దేవాంశ్ ఐదు రోజుల్లో ఐదు పుస్తకాలు చదివేశాడు–అసెంబ్లీలో లోకేష్ ..
24 నెలలో ఏపీలో వరల్డ్ క్లాస్ లైబ్రరీని డెవలప్ చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
తన కుమారుడు, సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశ్‌కు పుస్తకాలు చదవే అలవాటు ఎద్ద ఎత్తున్న ఉందని, ఇటీవల లండన్ వెళ్లినప్పుడు దేవాంశ్‌కు ఐదు పుస్తకాలు కొనిస్తే.. ఐదు రోజుల్లో ఐదు పుస్తకాలు చదివేశాడని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో విశాఖపట్నం పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్యే గణబాబు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ప్రస్తావించిన గ్రంధాలయాల ఏర్పాటు అంశంపై ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్ మాట్లాడుతూ తన కుమారుడు దేవాంశ్ గురించి ప్రస్తావించారు. చిన్నప్పుడు తనకు గ్రంధాలయాలకు వెళ్లే అలవాటు పెద్దగా లేదని, కానీ తన కుమారుడు దేవాంశ్‌కు మాత్రం పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉందని, దీనిని తన సతీమణి బ్రాహ్మణి దేవాంశ్‌కు అలవాటు చేసిందని చెప్పొకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం అనేది చాలా మంచి అలవాటని, క్రియేటివ్ థింకింగ్ బాగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఏపీలో వరల్డ్ క్లాస్ లైబ్రరీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. షోబాడెవలపర్స్ అనే సంస్థ వాళ్లు ఏపీలో రూ. 100 కోట్లతో గ్రంధాలయాలను డెవలప్ చేయడానికి ముందుకొచ్చినట్లు చెప్పారు. 24 నెలల్లో ప్రపంచ స్థాయి గ్రంధాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రంధాలయాల్లో పుస్తకాల కొనుగోలు కూడా సరిగా జరగడం లేదన్నారు. అవసరమైన పుస్తకాల జాబితాను ఇస్తే ఆ మేరకు పుస్తకాలను కొనుగోలు చేసి వాటిని గ్రంధాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ను యూనివర్శిటీ స్థాయిల నుంచి పంచాయతీల స్థాయి వరకు తీసుకెళ్తామన్నారు.
13 జిల్లా గ్రంధాలయాలు ఉన్నాయని, 26 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. సెస్ అనేది గ్రంధాలయాల ఖాతాల్లో జమయ్యే విధంగా చూస్తామన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ఇది వరకే ఏర్పాటు చేశామన్నారు. విశాఖలో మోడల్ గ్రంధాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పుస్తకాలతో పాటుగా కమ్యూనిటీ యాక్టివిటీస్ చేసుకునేందుకు వీలుగా విశాఖ లైబ్రరీని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రంధాలయాలు అనేది తనకు చాలా ఇష్టమైన అంశమని, మంగళగిరిలో త్వరలోనే గ్రంధాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనిపైన ఫీడ్ బ్యాక్ తీసుకొని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 175 మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రంధాలయాల్లోకి పిల్లలను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన యాక్టివిటీస్ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. మొబైల్స్‌కి పిల్లలను దూరంగా ఉంచుతూ.. లైబ్రరీలకు దగ్గర చేయాలని, ఆ మేరకు ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటుందన్నారు.