రాష్ట్రం దాటి వెళ్ళొద్దని ఆంక్షలు

రాష్ట్రంలో కొత్తగా టిడిపి ప్రభుత్వం కొలువు తీరనున్నది. ఈ పరిస్థితుల్లో అధికారుల్లో హైరానా మొదలైంది. టీటీడీ ఈఓకు ఆంక్షలతో కూడిన సెలవు మంజూరైంది.

Update: 2024-06-11 04:41 GMT

రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడనున్నది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి నేతలతో అంటకాగిన అధికారుల్లో హైరానా మొదలైంది. తమకు ఎలాంటి పరిస్థితి ఎదురు కానున్నదో అనే ఆందోళన కూడా కనిపిస్తోంది. ఆ అధికారుల కోవలో ఒకరైన... టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వారం రోజుల వ్యక్తిగత సెలవుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు ఈనెల 11వ తేదీ నుంచి వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సెలవు మంజూరు చేశారు. అయితే, " రాష్ట్రం దాటి వెళ్లవద్దని" ఆంక్షలు విధిస్తూ సెలవు మంజూరు చేశారు. ఆ మేరకు జీఏడీ నుంచి సోమవారం జీవో విడుదలైంది. ఈ ఆంక్షలు విధించడం వెనక ఆంతర్యం ఏంటి అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది.

టిటిడిలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం మారుతున్న వేళ
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏవి. ధర్మారెడ్డికి రక్షణ నిలిచిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్ఆర్సిపి 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. టిడిపి కూటమి అధిక స్థానాలు సాధించింది. దీంతో టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు 12వ తేదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రాత్రి
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం హోదాలో ఎన్. చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్నారు. రాత్రికి తిరుమలలో బస్ చేసే ఆయన కుటుంబం 13వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటుంది. ఆమేరకు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా జీఏడీ జారీ చేసింది. సీఎం హోదాలో వచ్చే చంద్రబాబుకు టీటీడీ ఈవోగా ఏవి. ధర్మారెడ్డి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాలి. కానీ ఇప్పటికే ఆయన వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా వారికి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలతోపాటు, నిధుల దుర్వినియోగం కూడా పాల్పడ్డారనే అపవాదులు మూటగట్టుకున్నారు. అధికారంలోకి రానున్న కూటమి పార్టీలకు ఏవి. ధర్మారెడ్డి టార్గెట్ గా మారినట్లు వాతావరణం చెప్పకనే చెబుతోంది.
మూడోసారి నియామకం
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడింది. సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలో అనేకమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ, వారందరిని తోసిరాజని
ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ( ఐడిఈఎస్) ఢిల్లీలో అధికారిగా ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన ఏవీ ధర్మారెడ్డి టీటీడీ అదనపు ఈవోగా 2021 మే 25వ తేదీ తీసుకువచ్చారు. ప్రత్యేక అధికారాలతో ఆయనను డిప్యూటేషన్ పై టిటిడి పూర్తిస్థాయి ఈవోగా నియమిస్తూ అప్పటి సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి నియమించారు. ఆయన డిప్యూటేషన్ ముగియడంతో ఏడాది ఆరంభంలోనే ఆయనకు మళ్ళీ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయించడంలో కీలక పాత్ర వహించారు. వాస్తవానికి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన ఏవీ ధర్మారెడ్డి డిప్యూటేషన్ గడువు గత నెల 14వ ముగిసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరిక మేరకు ఆయన పదవీకాలం జూన్ 30వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది.
వైఎస్ఆర్ కాలంలోనూ..
గతంలో కూడా దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి హాయంలో ఏవి ధర్మారెడ్డి 2004 జూలై 5వ తేదీ నుంచి 2006 సెప్టెంబర్ 9 వరకు టీటీడీ తిరుమల పనిచేశారు. మళ్లీ 2008 ఏప్రిల్ 2 నుంచి 2010 ఆగస్టు 31 వరకు ఆయన ప్రత్యేక అధికారిగా తిరుమలలో నియమితులయ్యారు. ఆయనకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు అనేది నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది.
ముసురుకున్న ఆరోపణలు
తాజా మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతులు చేపట్టిన తర్వాత ఢిల్లీ నుంచి డిప్యూటేషన్ పై నాలుగేళ్ల క్రితం వచ్చిన ఏవీ ధర్మారెడ్డి తిరుమలలో కొన్ని సంస్కరణలు అమలు చేశారు. అయితే, వైఎస్ జగన్ చిన్నాన్న, టిటిడి మాజీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి రెండుసార్లు వరుసగా అదే పదవి చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డినీ టిటిడి చైర్మన్ గా నియమించారు. అంతకుముందు నుంచి టీటీడీ నిధుల వినియోగంలో బోర్డు అనుమతితో నిధులు మంజూరు చేసినప్పటికీ, అందులో ఏవి. ధర్మారెడ్డి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. తిరుపతి నగరాభివృద్ధికి కేటాయించిన నిధుల్లో కూడా దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దాతలు నుంచి వసూలు చేసిన సొమ్ములోను అవకతవకలు చోటుచేసుకున్నాయనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన అనేక విషయాల్లో అప్పటి అధికార వైయస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు చెప్పిన వాటన్నిటికీ తలఊపి అనుకూలంగా వ్యవహరించినట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇలా ఉండగా
సిఐడి కి ఫిర్యాదు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి అధిక స్థానాలు సాధించింది. మొదటినుంచి టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డిపై టిడిపి, జనసేన,బిజెపి నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రోజుల కిందటే స్థానిక సిఐడి కార్యాలయంలో టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డిపై తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. టిడిపి కూటమే అధికారంలోకి వస్తుండడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. అందువల్ల ఆయనపై కేసు నమోదు చేసి, పాస్పోర్ట్ కూడా సీట్ చేయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల కొండపై ఎంతోమందిని ధర్మారెడ్డి ఇబ్బందులకు గురి చేశారని, రు. వందల కోట్లు శ్రీవారి సొమ్ము తిరుమల నుంచి అక్రమంగా తరలిపోయిందని కూడా ఆయన ఆరోపించారు. వీటన్నిటి పైన సమగ్ర విచారణ జరిపించడానికి చర్యలు తీసుకోవాలని కిరణ్ డిమాండ్ చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ...
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సెలవు పై వెళుతుండడం చర్చకు దారి తీసింది. ఆయనకు సెలవు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆంక్షలు విధించడంలో ఆంతర్యం ఏమిటి అనేది కూడా సందేహాస్పదంగా మారింది. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది వేచి చూడాలి.
Tags:    

Similar News