వైసీపీని బద్నామ్‌ చేసేందుకు ఆ మార్గం ఎంచుకున్నారా?

మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నేతలను బద్నామ్ చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహాలకు తెరతీసింది. ఏంటా వ్యూహాలు? వాటి వెనుకున్న రహస్యాలేంటి?

Update: 2024-09-16 08:33 GMT

ప్రతీకార చర్యలకు, కక్షసాధింపులకు పాల్పడబోమంటూ ఒక వైపు చెబుతూనే ప్రధాన ప్రత్యర్థి పార్టీ వైఎస్‌ఆర్‌సీపీపై అధికార టీడీపీ అదను చూసి దెబ్బ కొడుతోంది. అందుకు మహిళలకు సంబంధించిన అంశాలను సైతం అస్త్రాలుగా మలుచుకుంటోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్‌ఆర్‌సీపీని ఇరుకున పెట్టేందుకు పన్నుతున్న వ్యూహాల్లో మహిళలకు సంబంధించిన విషయాలను కూడా అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల నుంచి ఆ పార్టీకి విధేయులుగా పని చేశారన్న అపవాదులను ఎదుర్కొంటున్న ఐపీఎస్‌లపై సైతం టీడీపీ మహిళాస్త్రాలను వాడుకోవడం సరికొత్త చర్చకు దారి తీసింది. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వరకు, సీఐ సత్యనారాయణ నుంచి ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వరకు మహిళల అంశాలనే తెరపైకి తెచ్చి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరగడం ఇందుకు నిదర్శనం.

టార్గెట్‌ విజయసాయిరెడ్డి
టీడీపీ అధికారంలోకి వచ్చీ రాగానే నాటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ విజయసాయిరెడ్డిపై దృష్టి సారించింది. అందుకు సరికొత్త ప్లాన్‌ను రచించారు. గిరిజన మహిళా అధికారిణికి సంబంధించిన కుటుంబ వ్యవహారాన్ని ఉపయోగించుకున్నారు. బిడ్డ విషయంలో ఆమెకు, ఆమె భర్తకు ఉన్న వివాదానికి రాజకీయాన్ని జోడించారు. తెరవెనుక ఏమి జరిగిందో ఏమో. ఆమె భర్త మధన్‌మోహన్‌ మాత్రం బాహాటంగానే మీడియా సమావేశాలు నిర్వహించి ఆ బిడ్డ తన వల్ల పుట్ట లేదని దారుణమైన ఆరోపణలు చేయడంతో పాటు ఆ నిందను విజయసాయిరెడ్డిపై మోపి రాజకీయ దుమారానికి కారణమయ్యారు. ఇదే క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ మధన్‌మోహన్‌ స్వయంగా మంత్రి నారా లోకేష్, టీడీపీ కీలక నేతలను కలిసి విజ్ఞాపనలు చేయడం కీలకంగా మారింది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో చివరకు విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలను నిర్వహించి తీవ్ర స్వరంతో టీడీపీ ప్రభుత్వంపైన, అనుబంధ సోషల్‌ మీడియాపైన ఎదురు దాడి చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాలకు సంబందం లేని తన కుటుంబ వ్యవహారాన్ని వివాదం చేసి, తన పరువును బజారుకీడ్చడం పట్ల ఆ మహిళా అధికారిణిసైతం మీడియా సమావేశం నిర్వహించి బోరున విలపించింది. విజయసాయిరెడ్డి వ్యక్తిత్వాన్ని బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయోగించిన ఈ ఆస్త్రం ఎంత మేరకు ఫలించిందో తెలియదు కానీ ఆ అధికారిణిని మాత్రం ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం జరిగి పోయింది.
దువ్వాడపైనా దుమారమే..
టెక్కలి అసెంబ్లీ నియోజక వర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మంత్రి కింజరపు అచ్చన్నాయుడుకి ప్రధాన ప్రత్యర్థిగా నిలచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వ్యవహారంలోను రాజకీయ జోక్యం తోడవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఒక మహిళ వ్యవహారంలో దువ్వాడ భార్య భర్తల మధ్య ఉన్న వివాదానికి రాజకీయ రంగు పులుముకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తనకు న్యాయం చేయాలంటూ దువ్వాడ సతీమణి టీడీపీ నేతల సహకారం కోరడం, టీడీపీ నాయకులే తనను బజారుకీడ్చేందుకు కుట్రలు చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్‌ ఆరోపించడం గమనార్హం. దాదాపు రెండు వారాల పాటు సాగిన ఈ ఎపిసోడ్‌లో టీడీపీ సోషల్‌ మీడియా వింగ్, టీడీపీ నేతలు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. ఇందులో ఎవరికి ఎలాంటి న్యాయం జరిగిందో తెలియదు కానీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబాన్ని మాత్రం బజారున పడేశారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న ముంబాయి సినీ నటి కాదంబరి జత్వాని అంశం కూడా ఇదేరకమైనదే అని చర్చ సర్వత్రా సాగుతోంది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పాత కేసులను తిరగదోడుతున్న అధికార టీడీపీకి, నటి జత్వాని కేసు అందివచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన ఆ కేసు ప్రభుత్వం మారడంతోటే ఒక్క సారిగా తారుమారైంది. అప్పటి ఆ కేసులో నిందితురాలిగా ఉన్న జత్వాని ఇప్పుడు బాధితురాలిగా మారిపోయింది. అప్పుడు బాధితులు నేడు నిందితులుగాను, అప్పుడు కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఇప్పుడు అపవాదులుగాను మారిపోయారు. ఇదంతా అధికార పార్టీ వ్యూహం ప్రకారం నడుస్తున్న ఓ తంతు. ఈ ఎపిసోడ్‌లో తెరవెనుక పెద్ద తతంగమే నడవడంతో ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మళ్లీ పోలీసు దర్యాప్తంటూ అనుకూలంగా మార్చుకునేందుకు అధికార పక్షం చక్రం తిప్పింది. దీనిని అవకాశంగా తీసుకొని ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్‌ జగన్‌ను, ఆ పార్టీని జనంలో పలుచన చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐ ఎం సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తాజాగా డీజీపీ ద్వారకా తిరుమలరావు నివేదిక ఇచ్చారంటూ ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఐజీ కాంతిరాణా టాటా, డీఐజీ విశాల్‌గున్నీలను ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
క్యాట్‌కు సస్పెండైన ఐపీఎస్‌లు
ఈ వ్యవహారం తాజాగా ఐపీఎస్‌ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం మారినప్పుడుల్లా ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగితే విధి నిర్వహణ చేసేదెలా అంటూ ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరి సీనియర్‌ ఐపీఎస్‌ల సలహాతో సస్పెండ్‌ అయిన అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి, న్యాయం కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ వేధింపులు ఐపీఎస్‌లను కూడా ఇబ్బందులు పెట్టే స్థాయికి చేరడంపై పొరుగు రాష్ట్రాల్లోని మాజీ ఐపీఎస్‌లు సైతం తప్పుబడుతున్నారు. సీఐడీ డీజీ, ఫైర్‌సర్వీసెస్‌ డీజీగా పని చేసిన పీవీ సునీల్‌ కుమార్‌కు టీడీపీ ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వక పోవడాన్ని, కొంత మంది ఐపీఎస్‌లను లూప్‌లైన్‌(వీఆర్‌)లో పెట్టడాన్ని ఆక్షేపిస్తున్నారు. తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల బాహాటంగానే తప్పుబట్టడం గమనార్హం.
Tags:    

Similar News