దేవి నవరాత్రులు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా కొలువైన అమ్మవారు

దేవి నవరాత్రుల మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తోంది.

Update: 2024-10-06 04:16 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేలాది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిచే అమ్మవారు నాలుగో రోజైన ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు.

త్రిపురాత్రయంలో ఈమె రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర రూపంలో సకల లోకాతీత కోమలత్వంతో దుర్గమ్మ తల్లి ప్రకాశిస్తున్నారు. సకల సృష్టి, స్థితి సంహార కారిణి. శ్రీ విద్యా స్వరూపిణి. ఉపాసకులకు ఆరాధ్య దేవత అమ్మవారు ప్రసిద్ధి. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీ దేవి, వింజామరలు వీస్తుండగా చెరకు గడ, విల్లు, పాశాంకు శాలు ధరించి దివ్వరూపంతో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మంచి మనసుతో దుర్గమ్మను ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. దారిద్య్రయం, దుఃఖం వంటి వినాశనాల నుంచి అమ్మవారు కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు. దుర్గమ్మ తల్లికి కుంకుమ అర్చన ఎంతో ప్రీతి. తనను కొలిచే ముల్తైదువులకు మాంగల్య బలాన్ని వరంగా అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించి శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. పులిహోరాతో అమ్మవారికి నివేదన చేయాలి. భక్తులకు సకల ఉపచారాలతో అర్చించి భోజనం పెట్టాలి.
నాలుగో రోజు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేస్తారు. అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పిస్తారు. ఈ వస్త్రంలో అమ్మవారిని అలంకరిస్తారు. కదంబం ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెడుతారు. అమ్మవారిని కూష్మాండ దేవిగా పూజించాలనే నియమం ఉంది. అందువల్ల అమ్మవారికి ఆ విధమైన పూజలు చేస్తారు. పసుపు బంతి పువ్వులు అంటే అమ్మవారికి బహు ప్రీతి. అందువల్ల అమ్మవారికి బంతి పువ్వులను సమర్పిస్తారు.
అమ్మవారిని త్రిపుర సుందరీ నామంతో కూడా పిలుస్తారు. పంచదశాక్షరి మహామంత్రానికి ఆదిదేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితాంబ త్రిపుర సుందరీ దేవి అవతారంలో ఉండే దుర్గమ్మ అమ్మవారు తన భక్తులను ఆశీర్వదిస్తారు. బంగారు రంగు చామంతులతో అమ్మవారిని పూజిస్తారు. కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదంను సమర్పిస్తారు. లలితా సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తారు. స్వర్ణకిరీటం, కంఠాభరణాలు, స్వర్ణాభరణాలు, అభయ హస్తాలతో అలంకరిస్తారు.
మూడో రోజైన శనివారం అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. శనివారం దాదాపు 80వేలు పైచిలుకు భక్తులు తరలి వచ్చారు. గత మూడు రోజుల్లో 2లక్షల మందికిపైగా భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి భక్తులు భారీగానే కానుకలను సమర్పిస్తున్నారు ఏటా రూ. 15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ సారి అంతకంటే అధికంగా రాచ్చని అంచనా వేస్తున్నారు. అదనంగా ఆభరణాలను భక్తులు సమర్పిస్తున్నారు. తొలి రోజు రూ. 2.50 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని ఒక భక్తుడు అమ్మవారికి సమర్పించారు. రూ. 18లక్షల విలువైన బంగారు మంగళ సూత్రాలను, ఆరు కిలోల భారీ వెండి హంస పీఠాన్ని మరో భక్తుడు సమర్పించారు. నాలుగో రోజు ఆదివారం కావడంతో భారీగానే భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే నదీ హారతి, నగరోత్సవం కనుల పండువలా సాగనున్నాయి.
Tags:    

Similar News