యనమల సోదరుల పోరులో నలుగుతున్న బిడ్డ దివ్య

ఒకరికి సొంత కూతురు.. మరొకరికి సోదరుని కూతురు.. ఇద్దరి సోదరుల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. మరి బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది?

Update: 2024-04-08 12:42 GMT

జి. విజయ కుమార్ 

ఇప్పుడు అందరి దృష్టి తుని అసెంబ్లీ నియోజక వర్గంపైనే ఉంది. ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు జరుతుండటం.. ఆ ఇద్దరు సోదరులు కావడం.. అక్కడ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి వారి కూతురు కావడంతో రాజకీయ వర్గాల్లో తుని అసెంబ్లీ నియోజక వర్గం టీడీపీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వర్గ పోరులో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ అసెంబ్లీ స్పీకర్‌ యనమల రామకృష్ణుడు ఉండటంతో దీనికి మరింత ప్రాధాన్యత వచ్చింది.

యనమల రామకృష్ణుడు 2024 ఎన్నికల్లో తుని అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తన బిడ్డను రంగంలోకి దింపారు. యనమల దివ్యకు సులువుగానే టికెట్‌ ఖరారు చేయించుకున్న యనమల రామకృష్ణుడుకి ఆ తర్వాత నుంచి సమస్యలు వచ్చి పడ్డాయి. తన సోదరుడి నుంచే ఈ ఇబ్బందులు రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సోదరుడు యనమల కృష్ణుడికి తుని అసెంబ్లీ నియోజక వర్గం టీడీపీ టికెట్‌ రాకుండా యనమల రామకృష్ణుడు చక్రం తిప్పాడు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై రామకృష్ణుడిపై తమ్ముడు కృష్ణుడు తిరుగుబాటు జెండా ఎత్తారు.
రాజకీయ వారసుడిగా సోదరుడు
గత రెండు దఫాలుగా యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నో పదవులు చేపట్టిన యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించారు. అప్పటి వరకు తన గెలుపు కోసం.. తుని నియోజక వర్గంలో తన పట్టు సడలకుండా తెర వెనుక కృషి చేసిన తన సోదరుడు యనమల కృష్ణుడిని రాజకీయ వారసుడిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి తేవాలనుకున్నారు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో తుని టీడీడి అభ్యర్థిగా సోదరుడు యనమల కృష్ణుడికి టికెట్‌ ఇప్పించుకున్నారు. రెండు ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో 18,573 ఓట్ల తేడాతో ఓడిపోయిన యనమల కృష్ణుడు.. 2019 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా 6వేల పైచిలుకు తేడాతో ఓటమి పాలయ్యారు.
రంగంలోకి కుమార్తె దివ్యను దింపిన యనమల
రెండు సార్లు సోదరుడు ఓటిమి పాలు కావడంతో ఈ సారి రాజకీయ వారసురాలిగా తన కుమార్తె యనమల దివ్యను నేరుగా బరిలోకి దింపాలని యనమల నిర్ణయించారు. దీంతో 2024 ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా తుని టీడీపీ టిక్కెట్‌ ఇప్పించుకోవడంలో చంద్రబాబును సులువుగానే ఒప్పించారు. దీని కోసం ఆయన పెద్ద కష్టపడింది లేదు. ఈ సారి కూడా తానే తుని సీటు దక్కించుకోవాలని యనమల సోదరుడు యనమల కృష్ణుడు తీవ్ర ప్రయత్నాలు సాగించారు. రెండు సార్లు అవకాశం కల్పించినా ఫలితం దక్కక పోవడంతో చంద్రబాబు కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇదే సమయంలో యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్య అంశం చంద్రబాబు ముందు ఉంచారు. సోదరుడు కృష్ణుడికి కాకుండా దివ్యకు సీటివ్వాలని కోరారు. దీనికి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి.
అసంతృప్తిలో కృష్ణుడు
తనకు సీటు దక్కక పోవడంతో యనమల కృష్ణుడు యనమల రామకృష్ణుడిపై కోపం పెంచుకున్నారు. యనమల రామకృష్ణుడు వల్లే తనకు సీటు దక్కలేదని తెలుసుకున్న కృష్ణుడు ఆయనతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం ప్రారంభించారు. దీంతో ఇరువురి మధ్య గ్యాప్‌ ఏర్పడింది. ఇది పెరిగి పెద్దది కావడంతో ఇరువురి మధ్య స్పర్థలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దివ్యకు టికెట్‌ లభించడంపై కలిసి పని చేసేందుకు ముందుకు రాకపోవడం, సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. దీంతో కృష్ణుడి వర్గాన్ని రామకృష్ణుడు దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన లేకుండానే ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణుడి వర్గంలోని కొంత మంది నేతలు, కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్‌ఆర్‌సీపీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇది కొనసాగితే టీడీపీకి లాస్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు యనమల దివ్య మాత్రం ఇరువురి వర్గ పోరులో నలిగి పోతుందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తెలుగుదేశం పార్టీలో వీరిద్దరికీ నష్ణం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తునిని టీడీపీ అడ్డాగా మార్చిన యనమల
తుని అసెంబ్లీ నియోజక వర్గాన్ని యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీకి అడ్డాగా మార్చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్‌ గెలవగా.. ఆరు సార్లు టీడీపీ విజయ పతాకం ఎగురవేసింది. వైఎస్‌ఆర్‌సీపీ రెండు సార్లు గెలిచింది. 1983 నుంచి 2004 వరకు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన యనమల రామకృష్ణుడు తిరుగు లేని నేతగా అవతరించారు. 2009లో ఓటమి తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడిని రంగంలోకి దింపారు.యనమల సోదరుల పోరులో నలుగుతున్న బిడ్డ దివ్య
Tags:    

Similar News