బాబు వ్యూహం బెడిసిందా!?

కడప జిల్లాలో సమీకరణలు శరవేగంగా మారాయి. అభ్యర్థుల ఎంపిక టిడిపిలో చిచ్చు రేపింది. ఇది ఎంత మేరకు ఫ్యాన్ కు లాభిస్తుంది?

Update: 2024-04-19 08:44 GMT

(ఎస్. ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: ప్రతి సార్వత్రిక ఎన్నిక టిడిపికి ఓ ప్రయోగశాల. గత ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. తాజాగా కూడా.. ఆ ఆలోచన కడప జిల్లాలో రాజకీయాలను మలుపు తిప్పింది. అధికార వైఎస్ఆర్సిపికి ఆయాచితంగా అవకాశాన్ని అందించింది. టిడిపి తన అభ్యర్థులను ఎంపిక చేయడంలో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే ఓ మాజీ ఎమ్మెల్యే ఫ్యాన్ కిందికి వెళ్లారు. మరో ఇద్దరు అదే బాటలో ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో.. గట్టి పోటీ ఉంటుందని భావించిన అసెంబ్లీ స్థానాల్లో పట్టు కోల్పోయారనేది పరిశీలకుల అంచనా.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప గడ్డపై 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్‌సీపీకి పదికి పది సీట్లు కట్టబెట్టడం ద్వారా ఏకపక్షంగా నిలిచారు. 2024 ఎన్నికలకు కూడా కడప జిల్లాలో రాజంపేట అసెంబ్లీ స్థానం మినహా సిట్టింగులకే మళ్లీ అవకాశం కల్పించింది వైసీపీ. రాజంపేటలో టికెట్టు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి భీష్మించడంతో వైఎస్ఆర్ సీపీకి కాస్త చురుకు తగిలిందని వారి భావన.

 

ప్రయోగాలు బాబు సిద్ధాంతం

టిడిపి విషయానికి వస్తే, అభ్యర్థుల ఎంపికలో ప్రయోగం చేశారని చెప్పక తప్పదు. టిడిపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ చంద్రబాబు నాయుడు పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లరు. అనేది ఎంత వాస్తవమో. అభ్యర్థులను మార్చడం, ఇద్దరు, ముగ్గురిని సంసిద్ధం చేసి ఉంచడం ద్వారా పోటీ సృష్టించి, ఎదురుదెబ్బలు తింటుంటారనేది ఆ పార్టీ నాయకుల నుంచే వినిపించే ఆరోపణ. ఈ వ్యవహార శైలి వల్లే ప్రస్తుతం కడప జిల్లాలో రాయచోటి, రాజంపేట, బద్వేల్, కడప మైదుకూరు, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్‌సీపీకి గట్టి పోటీ ఇస్తారని భావించారు. కేవలం 48 గంటల్లో ఆ పరిస్థితి పూర్తిగా తిరగబడింది. అభ్యర్థిత్వంపై డైలమాలో పడిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం.

" 25 సంవత్సరాలుగా టిడిపిలోనే ఉన్నా. నేను పార్టీ మారలేదు. 2024 ఎన్నికలకు క్షేత్రస్థాయిలో అన్ని సిద్ధం చేసుకున్న" వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా నన్ను బలిపశువును చేశారు" అని రమేష్ రెడ్డి.. ఫెడరల్ ప్రతినిధితో వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురుని రెచ్చగొట్టడం. వారి మధ్య పోటీ సృష్టించి, నమ్ముకున్న వారిని కాకుండా డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘పార్టీ మారడానికి రాతకోతలు ఏమీ ఉండవు బ్రదర్. విలువ, గుర్తింపు లేని చోట ఉండడం వృధా. అందుకే వైఎస్ఆర్సిపిలో చేరా’’ అని రమేష్ రెడ్డి తన మనసులోని భావాలను పంచుకున్నారు.

పుట్టిముంచిన పొత్తులు..

సుమారు రెండు నెలలకు ముందే వైఎస్ఆర్సిపి అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి వదిలారు. ముందుగానే ఊహించినప్పటికీ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లిన టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్‌ను పొత్తుకు అయస్కాంతంలో ఆకర్షించింది. పార్టీలో చర్చించకుండానే, ధైర్యంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలు వద్ద మీడియా సమావేశంలో పొత్తు ప్రకటన చేశారు. ఆ తర్వాత టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి బిజెపితో పొత్తు కోసం సాగించిన వెంపర్లాట సగం కాలాన్ని హరించడంతోపాటు ఆ రెండు పార్టీల్లోని శ్రేణులను, ఆశావహులను మొదటే నిర్వేదానికి గురిచేసింది. అనుకున్నదంతా అయినట్లు సీట్ల సర్దుబాట్ల ద్వారా కొత్త సమస్యను కొని తెచ్చుకున్నారు. అనేది ఆ పార్టీ వ్యవహార సరళి అత్యంత సమీపంగా గమనించే వారితో పాటు టిడిపిలో కూడా వినిపించే స్వరం. రాష్ట్రంలోని మిగతా జిల్లాల పరిస్థితి పక్కకు ఉంచితే...

కడప జిల్లాలో..

బిజెపి- జనసేన -టిడిపి కూటమి అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పిదం చేశారనేది ఆ పార్టీ నాయకులు నుంచి వినిపించే మాట. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడం, మరో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బద్వేలి బిజెపికి ఇవ్వడం. అత్యంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాజంపేట పార్లమెంటు సీటును కూడా బిజెపికి వదిలివేయడం చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా ఎన్నికలను అత్యంత సామీప్యం నుంచి గమనిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఎం సుబ్బ నరసింహులు ఏమంటున్నారంటే..

"ఈ తరహా ప్రయోగాలు చారిత్రాత్మకమైన తప్పిదమే కాదు. చంద్రబాబుకు తప్పనిసరి అవసరం" అని అన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం అని చెబుతున్నా కేసులతో సతమతమవుతున్న చంద్రబాబు నాయుడు కేంద్ర అండదండల కోసమే బిజెపితో జత కలిశారని భావించవచ్చు" అని సుబ్బ నరసింహులు విశ్లేషించారు. జిల్లాలోని నియోజకవర్గాల పరిస్థితి పరిశీలిస్తే..

గట్టి పోటీ

ప్రొద్దుటూరు నియోజకవర్గం లో తన శిష్యుడైన వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై రాజకీయ కురువృద్ధుడు నంద్యాల వరదరాజులరెడ్డి (82) పోటీ చేస్తున్నారు. ఈయన 1985 నుంచి 2004 వరకు వరుసగా ఐదు సార్లు ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఈయన మల్లెల లింగారెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో టిడిపిలో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డికి సహకారం అందించలేదని ఆరోపణ. ఈసారి టికెట్ ఆశించి భంగపడిన మల్లెల లింగారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే గుండ్లూరు వీరేశ్ శివారెడ్డి అన్న కుమారుడు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరి సహకారం అందే పరిస్థితి లేదు. మల్లెల లింగారెడ్డి వైయస్సార్సీపీలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఇంటా బయట అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్ వరదరాజు రెడ్డి పై ఎలాంటి ఆరోపణలు లేవు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

పుట్టాకు.. డిఎల్ అండ

మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా శెట్టిపల్లి రఘురామిరెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. 1985లో ఆయన టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, వైఎస్ఆర్సిపి నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనపై మళ్ళీ టిడిపి అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

ఈయనకు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి అండగా నిలిచారు. "టిడిపి అంటే నాకు సరిపోదు. ఎమ్మెల్యే రఘురాం రెడ్డి రాజకీయాలకు పనికిరారు. మంచి వ్యక్తి కాబట్టి పుట్టా సుధాకర్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నా’’ అని డిఎల్ రవీందర్ రెడ్డి ప్రకటించారు. నేను ప్రచారానికి వెళ్ళను. నా అభిమాన శ్రేణులకు చెబుతా. పుట్ట సుధాకర్ యాదవ్‌కు అండగా ఉంటానని ప్రకటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కాకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కేడర్‌కు అందుబాటులో లేకపోవడం సమస్యలు పట్టించుకోరని అపవాదు కూడా ఎదుర్కొంటూ ఉండడం టిడిపి అభ్యర్థికి లాభించే అంశంగా భావిస్తున్నారు.

చేజారిన పట్టు

రాయచోటి అసెంబ్లీ స్థానంలో ముస్లిం మైనారిటీ, బలిజ సామాజిక వర్గం, బీసీ ఓటర్లు ఎక్కువ. అయినా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం పెత్తనం ఎక్కువగా ఉంటుంది. వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నారు. చివరి వరకు ఊరించిన అభ్యర్థిత్వం మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డికి దక్కలేదు. దీంతో ఆయన సైకిల్ దిగి వైఎస్ఆర్సిపిలో చేరారు. ముందుగానే మాట తీసుకొని టిడిపిలో చేరిన అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడు మద్దతు మాత్రమే లభిస్తుంది. గట్టి పోటీ ఉంటుందని భావించిన రాయచోటి సెగ్మెంట్లో రమేష్ రెడ్డి పక్కకు తప్పుకోవడం వల్ల వైఎస్ఆర్సిపికి వాతావరణం అనుకూలంగా మారినట్లు అంచనా వేస్తున్నారు.

 

రాజంపేటలో అనిశ్చితి

రాజంపేట అసెంబ్లీ స్థానంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయలు టిడిపి నుంచి మళ్లీ పోటీ చేయడానికి కార్యరంగం సిద్ధం చేసుకున్నారు. ముందుగా కార్యాచరణ సిద్ధం చేసిన ప్రకారం రాయచోటి చెందిన సీనియర్ నాయకుడు పాలకొండ రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యంకు ఎంపీ సీటు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఆయనను అసెంబ్లీ స్థానానికి పరిమితం చేశారు. రాజంపేట ఎంపీ స్థానం సీట్ల సర్దుబాటులో భాగంగా బిజెపికి కేటాయించడంతో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీటు దక్కని బత్యాల చెంగల్ రాయులు ఆగ్రహించారు. ఆయన వర్గం రోడ్డుపైకి వచ్చింది. బత్యాలకు రాజంపేట సీట్ దక్కి ఉంటే.. ఆయన సొంత నియోజకవర్గం రైల్వే కోడూరు లో జనసేన అభ్యర్థికి మేలు జరిగేది. టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల రెండు స్థానాల్లో టిడిపికి తలపోటు తప్పలేదు. కానీ కాస్త ఉపశమనం..

రాజంపేట వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి స్థానంలో జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఇదే అదునుగా మేడా వర్గం టిడిపిలో చేరింది. ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి కూడా ప్రచారానికి రానని భీష్మించారు. ఈ ఎపిసోడ్ టిడిపికి ఉపశమనం కాగలదని భావిస్తున్నారు.

 

కోడూరు, బద్వేలు.. బలిపీఠం

కడప జిల్లాలో మొదటి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం రైల్వేకోడూరు. 2004 ఎన్నికల వరకు టిడిపి ఆధిపత్యం కొనసాగింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమేయంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ పట్టు సాధించింది. ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నుంచి కొరముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి పొత్తులు సీట్ల సర్దుబాటుతో ఏమాత్రం పట్టు లేని జనసేనకు ఈ సీటు కేటాయించారు. బీటెక్ చదివిన సర్పంచ్ అరవ శ్రీధర్ ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు ఆ తర్వాత ముస్లింలు బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. టిడిపిలో కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం ఉంటుంది. వీరికి మిగతా వర్గాలు ఎంత మాత్రం సహకరిస్తాయి అనేది పక్కకు ఉంచితే.. వైయస్సార్సీపి అభ్యర్థికి మేలు జరిగే వాతావరణం ఉందని భావిస్తున్నారు.

కడప జిల్లాలో మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో కూడా టిడిపి ప్రయోగం చేసింది. టిడిపికి అత్యంత బలమైన క్యాడర్ నాయకత్వం ఉన్న ఈ స్థానాన్ని బిజెపికి వదిలేశారు. వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మళ్లీ పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి పోటీ చేయాలని తెలుగు గంగ ప్రాజెక్టులో డీఈగా పనిచేస్తున్న రోశయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. ఆయనకే బిజెపి కండువా కప్పి ఆ పార్టీ నుంచి పోటీ చేయిస్తున్నారు. ఇక్కడ పేరుకు అభ్యర్థులు ఉన్నప్పటికీ టిడిపి మాజీ ఎమ్మెల్యే బిజి వేముల విజయమ్మ, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి రాజకీయ వ్యవహారాలు చక్కదిద్దుతారు. టిడిపి స్వయంకృతం వల్ల ఈ సీటు వైఎస్ఆర్సిపికి అనుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.

కమలాపురంలో కలహం..

కమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జి వీర శివారెడ్డి, మూడు సార్లు ఓటమి చెందిన పొత్త నరసింహారెడ్డి సీటు ఆశించారు. తనకు కాకున్నా తన కుమారుడికి టికెట్ వస్తుందని వీరశివారెడ్డి భావించారు. వీటన్నిటినీ పక్కకు ఉంచిన టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు పొత్త నరసింహారెడ్డి కుమారుడు పొత్త చైతన్య రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే జి వీర శివారెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

" డబ్బుకు టికెట్లు అమ్ముకుంటున్నారు. సీనియర్టికీ ప్రాధాన్యత లేదు. ఓడిన వారి కుటుంబాలకు టికెట్ ఇస్తున్నారు" అని వీరశివారెడ్డి తీవ్రస్థాయిలో మాటలతోటాల అందించారు. అందుకే వైఎస్ఆర్సిపిలోకి వెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ చర్య సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డికి పూర్తిగా కలిసి రాగలరని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఈయనకు వీరే శివారెడ్డి అండగా నిలిచారు. వీర శివారెడ్డి వల్ల కమలాపురం, పొద్దుటూరు, కడపలో కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

 

కడపలో తలనొప్పులు..

కడప శాసనసభ స్థానం నుంచి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి సతీమణి ఆర్. మాధవి రెడ్డి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఈమెకు ఇంటి పోరు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కడప శాసనసభ స్థానంలో కీలకమైన జడ్పీ మాజీ చైర్మన్ లక్ష్మీరెడ్డి, సీనియర్ నాయకుడు అమీర్ బాబు అంటీముట్టనట్లు ఉంటున్నట్లు సమాచారం. టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు కొంతమేరకు నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా, ఇటీవల కొందరు సీనియర్ మహిళా నాయకురాళ్లను సస్పెండ్ చేస్తూ మాధవి రెడ్డి ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. ఈమెకు ప్రధానంగా డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ బాషాపై ఉన్న అసంతృప్తి, ఇతరత్రా వ్యవహారాలు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

నాయకులు కొరత

జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప జిల్లాలో అత్యంత సున్నితమైనదిగా చెప్పవచ్చు. మొదటి నుంచి టిడిపిలో కొనసాగి ఆస్తి, ప్రాణ, నష్టాలు చవిచూసిన మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గతంలోనే వైయస్ఆర్సీపీలో చేరడం టిడిపికి పెద్ద దెబ్బ. వైయస్సార్సీపీలో గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరి, మళ్లీ బీజేపీలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మినహా అక్కడ నుంచి పోటీ చేసే వారు లేకుండా పోయారు. దీంతో ఈ సీటును కూడా కూటమి పార్టీలో బిజెపికి కేటాయించారు. ఈయన వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మోలే సుధాకర్ రెడ్డి‌తో తలపడుతున్నారు. ఇక్కడ పోటీ నామమాత్రం అనేది పరిశీలకుల అంచనా.

హాట్.. హాట్..

ఇక కడప పార్లమెంటు స్థానం రాష్ట్రస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నారు. టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ చదివిరాల ఆదినారాయణ రెడ్డి కుమారుడు చదివిరాల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాజకీయంగా పోటీ చేసిన అనుభవం లేని భూపేశ్వరుడిగా టికెట్ ఇవ్వడం ఏంటి అనేది కూడా మాజీ ఎమ్మెల్యే జి. వీర శివారెడ్డి లేవనెత్తిన అంశం.

రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బిజెపి జాతీయ కార్యదర్శి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అది కూడా తనకు రాజకీయంగా చిరకాల ప్రత్యర్థి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో తలపడనున్నారు. ఈ ఎన్నికల్లో "మూడోసారి విజయం సాధించి, మా నాన్నకు బహుమతిగా ఇస్తా" అని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు.

ఈ తరహాలో కడప జిల్లాలో ఈ పరిస్థితులు రోజుల వ్యవధిలో నాటకీయంగా మారిపోయాయి. టికెట్టు ఆశించి భంగపడిన టిడిపి మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలోకి చేరడం వల్ల ఆ పార్టీ పట్టు సడలిందని భావిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే. 2019 నాటి ఫలితాలు ప్రతిఫలిస్తాయా? రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వ్యవహారంతో ఎదురైన అనుభవాలను సీరియస్‌గా తీసుకునే ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News