విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో పదులసంఖ్యలో స్థానికులు అస్వస్థతకు గురికావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.ఏకంగా 41 మంది వరకూ వాంతులు,విరోచనాలు ,ఇతర సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్య క్యాంపు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఇంత మంది ఒకేసారి అస్వస్థతకు ఎలా గురైయ్యారన్న దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. తమ ప్రాంతానికి సరఫరా అయ్యే మంచినీరు కలుషితమవ్వడం వల్లే డయేరియా ప్రభలు తోందని స్థానికవాసులు అంటుండగా , ఇది డయేరియా కాదని ,ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ మీడియాకు తెలిపారు.వాటర్ ట్యాంకు సమీపంలో వినాయక నిమజ్జన భోజనాలు ఏర్పాటు చేశారని ,అక్కడి ఆహారం కలుషితమై వుండవచ్చని ,కొందరు తమ దృష్టికి తెచ్చారన్నారు.బాధితులు ఎవరికీ ప్రాణాపాయం లేదని , మెరుగైన చికిత్స అందుతోందని వెల్లడించారు.
బాధితులకు మంత్రి పరామర్శ
విజయవాడలోని ఓ ప్రాంతంలో డయేరియా ప్రభలిందన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.నగరపాలక సంస్థ ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని మంత్రి నారాయణ ,సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి సందర్శించారు.బాధితులతో నేరుగా మాట్లాడిన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అధికారులతోనూ మంత్రి సమీక్షించారు. నీటి సరఫరా విషయంలో జాగ్రత్తలు పాటించాలని , బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.నీటి పరీక్షలతో పాటు ఇంకెవరికైనా అస్వస్థతగా వుంటే వారిని గుర్తించి వైద్యం అందించాలని , ఇంటింటికి వెళ్లి పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.
అధికారుల భిన్న ప్రకటనలు
న్యూ రాజరాజేశ్వరి పేటలో అస్వస్థులైన వారికి డయేరియా లక్షణాలు వున్నాయని వైద్య అధికారులు ప్రకటించగా, డయేరియా కాదని ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్ఠర్ తెలిపారు. ఆ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందడం కూడా గందరగోళానికి దారితీసింది. వారు ఇద్దరు డయేరియా వల్ల చనిపోయారని ,స్థానిక ప్రజలు అంటుంటే , ఆ ఇద్దరివి సహజ మరణాలని అధికారులు ప్రకటించారు.
నీటి పరీక్షలు
ఆ ప్రాంతానికి సరఫరా అవుతున్న నీటిని వెంటనే ఆపుచేసిన మున్సిపల్ అధికారులు , ఇంటింటికీ వెళ్లి నీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే నీరు కలుషితం కాలేదని ప్రాధమికంగా తేల్చారు. అయితే ఇంతమంది ఒకేసారి అనారోగ్యానికి గురికావడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా బాధితులకు తక్షణం మెరుగైన వైద్యసేవలు అందించాలని వైధ్య అధికారులను ఆదేశించారు.