృక్పథం స్ఫూర్తిదాయకమని పాల్గొన్నవారంతా కొనియాడారు. ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ బొజ్జా దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రముఖులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 


ఆయన నిబద్ధత, నైతికత, సేవా భావం కలిగిన ఆదర్శ ప్రజానాయకుడని, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పాల్గొన్న వక్తలు స్మరించుకున్నారు. సర్పంచ్‌గా ప్రారంభమైన ఆయన ప్రజాసేవా యాత్ర శాసనసభ, పార్లమెంట్, జాతీయ నేతృత్వ స్థాయికి చేరి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిందని కొనియాడారు.

1932లో నంద్యాల తాలూకా పులిమద్ది గ్రామంలో జన్మించిన వెంకటరెడ్డి, న్యాయశాస్త్ర విద్య పూర్తి చేసి 1956లో సర్పంచ్‌గా ఎన్నికై ప్రజాసేవా పథాన్ని అడుగుపెట్టారు. అనంతరం నంద్యాల సమితి అధ్యక్షుడిగా (1962–1973), భూసంస్థ సహకార బ్యాంకు అధ్యక్షుడిగా (1964–1971), శాసనసభ్యుడిగా (1962–1978), పార్లమెంట్ సభ్యుడిగా (1989–1991) సేవలందించారు. న్యాయవాది, రైతు, శాసనకర్త, పార్లమెంటేరియన్, సంస్కర్తగా భిన్న భూమికల్లో ప్రజల కోసం పనిచేశారు.

శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో రోడ్లు, విద్యా సదుపాయాలు, పాఠశాలలు, వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని వక్తలు తెలిపారు. నంద్యాలలో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పి, ప్రాంతీయ వివాదాలను సక్రమంగా పరిష్కరించి అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను సాధించారు.

దేశ రాజకీయాల్లోనూ ఆయన ప్రతిభ ప్రత్యేకంగా నిలిచిందని, 1977లో నీలం సంజీవరెడ్డి విజయానికి కీలకంగా సహకరించారని, 1991, 1996లో ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ (NSDC) చైర్మన్‌గా రైతుల కోసం శిక్షణా కార్యక్రమాలు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశారు. 

రాయలసీమ సాగునీటి అభివృద్ధికి ఆయన చూపిన నిబద్ధత విశేషమని, శ్రీశైలం కుడికాలువ (SRBC)లో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం కోసం చేసిన కృషి వల్ల రాయలసీమ రైతులకు దీర్ఘకాలిక లాభాలు కలిగాయని వక్తలు పేర్కొన్నారు. నేటి రాజకీయ నాయకులు ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, నిట్టూరు సుధాకర్ రావు, విశ్రాంత యూనియన్ బ్యాంక్ ఏజియం శివనాగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, గోపాల్ రెడ్డి, న్యాయవాది అసదుల్లా, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు ఏరువ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి, కార్యవర్గ సభ్యులు పట్నం రాముడు, భాస్కర్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, మద్దిలేటిరెడ్డి, జానోజాగో మహబూబ్ భాష, క్రిష్ణమోహన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జా వెంకటరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక స్మారక పత్రాన్ని విడుదల చేశారు.

Tags:    

Similar News