ఆ రెండు చోట్ల అభ్యర్థులను మారుస్తారా...?
రెండు చోట్ల అభ్యర్థులను మార్చండి... కూటమికి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేడుకోలు.... ఎవరా అభ్యర్థులు...?
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా ఎంపీ స్థానం పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తథ్యమనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త అనకాపల్లి రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అనకాపల్లి ఎంపీ నియోజవర్గ పరిధిలో ఉన్న యలమంచిలి, మాడుగుల స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చనున్నట్టుగా ముమ్మర ప్రచారం సాగుతోంది. ఈ మేరకు అధిష్టానం రంగంలోకి దిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మాడుగుల అభ్యర్థిని మారుస్తారా..?
మాడుగుల స్థానాన్ని టీడీపీ నుంచి పైలా ప్రసాద్‌కు కేటాయించారు. అయితే తొలి నుంచీ పైలా ప్రసాద్ అభ్యర్థిత్వంపై స్థానికంగా వ్యతిరేకత వస్తూనే ఉంది. దీంతో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం తొలిరోజు నుంచీ మొదలైంది. తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని టీడీపీ అధిష్టానానికి చేరవేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాడుగుల స్థానాన్ని బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించాలని కూడా సీఎం రమేష్ సూచించినట్టుగా తెలిసింది. ఈ మేరకు బండారు సత్యనారాయణమూర్తికి ఇప్పటికే అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు భోగట్టా. మాడుగుల స్థానాన్ని బండారు సత్యనారాయణమూర్తికి కేటాయిస్తే అటు ఎంపీ, ఇటు అసెంబ్లీ స్థానాలకు ప్రయోజనం ఉంటుందని సీఎం రమేష్ యోచిస్తున్నారని సమాచారం. అలాగే ఇప్పటికే అలక మీద ఉన్న బండారు సత్యనారాయణమూర్తికి న్యాయం చేసినట్టు అవుతుందని భావిస్తున్నారట. ఆ రకంగా అటు బండారుకు, తద్వారా సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చినట్లు అవుతుందని అధిష్టానం కూడా దీనిపై ఫోకస్ పెట్టిందని విశ్వసనీయ సమాచారం.
ఎలమంచిలిలో ఇదే సీను...
యలమంచిలి నుంచి జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్‌కుమార్ బరిలో ఉన్నారు. కానీ విజయ్‌కుమార్ ఈ స్థానంలో గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నారని సీఎం రమేష్ సొంత సర్వేలో తేలిందని, ఫలితంగా వ్యక్తిగతంగా తనకు కూడా నష్టం కలుగుతుందని బీజేపీ అధిష్టానానికి చంద్రబాబుకు చెప్పినట్టుగా సమాచారం. దీంతో యలమంచిలి సీటు విషయంలో పరిశీలించి తదుపరి నిర్ణయం నిమిత్తం ఏం చేయాలో తేల్చాలని జనసేన నేత కొణతాల రామకృష్ణ, టీడీపీ నేత పీలా గోవింద్ సత్యనారాయణలకు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలిసింది. రెండు రోజుల్లోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టుగా తెలిసింది. మరోవైపు ఎలమంచిలి సీట్ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేయడానికి భావిస్తున్నట్లు ప్రచారం... కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యలమంచిలి స్థానాన్ని మార్పు చేయడం కచ్చితంగా జరుగుతుందని తెలిసింది. సీఎం రమేష్ ఒత్తిడి మేరకు హుటాహుటిన టీడీపీ, బిజెపి , జనసేన అధిష్టానం ఈ రెండు సీట్లపై దృష్టి సారించిందనే ప్రచారం సాగుతోంది. వీటిపై ఒకటి, రెండు రోజుల్లోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.