శ్రీవారి లడ్డు:రంగంలోకి దిగిన సీబీఐ- సిట్ దర్యాప్తులో కదలిక
తిరుమల మళ్లీ రాజకీయాలకు కేంద్ర బిందువు కానుంది. లడ్డు కల్తీ వ్యవహారం పై మళ్లీ విచారణ మొదలు కానున్నది.
By : SSV Bhaskar Rao
Update: 2024-11-07 04:47 GMT
చాలా రోజుల తర్వాత తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై సీబీఐ సారధ్యంలో ఏర్పడిన సిట్ (special investigation team) రంగంలోకి దిగింది. రెండు నెలల తరువాత దర్యాప్తులో కదలిక వచ్చింది. ఈ కమిటీలో ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నుంచి సైంటిస్ట్ ను ఇంకా నియమించలేదు.
తిరుమల లడ్డు లో కల్తీ జరిగిందని పిటిషన్ లపై సుప్రీంకోర్టు త్రిసభ్య జడ్జిల కమిటీ విచారణ జరిపిన విషయం తెలిసిందే. "సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందం కల్తీ నెయ్యి వినియోగంపై విచారణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా సభ్యులుగా ఉండాలి" అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే.
అంతకుముందే గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి సారధ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసిన విషయం కూడా తెలిసిందే. ఇందులో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని కూడా నియమించారు.. వీరిద్దరి సారిధ్యంలోనే 27 మంది అధికారులు సిట్ బృందం మూడు రోజులపాటు విస్తృతంగా దర్యాప్తు జరిగింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, "దర్యాప్తును తాత్కాలికంగా ఆపివేస్తున్నాం"అని డిజిపి ద్వారకా తిరుమల రావు తిరుమల లో ప్రకటించారు. ఆ తర్వాత "సీబీఐ సారధ్యంలో సిట్ విచారణ జరపాలి" అని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ అధికారులను ఎంపిక చేయడం, SIT ఏర్పాటులో జాప్యం జరిగింది.
ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే కమిటీ దర్యాప్తును తాత్కాలికంగా ఆలస్యం చేసినట్లు కనిపిస్తుంది. కానీ ఆ తరువాత కూడా సీబీఐ అధికారుల నియామకం జరగలేదు. ఇటీవల హైదరాబాద్ సీబీఐ డైరెక్టర్ ఎస్. వీరేష్ తోపాటు విశాఖ ఎస్పి మురళి. ఆర్ ను సీబీఐ దర్యాప్తు అధికారులుగా నియమించింది. అంతకుముందే, సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన రోజుల వ్యవధిలోనే ఆ కమిటీలో గుంటూరు రేంజ్ డీఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మళ్లీ తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై నియమించిన దర్యాప్తు కమిటీలు కదలిక ప్రారంభమైంది. ఈ కమిటిలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నుంచి ఒకరిని ఇంకా నియమించలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే మళ్లీ తిరుమల శ్రీవారు లడ్డు ప్రసాదం తయారీలో చోటు చేసుకున్న పరిణామాలపై దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదిలా వుంటే, అసలు తిరుమల లడ్డూ ప్రసాదంలో రాజకీయాలు జరగడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిద్దాం...
దీనికి వెనుక కథేమిటంటే...
సెప్టెంబర్ 18: " తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారు. ఇందులో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేప నూనెను కూడా కలిపారు" అని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చెప్పడం ద్వారా ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు.ఈ ప్రకటనతో రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో అలజడి చెలరేగింది.
అంతకుముందు..
జూలై 16వ తేదీ : శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యిని దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఐదు సంస్థల నుంచి సరఫరా జరిగేది. అందులో తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ డైరీ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ నుంచి అందిన నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ (వనస్పతి) తరహా పదార్థాలు ఉన్నాయని విషయం తెలిసిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు.
దీనికి భిన్నంగా..
సెప్టెంబర్ 20: సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను టీటీడీ ఈవో జే శ్యామల రావు కూడా నిర్ధారించారు. మొదట స్వతహాగా ఈవో చెప్పిన మాటలకు, సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తర్వాత చేసిన ప్రకటనకు పొంతన లేకుండా పోయింది. అంతకుమందు..
జూలై : టీటీడీ ఈఓగా బాధ్యతలు తీసుకున్న జే. శ్యామలరావు "లడ్డూ తయారీలో నాణ్యత లేదనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు"
జూలై 8 : నెయ్యి శాంపిల్స్ గుజరాత్ లోని ఎన్డీడీబీకి చెందిన ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఆ నివేదిక 16వ తేదీ అందింది. ఆ సమయంలో అధికారుల సమీక్షలో ఆయన ఏమన్నారంటే...
"నెయ్యిలో కల్తీ ఉందని తేలింది. అందులో కూరగాయల ఫ్యాట్ (వనస్పతి) ఉన్నట్లు రిపోర్టు వచ్చింది" అని ఈఓ శ్యామలరావు చెప్పడం గమనార్హం. దీంతో "ఆ సరఫరాదారుడికి నోటీస్ ఇచ్చాం" రెండు ట్యాంకర్ల నెయ్యి తిరస్కరించాం. రెండో ట్యాంకర్ లో కూడా నాణ్యత లేదని షోకాజ్ నోటీస్ ఇచ్చాం" అని స్పష్టం చేశారు. ఇది గత నెలలో జరిగింది. ఇదిలా ఉండగా..
"తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది. ఈ అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ వేస్తున్నట్లు "సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఆ మేరకు ఆయన గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, సారథ్యంలో విశాఖ రేంజ్ ఐజి గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ విజయరామరాజు సారధ్యంలో తిరుపతి అదనపు ఎస్పి అడ్మిన్ వెంకటరావు, డీఎస్పీలు జి జి సీతారామారావు, శివ నారాయణస్వామి, అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి సత్యనారాయణ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కే ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు ఎస్సై ఎం. సూర్యనారాయణ ను ఈ బృందంలో సభ్యులుగా నియమించారు. ఇందులోని అధికారులతో ఏర్పాటు చేసిన మూడు బృందాలు మూడు రోజుల పాటు అనేక కోణాల్లో విచారణ జరిపారు.
సుప్రీంలో పిటిషన్లతో..
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి ఒకపక్క, టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డతో పాటు మరో భక్తుడు విక్రమ్ సంపత్, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వీటిపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించే విధంగా జస్టిస్ బిఆర్. గవాయ్, జస్ట్ కెవి. విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. దీంతో
స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు "అక్టోబర్ 3వ తేదీ వరకు సిట్ దర్యాప్తు ఆపుతున్నాం" అని అని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ తరువాత విచారణ జరిపిన సుప్రీం కోర్టు సీబీఐ సారధ్యంలో సిట్ ఏర్పాటుకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
దీంతో మళ్ళీ సీబీఐ సారధ్యంలోని సిట్ రంగంలోకి దిగనుంది. అంతకుముందు గుంటూరు రేంజే డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సారధ్యంలో మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో సిట్ బృందం సాగించిన దర్యాప్తు ద్వారా సేకరించిన సమాచారంతో నివేదిక సిద్ధం చేశామని తెలుస్తోంది. ఆ నివేదికలు, నెయ్యిలో కల్తీ జరిగిందా? లేదా? అనే విషయంలో గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ అందించిన రిపోర్టులను కూడా సీబీఐ బృందం ఈపాటికే ఒకసారి పరిశీలన సాగించినట్లు తెలుస్తోంది. వీరు రంగంలోకి దిగడం ద్వారా ఏమి తేలుస్తారు? ఈ సమయంలో మళ్లీ తిరుమల రాజకీయాలకు కేంద్రంగా మారుతుందా? ఏమి జరగబోతుందనేది వేచిచూడాలి.