వెలిగొండ రైతులకు జగన్ చేసిన మోసం ఏమిటో చూపిస్తా, రండి!
జగన్ ‘జాతికి అంకితం’ వెనుక అసలు నిజాలు ఇవేనంటున్న మంత్రి నిమ్మల
By : The Federal
Update: 2025-12-12 11:47 GMT
వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే ‘జాతికి అంకితం’ చేసి, ప్రకాశం జిల్లా రైతులను మోసం చేసిన వైఎస్ జగన్ పాలనలోని దగా ఒక్కొక్కటిగా బయటపడుతోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్‌లో ఉండగానే ప్రాజెక్టును పూర్తయినట్టుగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారని ఆయన ఆరోపించారు.
ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ లైనింగ్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు స్థానిక రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించగా, టన్నెల్‌లో 18 కిలోమీటర్లు ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
వెలిగొండ ప్రాజెక్టులో జగన్ చేసిన తప్పిదాలు అన్నీ ఇన్ని కాదు, ఇది నేరుగా రైతుల్ని మోసం, దగా చేయడమేనని మంత్రి నిమ్మల ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్టు ప్రకటించి రైతులను మభ్యపెట్టారు. ఈ నిజాలు జిల్లా రైతులకు తెలియాల్సిందేనని రైతులతో కలిసి సమీక్ష చేశాం అని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అసలు పనులు మొదలయ్యాయని మంత్రి చెప్పారు. హెడ్ రెగ్యులేటర్‌లో 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామని, కేవలం 18 నెలల్లోనే టన్నెల్‌లో అత్యంత క్లిష్టమైన 3 కిలోమీటర్ల లైనింగ్ పనులను పూర్తి చేసినట్టు వివరించారు. ప్రస్తుతం నాలుగు గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల చొప్పున పనులు జరుగుతున్నాయని, లక్ష్యాన్ని చేరుకోవాలంటే గ్యాంట్రీల సంఖ్య పెంచాలని ఏజెన్సీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
ఫీడర్ కెనాల్‌కు సంబంధించి చేయాల్సిన 45 వేల క్యూబిక్ మీటర్ల హార్డ్ రాక్ పనుల్లో ఇప్పటికే 28 వేల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశామని చెప్పారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.456 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని, ఈ డిసెంబర్‌లోనే పనులు ప్రారంభించి సాగునీటి సీజన్‌కు ముందే పూర్తి చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. తీగలేరు కెనాల్‌కు సంబంధించిన 600 మీటర్ల టన్నెల్ లైనింగ్ పనులు చేసి గేట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
నల్లమల సాగర్ ముంపుతో ప్రభావితమైన ప్రాంతంలో 9.6 కిలోమీటర్ల శాశ్వత డైవర్షన్ రోడ్డు నిర్మాణం ప్రారంభించామని, మొంథా తుపాను వల్ల దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లను పూడ్చి, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పూర్తి చేసి లైనింగ్ పనులు కొనసాగిస్తున్నామని మంత్రి వివరించారు.
‘‘జగన్ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజున కూడా ఇంకా రూ.4 వేల కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తికాకుండానే పూర్తయినట్టుగా ప్రచారం చేసి, దగా–మోసాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు’’ అని నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, జగన్ విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ గాడిలో పెట్టారని మంత్రి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు.