Mega brother Nagababu మెగా బ్రదర్ నాగబాబుకు డబుల్ ధమాకా..
డిప్యూటీ సీఎం అన్న నాగబాబుకు అదృష్టం కలిసి వచ్చింది. ఒకేసారి రెండు పదవులు వరించనున్నాయి.;
By : SSV Bhaskar Rao
Update: 2024-12-10 03:41 GMT
సినిమా తెరపై కొణిదెల చిరంజీవితో పాటు ఆయన తమ్ముళ్లు పట్టు సాధించారు. విభిన్న కథలు ఇతివృత్తంగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా,
మెగా బ్రదర్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల్లో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి నుంచి నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించిన పొత్తుల్లో భాగంగా అది సాధ్యపడలేదు. రాజ్యసభ స్థానానికి కూడా వీలుకాని పరిస్థితి. అందువల్ల
"నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వనున్నట్లు" సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని సీఎం నిజం చేశారు. ఇదిలాఉంటే,
అసెంబ్లీ చరిత్రలో రికార్డు?
ఉభయసభల్లో సభ్యుడు కాకుండా నాగబాబు మంత్రి పదవి చేపడితే చరిత్రలో రెండో వ్యక్తిగా నిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే కాకుండానే నందమూరి హరికృష్ణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో శాసనమండలి మనుగడలో లేకపోవడం వల్ల ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేక, ఆరు నెలల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా,
టిడిపి కూటమి అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో అన్న నాగబాబుకు టిటిడి చైర్మన్ పదవికి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ పదవికి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో నాగబాబు కూడా సుముఖంగా లేనట్లు పవన్ కళ్యాణ్ తోపాటు నాగబాబు కూడా ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
రాజ్యసభ మిస్
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మాజీ సీఎం వైయస్ జగన్ తో వివేధించిన మాజీ మంత్రులే కాకుండా, ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ ఖాళీల్లో ఒకస్థానం నాగబాబుకు దక్కుతుందని జనసేన శ్రేణులు సంబరపడ్డాయి. అయితే,
పొత్తు ధర్మం వల్లే..
ఇటు రాష్ట్రంలో టిడిపి కూటమి, కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రాజకీయ సమీకరణల నేపథ్యాన్ని పరిశీలిస్తే,
వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు సభ్యులు కూడా బీసీ సామాజిక వర్గం వారే. మూడు స్థానాల్లో ఒకటి బిజెపికి కేటాయించగా, రాజీనామా చేసిన కొద్ది రోజుల్లోనే బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్యకు, నెల్లూరు జిల్లాలో బీసీ సామాజిక వర్గానికే చెందిన బీద మస్తాన్ యాదవ్ కు టిడిపి నుంచి మళ్లీ పదవులు వరించాయి. ఇందులో కూడా సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి వైసిపికి విమర్శించే ఆస్కారం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. మరో స్థానం కూడా టిడిపి నే తీసుకొని సాన సతీష్ కు అవకాశం ఇచ్చింది. ఈ పరిణామాలతో నాగబాబుకు రాజ్యసభ దక్కని పరిస్థితి ఏర్పడింది.
మండలి.. ఆపై మంత్రి..
శాసనమండలిలో కూడా వైసీపీ సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ఒకరిగా కొణిదల నాగబాబుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతేకాకుండా తన మంత్రివర్గం లోకి తీసుకోనున్నట్లు కూడా స్పష్టం చేశారు. సోమవారం రాత్రి టిడిపి రాష్ట్ర కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటన కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ పదవి దక్కకుండానే నాగబాబు మంత్రి అయితే, విభజిత రాష్ట్రంలో కూడా ఓ రికార్డు నమోదయ్యే అవకాశం లేకపోలేదు.
టిడిపి కూటమిలో ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. ఎందుకనో తెలియదు కానీ, ఓ బెర్త్ ఐదు నెలలుగా ఖాళీగా ఉంచారు. ఆ స్థానంలో కొణిదల నాగబాబుకు ఛాన్స్ దక్కింది.
గతంలో హరికృష్ణ..
ఉమ్మడి రాష్ట్రంలో 1994 ఎన్నికల్లో టిడిపి అఖండ విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లమే దక్కాయి.
1995లో టిడిపిలో ఏర్పడిన ఆగస్టు సంక్షోభంతో ఎన్టీ రామారావు సీఎం పదవిని కోల్పోయారు. ఆ పదవిని చంద్రబాబు చేపట్టడం, ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి హరికృష్ణ అండగా నిలిచారు. అప్పటివరకు హరికృష్ణకు టిడిపిలో, ప్రభుత్వంలో కూడా ఏ పదవి లేదు. ఎన్టీఆర్ అభిమానుల నుంచి విమర్శలకు ఆస్కారం లేని రీతిలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అప్పటి పరిస్థితులు చెప్పకనే చెబుతాయి.
అందులో భాగంగా హరికృష్ణను ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. రవాణా శాఖ మంత్రిగా నియమించారు.
ఆ రోజుల్లో శాసనమండలి మనుగడలో లేదు.ఎన్టీ. రామారావు సీఎం అయ్యాక మండలి ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
దీంతో మంత్రిగా ఉన్న హరికృష్ణ పోటీ చేయడానికి అసెంబ్లీ స్థానాలు ఖాళీగా లేవు. నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపల ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అప్పటి వాతావరణం అందుకు అనుకూలంగా లేకపోవడంతో నందమూరి హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇది ఒక రికార్డుగా శాసనసభ చరిత్రలో నిలిచిపోయింది.
నాగబాబుకి ఇబ్బంది లేదు..
ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు శాసనమండలి కూడా మనుగడలో ఉంది. అందువల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రస్తుత పరిస్థితులు స్థానాలు ఖాళీలేకున్నా, మంత్రి పదవి చేపట్టే కొణిదెల నాగబాబుకు, రోజుల వ్యవధిలో అయినా ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి అవసరమైన అనుకూల పరిస్థితులు ఉండడం గమనార్హం. ఎమ్మెల్సీగా నియామకానికి ముందే నాగబాబు మంత్రి పదవి చేపడితే రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఓ రికార్డు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఏ పదవి..?
టిడిపి కూటమిలో భాగస్వామి అయిన జనసేన నుంచి ప్రధాన కార్యదర్శి గా ఉన్న కొణిదెల నాగబాబుకు దక్కే మంత్రి పదవిపై కూడా అప్పుడే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఆయనకు పర్యాటక శాఖ లేదా సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్లు అప్పుడే జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. అంతిమంగా సీఎం చంద్రబాబు ఏ పదవి ఇస్తారనేది వేచి చూడాల్సిందే.
నెల్లూరులో సంబురాలు
మా ధైర్యం కొణిదల నాగబాబుకు మంత్రి హోదా కల్పించడంపై నెల్లూరులో సంబురాలు చేసుకున్నారు. "మెగా అభిమానులు, జనసేన క్యాడర్ కు ఈ రోజుటి నుంచి పండుగ దినమే" అని ఆనందం వ్యక్తం చేశారు. జనసేన నెల్లూరు జిల్లా కార్యాలయంలో వేడుక చేసుకున్నారు.