ఎంత చదివినా దళితులు కాళ్ళకింద పడుండాల్సిందేనా ?

దేశమంతా ఘనంగా పండుగ చేసుకున్నామే కాని నిజంగా వ్యక్తిస్వేచ్చ ఉందా ? అందులోను దళితులు తామిష్టం వచ్చినట్లు తాము బతికే స్వేచ్చుందా ?

Update: 2024-09-24 14:34 GMT

స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయ్యిందని దేశమంతా ఘనంగా పండుగ చేసుకున్నామే కాని నిజంగా వ్యక్తిస్వేచ్చ ఉందా ? అందులోను దళితులు తామిష్టం వచ్చినట్లు తాము బతికే స్వేచ్చుందా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానం కాదు దళితులు తమిష్టం వచ్చినట్లు తాము బతికే స్వేచ్చలేదని చెప్పే ఘటన తెలంగాణా గ్రామంలో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే మెదక్ జిల్లాలో గౌతోజీగూడ అనే గ్రామం ఉంది. హైదరాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందా ఆ గ్రామం. ఆ గ్రామంలో డప్పు వాయించమని ‘పెద్దలు’ అడిగినా ఇద్దరు దళిత సోదరులు నిరాకరించినందుకు సామూహికంగా ఆ కుటుంబాన్ని గ్రామపెద్దలు బహిష్కరించిన విషయం వెలుగుచూసింది.

గ్రామంలో ఏమి జరిగిదంటే ఇద్దరు ముదిరాజ్ కుటుంబాల్లో ఫంక్షన్లు జరిగాయి. ఆ ఫంక్షన్లలో డప్పు కొట్టాలని గ్రామంలోని పెద్దలు దళిత సోదరులు పంచమి చంద్రం, పంచమి అర్జున్ ను ఆదేశించారు. అయితే డప్పుకొట్టేందుకు సోదరులిద్దరు నిరాకరించారు. ఎందుకంటే డప్పుకొట్టే పనినుండి తమ కుటుంబాన్ని దూరం చేయాలని సోదరులిద్దరు అనుకున్నారు. అనుకున్నట్లే ఇద్దరు కష్టపడి పెద్ద చదువులు చదువుకున్నారు. తమ తండ్రి పంచమి శంకరయ్య డప్పు కొట్టడాన్ని సోదరులిద్దరు చిన్నపట్టి నుండే వ్యతిరేకించేవారు. ఎందుకంటే డప్పు కొట్టేవాళ్ళని గ్రామంలో చాలా చిన్నచూపు చూడటాన్ని వీళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అందుకనే తమ తండ్రిలాగ తాము డప్పుకొట్టకొట్టకుండా గౌరవప్రదమైన జీవితం గడపాలని కోరుకున్నారు.

అయితే పంచమి శంకరయ్య 2015లో చనిపోయారు. చిన్నప్పటి నుండి కలలు కంటున్నట్లే సోదరులిద్దరు హైదరాబాదుకు వచ్చేసి కష్టపడి చదివి మంచి ఉద్యోగాల్లో సెటిలయ్యారు. ఎంకామ్ చదివిన చంద్ర మేడ్చల్ లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అర్జున్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి పెద్ద కంపెనీలో కెమిస్టుగా పనిచేస్తున్నాడు. ఈమధ్యనే సోదరులిద్దరు ఊరికి వెళ్ళినపుడు అంటే సెప్టెంబర్ మొదిటివారంలో గ్రామపెద్దలు రెండు ముదిరాజ్ కుటుంబాల్లో జరిగిన కార్యక్రమాలకు డప్పు కొట్టాలని ఆదేశించారు. గ్రామపెద్దలు చెప్పిన దాన్ని సోదరులు పట్టించుకోలేదు. తాము డప్పుకొట్టేదిలేదని స్పష్టంగా చెప్పేశారు. మామూలుగా గ్రామాల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు ఇతరుల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాల్లో డప్పుకొట్టడం సహజమే. అందుకనే సోదరులను డప్పు కొట్టమని గ్రామపెద్దలు ఆదేశించింది.

అయితే డప్పు కొట్టేందుకు సోదరులు నిరాకరించటాన్ని గ్రామపెద్దలు అవమానంగా భావించారు. దాంతో గ్రామపంచాయితీని సమావేశ పెట్టి తమ ఆదేశాలను పాటించేందుకు నిరాకరించిన పంచమికుటుంబాన్ని బషిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదు, కుటుంబానికి ఎవరూ ఏ రూపంలో కూడా సాయం చేయకూడదని సెప్టెంబర్ 10వ తేదీన తీర్మానించారు. దాంతో కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. 30 ఏళ్ళుగా గ్రామంలోనే పుట్టి పెరిగినా, గ్రామంలోని అందరు బాగా తెలిసినా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. చివరకు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా గ్రామానికి దూరంగా ఉన్న పట్టణానికి వెళ్ళాల్సొస్తోందని చందు బాధతో చెప్పుకున్నారు.

తాము డప్పుకొట్టాలా వద్దా అన్నది తమ వ్యక్తిగతమన్న విషయాన్ని అర్జున్ గుర్తుచేశాడు. డప్పు కొట్టమని చెప్పినందుకు తమ కుటుంబాన్ని బహిష్కరించే అధికారం పంచాయితీ పెద్దలకు ఎవరిచ్చారంటు సోదరుల తల్లి పంచమి నర్సమ్మ ఆవేధనతో ప్రశ్నించారు. ఎన్నిరోజులైనా బహిష్కరణ వేటు తొలగకపోయేసరికి వేరేదారిలేక సోదరులు మనోహరాబాద్ పోలీసు స్టేషన్ కు వెళ్ళి తమకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందగానే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గ్రామంలోని 19 మందిని అరెస్టు చేశారు. తప్పించుకున్న మరో 14 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన ఘటనతో దళితులు ఎంతగా చదువుకున్నా గ్రామపెద్దల కాళ్ళకింద పడుండాల్సిందేనా అన్న అర్జున ప్రశ్న నిజమేనేమో అనిపిస్తోంది.

Tags:    

Similar News