ఉచితమే కదా అని ఎండల్లో మందు తాగితే మటాషే!

ఎన్నికలంటే మద్యం ఏరులై పారడం షరామామూలే. కానీ ఫ్రీగా దొరికింది కదా అని మండుటెండల్లో మద్యం తాగితే మటాషే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

Update: 2024-04-27 07:44 GMT

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. అభ్యర్థులు, పార్టీ నేతలు, పార్టీల కార్యకర్తలు ఆపసోపాలు పడుతున్నారు. ఓ పక్క ఎండ మరోపక్క ఉక్కపోత. ముదిరిన ఎండలతో ముచ్చెమటలు పడుతున్నాయి. అరగంటకోసారి ఎక్కడో చోట కూలబడితే తప్ప ముందుకు పోలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రచారానికి కేవలం 15 రోజులే గడువు ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఎన్నికల ప్రచారంపై పడుతోంది. దీంతో పగటి పూట ప్రచారం కన్నా సాయంత్రం వేళల్లో వీధి సమావేశాలు, భోజన సమ్మేళనాలు, ఆత్మీయ సదస్సులకే ఎక్కువ మంది పరిమితమవుతున్నారు. తీవ్రమైన ఎండలతో ఉదయం 10 గంటలకే ముగిస్తున్నారు. మళ్లీ సాయంత్రం 4 గంటల తర్వాతే ముందుకొస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపించే దాకా ఇదే తీరును ప్రచారంలో కొనసాగిస్తే… అన్ని నియోజకవర్గాలను చుట్టి రావాలంటే కొంత కష్టమే. ఈ నేపథ్యంలో ఎండలను సైతం లెక్క చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిందే. ముఖ్యంగా ప్రచారంలో తిరిగేవారు.. వడదెబ్బకు గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రతలు పాటిస్తే మంచిదేమో..

ఉభయ తెలుగు రాష్ట్రాలలో 39 నుంచి 45 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రాలో కొన్ని రోజులుగా వడగాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో ఎండలో తిరగడంతో త్వరగా అలసట వచ్చి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. మండే ఎండలో వెళ్లడం కంటే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారాలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎక్కువ చెమట పట్టి, ఒళ్లు వేడిగా అనిపించి గొంతు, నాలుక తడి ఆరిపోవడం, సొమ్మసిల్లి పడిపోవడం లాంటి లక్షణాలు వడదెబ్బకు కారణమవుతున్నాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లటి ప్రదేశానికి చేరి తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇంకా నీరసం, అలసట ఉంటే వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవాలి.

కార్యకర్తలూ.. మద్యం జోలికి వెళ్లకండి...

దేశంలో జరిగే అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ఎన్నికలే. ఈ పండగలో కార్యకర్తల జోష్ అంతా ఇంతా కాదు. అయితే మండే ఎండల్లో ఆల్కహాల్ తీసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు డాక్టర్లు. ఎన్నికలంటే మద్యం ఏరులై పారేమాట నిజమే అయినా ఆరోగ్యం ముఖ్యం. మండుటెండలో మద్యం తాగడం మరింత ప్రమాదం. ఆల్కహాల్‌తో శరీరంలోని నీటిశాతం పడిపోతుంది. ఉచితమే కదా అని అతిగా తాగితే ఆరోగ్యానికి ప్రమాదమే. ఎండలో తిరిగేవారు భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ నూనెలు, మసాలాలు ఉండే ఆహారం బదులు ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్లు, పెరుగు, సీజనల్‌ పండ్లు తీసుకోవడంతో శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవచ్చు.

అధిక ఉష్ణోగ్రతలతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీటి శాతం తగ్గిపోతుంది. ఇదే సమయంలో బీపీ మాత్ర వేసుకుంటే బీపీ మరింత తగ్గే ప్రమాదముంది. వేసవిలో వైద్యులను సంప్రదించి బీపీ మాత్రల్లో మార్పులు చేయించుకోవాలి. ఈ మాత్రలు వేసుకోవడం మానేసినా ప్రమాదమే. ఎండలో తిరుగుతున్నప్పుడు శరీరం నుంచి చెమట రూపంలో నీళ్లు బయటకు పోతుంటాయి. పోటాషియం, సోడియం తదితర ఎలక్టరోల్స్‌ తగ్గిపోవడంతో గుండెపై భారం పడుతుంది. అందుకే తరచూ కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ వంటివి తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ అభ్యర్థులకు ఎవరో ఒకరు సమకూర్చుతారు గాని కార్యకర్తలకు దొరికేది అంతంత మాత్రమే. అందువల్ల ప్రచారానికి వెళ్లే కార్యకర్తలు తమ జాగ్రత్తల్లో తాము ఉండడం చాలా అవసరం. ఎన్నికల రోజు వరకు అంటే మే 13 వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చునని వాతావరణ కేంద్రం చెబుతున్న మాటను పెడచెవిన పెట్టకండి.

Tags:    

Similar News