ఏపీలో సంవిత్ పాఠశాలను ప్రారంభించండి స్వామీ
కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్.;
ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థుల కోసం సంవిత్ పాఠశాలను ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ జగద్గురు నిర్మలానందనాథ మహాస్వామీజీని కోరారు. అందుకు ఆయన అంగీకారం తెలిపారు. కర్ణాటక మండ్యం జిల్లాలోని 1800 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మిక కేంద్రమైన ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని ఆదివారం మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ క్షేత్రంలోని శ్రీకాలభైరవస్వామిని దర్శించుకున్న లోకేష్ అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠం 72వ పీఠాధిపతి జగద్గురు నిర్మలానందనాథ మహాస్వామీజీని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా, ఆధ్యాత్మిక, విద్యా కార్యక్రమాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, వైద్య కళాశాల, ఆసుపత్రి, యూనివర్శిటీలను మంత్రి నారా లోకేష్ సందర్శించి అక్కడి వాతావరణాన్ని ఆయన పరిశీలించారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిత్ పాఠశాల గురించి లోకేష్ ప్రత్యేకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు పైసా ఖర్చు లేకుండా మంచి చదువులు చెబుతున్నారని, అన్ని వసతులు ఉచితంగానే కల్పిస్తున్నట్లు నిర్వాహకులు లోకేష్‌కు వివరించారు. ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఏరాష్ట్రంలో డిగ్రీలు చదవాలన్నా ఆ విధ్యార్థులకు మఠం ఆధ్వర్యంలోనే ఆర్థిక సాయం అందిస్తుందని నిర్వాహకులు లోకేష్‌కు తెలిపారు. ఈ కార్యక్రమాలు నచ్చడంతో ఇలాంటి సంవిత్ పాఠశాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రారంభించాలని నిర్వాహకులను మంత్రి నారా లోకేష్ కోరారు.