‘ఎడారి నుంచి స్వర్గంగా... దుబాయ్ చూస్తుంటే ఆసూయగా ఉంది’
చంద్రబాబు మన్ కీ బాత్...;
దుబాయ్‌లోని ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు టూరిస్టులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని, అంతగా పర్యాటక రంగాన్ని దుబాయ్‌లో డెవలప్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎడారి ఉన్న ప్రాంతాలను స్వర్గాన్ని తలపించే విధంగా దుబాయ్ సృష్టించిందని, అందుకే దుబాయ్‌ను చూస్తే తనకు అసూయ వేస్తోందని అన్నారు. బుధవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో 'ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ' సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దుబాయ్ పర్యాటక రంగం అద్భుతమని పేర్కొన్నారు.
భారత దేశం యుఏఈతో భాగస్వామ్యం ఉండటం చాలా సంతోకరమైన అంశంమన్నారు. వినూత్నంగా లోచించడం వల్లే కొత్త కొత్త ఆవిష్కరణలు ఆవిర్భవిస్తాయన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాల్లో దాదాపు 40 శాతం మంది భారతీయులేనని, ఆ దేశంతో మనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. భారత దేశంలో 1991లో కీలక ఆర్థిక సంస్కరణలు వచ్చాయన్నారు. దీంతో 1995లో టెక్నాలజీ తెరపైకొచ్చిందని, ఈ టెక్నాలజీ రెవల్యూషన్‌తో భారత దేశంలో పరిస్థితి మారిపోయిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను తీసుకొచ్చిన విజన్ 2020తో చాలా అభివృద్ధి సాధ్యమైందని, అదే రీతిలో ప్రస్తుతం 2026 నాటికి అమరావతిలో కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు.
పాలనలో ఇప్పటికే పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పీపీపీ మోడల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్డంతో పాటు పీ–4 విధానం కూడా తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రీటైల్ కేంద్రాలను నిర్వహిస్తున్న లులు గ్రూప్‌ను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరామని, దీంతో విజయవాడ, విశాఖపట్నంలో మాల్స్ పెట్టేందుకు లులు గ్రూప్ ముందుకొచ్చిందన్నారు.