ఆళ్లగడ్డలో టీడీపీ, జనసేన కొట్లాట .
నిలిచిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలపై ప్రత్యేక కథనం.
By : The Federal
Update: 2025-10-08 07:42 GMT
-వడ్ల శ్రీకాంత్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తుంది. సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమినేతలు కీలకంగా వ్యవహరిస్తూ తామంతా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు చెప్తున్నారు, చేసి చూపిస్తున్నారు. అయితే అయితే కింది స్థాయి కూటమి కార్యకర్తల్లో మాత్రం అంతటి సత్ సంబంధాలు కనపడటం లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే పరిస్థితి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నెలకొంది. ఆళ్లగడ్డ అంటేనే ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డగా ఉండేది. ప్రస్తుతం ప్రజలలో పెరిగినటువంటి అవగాహన కేసి కెనాల్, ఎస్ఆర్బిసి, తెలుగుగంగా ప్రాజెక్టుల వల్ల ఈ నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా మారింది. అయితే రాజకీయాలలో మాత్రం ఆనాటి ఒంటెత్తు పొకడలు మాత్రం మారడం లేదు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన భూమా అఖిలప్రియ అభ్యర్థిగా నిలబెట్టింది.
భూమా అఖిలప్రియ
ఈ ఎన్నికలో అఖిలప్రియ అందరి సహకారంతో అపూర్వ విజయాన్ని అందుకున్నారు. కూటమి అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తూ జనసేన పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఎంతగానో కృషి చేశారు. దీనిని గుర్తించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి కట్టుగా మైలేరి మల్లయ్య సతీమణి సురేఖను ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపిక చేశారు. ఈమె గతంలో జనసేన పార్టీ గత రుద్రవరం మండల జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసి ఐదు వేలకు పైచిలుకు ఓట్లను సాధించింది. దీనిని గుర్తించిన కూటమి రాష్ట్ర నాయకులు సురేఖను మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేశారు.
అయితే ఇక్కడే అసలైన ఆధిపత్య పోరు ప్రారంభమైంది. తన ప్రమేయం లేకుండానే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపిక చేశారని ఎమ్మెల్యే అఖిలప్రియ అలకపూనారు. తన వర్గం వారికి మాటిచ్చానని, చైర్మన్గా తాను సూచించిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలంటూ పట్టుపడుతూ ఎంపిక జరిగే నెలరోజులైనా ఉత్తర్వులు జారీ కాకుండా అడ్డుకుంటుందని జనసైనికులు చెప్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా మరొకరికి అవకాశం ఇస్తే, ఎక్కడ తమ ఆధిపత్యానికి ముప్పు వస్తుందోనన్న అనుమానంతోనే తమకు అవకాశం లేకుండా చేస్తున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జిల్లాలో ప్రకటించిన మార్కెట్ యార్డ్ కమిటీలు అన్నియు ఇప్పటికే ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్నాయి. ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ మాత్రమే ప్రకటించే నెల రోజులైనా నేటికీ ప్రమాణ స్వీకరానికి నోచుకోలేకపోయింది. దీనికంతటికి కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడమే కాకుండా, ఆధిపత్య పోరు కూడా కారణం అంటున్నారు.
ఇప్పటికే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి అండగా ఉండే సామాజిక వర్గం బలంగా ఉంది. మళ్లీ అదే పార్టీకి చెందిన, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి వస్తే భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్లు కూడా ఆశించే అవకాశం ఉందంటూ. అందుకే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ జన సైనికులు వాపోతున్నారు. అందులో భాగంగానే మొత్తం నియోజకవర్గంలో 14 సింగిల్ విండోలు ఉండగా వాటిలో ఒక్కటి కూడా జనసేన పార్టీకి కేటాయించకుండా అన్ని తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వేసుకున్నారని చెప్తున్నారని వారు విమర్శిస్తున్నాను.
ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య
ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య
అలాగే మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించి కూడా చైర్మన్ మాత్రమే జనసేన కేటాయించి మిగిలిన డైరెక్టర్ పదవులన్నీ తమ ఖాతాలోకి వేసుకోవడానికి ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారని జనసేన పార్టీ ఆళ్లగడ్డ ఇంచార్జ్ మైలేరి మల్లయ్య తెలిపారు.
మైలేరి సురేఖ
“ఆమె ఒంటెద్దు పోకడ వల్లే కమిటీ ప్రమాణ స్వీకారం ఆలస్యం అవుతున్నది. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా నా భార్య పేరును ప్రకటించినప్పటి నుంచి గౌరవ సూచకంగా ఎమ్మెల్యే గారిని కలవడానికి ఎంతగానో ప్రయత్నించినాను. అయినా అఖిల ప్రియ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు,” అని మల్లయ్య బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేసిన తమకు తగిన గుర్తింపుని ఇవ్వాలని మల్లయ్య కోరారు.
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార జాప్యంపై ఎమ్మెల్యే అఖిలప్రియను సంప్రదించగా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. “జనసేనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వాలని మేమే ప్రపోజల్ పెట్టాము. ఇప్పటికీ చాలా చోట్ల మార్కెట్ కమిటీలు, దేవాలయకమిటీల నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి మాత్రమే,” అని ఆమె తెలిపారు. అదే విధంగా కూటమి పార్టీలలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తాను అందర్నీ కలుపుకుపోయేందుకే తాను ప్రయత్నిస్తున్నట్టు ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు.