Revanth and Gamechanger|గేమ్ ఛేంజర్ అవ్వాలని అనుకుంటున్న దిల్ రాజు

రేవంత్ ప్రకటనను ఉపసంహరించుకునేట్లు చేసి సినీపరిశ్రమలో తాను గేమ్ ఛేంజర్ అనిపించుకోవాలని దిల్ రాజు(DilRaju) గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.;

Update: 2025-01-06 07:59 GMT

సినీ నిర్మాత, పంపిణీదారుడు కమ్ పిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పట్టువదలటంలేదు. తెలంగాణాలో గేమ్ ఛేంజర్ అవ్వాలని అనుకుంటున్నాడు. రేవంత్ ప్రకటనను ఉపసంహరించుకునేట్లు చేసి సినీపరిశ్రమలో తాను గేమ్ ఛేంజర్ అనిపించుకోవాలని దిల్ రాజు(DilRaju) గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణా(Telangana)లో కూడా భారీసినిమాలకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేసుకోవటంతో పాటు టికెట్ల ధరల పెంపుకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈనెల 10వ తేదీన రామ్ చరణ్(Ramcharan Gamechanger) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. బెనిఫిట్ షోలని, ప్రీమియర్ షోల పేరుతో టికెట్ల ధరలను తమిష్టం వచ్చినట్లుగా పెంచుకునే వెసులుబాటును తెలంగాణాలో నిలేపిస్తున్నట్లు రేవంత్ రెడ్డి(Revanth) ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్ ఇంత సడెన్ గా ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించారంటే పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటనే.

డిసెంబర్ 4వ తేదీన సంధ్యా ధియేటర్లో విడుదలైన పుష్ప సినిమా(Pushpa Movie) ప్రమోషన్ కోసం హీరో అల్లుఅర్జున్ వచ్చాడు. అప్పుడు ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించటంతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. దాంతో తొక్కిసలాటఘటన దేశంలో పెద్ద సంచలనమైంది. ఇదేసమయంలో తొక్కిసాలటకు తనకు ఎలాంటి సంబంధంలేదని అల్లుఅర్జున్ ప్రకటించాడు. తర్వాత జరిగిన పరిణామాల కారణంగా పోలీసులు కేసు నమోదుచేయటమే కాకుండా అల్లుఅర్జున్ ను అరెస్టు కూడా చేశారు. ఈ నేపధ్యంలోనే కొత్తసినిమాలకు ఇకనుండి తెలంగాణాలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల ధరల పెంపుకు అనుమతిచ్చేదిలేదని అసెంబ్లీలో ప్రకటించారు. రేవంత్ ప్రకటన సినీపరిశ్రమపై పెద్ద బండరాయిపడటమనే చెప్పాలి. ఎందుకంటే హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చుకుంటున్న నిర్మాతలు ఆ డబ్బులో ఎంతో కొంత తిరిగి రాబట్టుకునేందుకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతో తమిష్టం వచ్చినట్లుగా టికెట్ల ధరలను పెంచుకుంటున్నారు.

భారీ రెమ్యూనరేషన్లు తీసుకుంటున్న హీరోలు, ఇచ్చుకుంటున్న నిర్మాతలు బాగానే ఉన్నారు. మధ్యలో ఎలాంటి సంబంధంలేని సినిమా అభిమానులు నష్టపోతున్నారు. 150 రూపాయలకు దొరికే టికెట్ ను బెనిఫిట్ షో, ప్రీమియర్ షో పేరుతో రు. 500, వెయ్యి రూపాయలకు అమ్ముకుంటున్నారు నిర్మాతలు. సినిమాలు చూడాలన్న అభిమానుల ఆశలను నిర్మాతలు యధేచ్చగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నవే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అసెంబ్లీలో రేవంత్ పై ప్రకటనచేసింది. రేవంత్ ప్రకటన తర్వాత సినీప్రముఖుల్లో కొందరు రేవంత్ తో భేటీ అయినా ఉపయోగం కనబడలేదు.

ఇదేసమయంలో గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు డాకూమహరాజ్ సినిమాకు బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలకు అనుమతితో పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. తెలుగురాష్ట్రాల్లో ఒకటి అనుమతించినంత మాత్రాన నిర్మాతల జేబులు నిండవు. ఎందుకంటే బిజినెస్ పరంగా తెలంగాణా చాలా కీలకం. అందుకనే దిల్ రాజు తెలంగాణాలో కూడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల ధరల పెంపు విషయమై రేవంత్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచుకునే విషయమై చర్చించేందుకు రేవంత్ ను కలవబోతున్నట్లు దిల్ రాజు చెప్పారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం ఎంతో ముందుచూపుతో ఉన్నట్లు దిల్ రాజు కితాబిచ్చారు. సినీనిర్మాతగా టికెట్ల ధరల పెంచుకునే విషయమై తాను ప్రయత్నం చేస్తానని రాజు చెప్పారు. టికెట్ల ధరలు పెంచుకోవటం వల్ల 18 శాతం జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని రాజు గుర్తుచేశారు.

భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేసుకోవటంతో పాటు టికెట్లధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. సినీఇండస్ట్రీకి మద్దతుగా ఉంటానని రేవంత్ ప్రకటించారు కాబట్టి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని రాజు కోరారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దిల్ రాజు అడిగారనో లేకపోతే మరో నిర్మాత చెప్పారనో తన ప్రకటన నుండి పక్కకు పోతే వ్యక్తిగతంగా రేవంత్ పరువుతో పాటు ప్రభుత్వం పరువు కూడా పోవటం ఖాయం. సినీఇండస్ట్రీని తన కాళ్ళదగ్గరకు రప్పించుకునేందుకే రేవంత్ కుట్రలు చేస్తున్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్, కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay), మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. అలాంటిది ఇపుడు గనుక బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపుకు రేవంత్ అంగీకరిస్తే అసెంబ్లీలో చేసిన ప్రకటనకు విలువలేకుండా పోతుంది. మంచో చెడో రేవంత్ చేసిన ప్రకటనకు సినిపరిశ్రమలోని చాలామంది మద్దతుగా మాట్లాడారు. బయటజనాలు కూడా టికెట్ల ధరలు తగ్గుతాయని సంతోషించారు. అలాంటిది ఇపుడు తానుచేసిన ప్రకటనను రేవంతే తుంగలోతొక్కేస్తే భవిష్యత్తులో ఎవరూ సీఎం మాటకు విలువివ్వరు.

Tags:    

Similar News