సీమలో 'నామినేటెడ్' లడాయి.. జనసేన v/s టీడీపీ
ప్రధాన మార్కెట్ కమిటీల నియామకంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కూటమిలో సయోధ్య కుదరడం లేదు. జనసేన కూడా ఏమని పట్టుబడుతోంది?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-04-01 11:31 GMT
టీడీపీ కూటమిలో కుదరని సయోధ్య వల్ల ప్రధాన మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకంలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు కనిస్తున్నది. కూటమిలోని జనసేన నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉండడం, టీడీపీలో పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కేసులకు వెరవకుండా పోరాడి, నిలిబడిన నేతలను ఎంపిక చేయడంలో సీఎం ఎన్. చంద్రబాబు కసరత్తు కొలిక్కి రానట్లు తెలుస్తున్నది.
రాయలసీమల్లో చిత్తూరు జిల్లా మదనపల్లె, తిరుపతి, కర్నూలు జిల్లాలో డోన్, నెల్లూరు జిల్లాలో కూడా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా నేతల పేర్లతో సిఫారసు లేఖలు అందించారు. అయితే, టీడీపీలోని వర్గపోరు నేపథ్యంలో కమిటీ చైర్మన్లను ఎంపిక చేయడంలో జాప్యానికి కారణంగా తెలుస్తున్నది.
రాష్ట్రంలో ఉగాది నాటికి మూడో విడతగా వ్యవసాయ మార్కెట్ కమిటీల ( Agricultural Market Committees AMC ) చైర్మన్లు నియమించింది. 37 టీడీపీ, ఎనిమిది జనసేన, రెండు బీజేపీ నేతలకు దక్కాయి. వారిలో రాయలసీమలోని ధర్మవరంలో బిజెపికి మినహా జనసేన పార్టీకి ఒక్క పదవీ దక్కలేదు.
రాష్ట్రంలో ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రూ. వందల కోట్ల వ్యాపారం సాగించే టమాట (Tomato), మామిడికాయలు (Mangoes) విక్రయించే మార్కెట్లకు మాత్రం కమిటీలు నియమించడంలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు కనిపిస్తోంది. టీడీపీలోని వర్గాలు ఒకపక్క జనసేన పార్టీ నుంచి కూడా ఆశావహులు కూడా రేసులో ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.
పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎంపిక ప్రక్రియలో జాప్యానికి కారణంగా కనిపిస్తోంది. అంతేకాకుండా, ప్రతిపక్షంలో ఉన్న కాలంలో వైసీపీ నుంచి కేసులు ఎదుర్కొన్న నేతలు, ఆర్థికంగా నష్టపోయినా, పార్టీని వీడని నేతలను ఎంపిక చేయడంలో సీఎం ఎన్. చంద్రబాబు ఐవీఆర్ ఎస్ (IVRS) ద్వారా అభిప్రాయ సేకరణకు కూడా రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది.
ఇక్కడ ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన తన పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలో ప్రధాన నేతలతో ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో నామినేటెడ్ పదవులపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పోటీ ఎక్కువగా ఉంది. పదవులు చాలా మంది ఆశిస్తున్నారు. కానీ, టీడీపీ నేతల పరిస్థితి ఏమిటని సీఎం చంద్రబాబు అడిగితే, మన వద్ద సమాధానం ఉండదు" అని అన్నారు. అంతేకాకుండా, మీరందరూ నా గుండెల్లో ఉన్నారు. పదవుల కోసం ఓ విధానం అమలు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. పార్టీ నియమించే కమిటీ చైర్మన్ పోస్టుల, ఇతర నామినెటెడ్ పదవులకు ఎంపిక చేస్తుంది" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం గమనించతగిన విషయం.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల తరువాత పరిస్థితి మారింది. ఎన్నికల్లో తక్కువ అసెంబ్లీ స్థానాలు తీసుకుని తప్పు చేశాం. అనే భావనలోకి రావడమే కాదు. కడప జిల్లాలో జనసేన నేతలు ఇదే వ్యాఖ్యానాలు చేశారు. కనీసం ఇకపై నామినెటెడ్ పోస్టుల్లో ఎక్కువ తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనికి తోడు టీడీపీలో వర్గపోరు కూడా కూటమి ప్రధానంగా టీడీపీలో ఇంటిపోరు ఎక్కువైంది. అందుకు నిదర్శనం..
రూ. వంద కోట్ల వ్యాపారం
చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ (టమాట మార్కెట్)లో ఏటా రూ. వంద కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. దేశంలో ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక్కడి కమిటీ నియామకంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఒకపక్క. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఇంకోపక్క. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, జనసేన రాయలసీమ సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి మరోవర్గం నేతలుగా మారారు.
టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే షేక్. షాజహాన్ బాషా 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న రెండువర్గాల నేతలే ప్రత్యర్థులుగా మారారు.
మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే జహా ఈ ఏడాది జనవరిలోనే కొన్ని పేర్లు సిఫారసు చేశారు. దీనికి తెలుగు యువత నేత అడ్డుచెబుతున్నారు.
"ఆ సిఫారసు లేఖలు మంత్రి లోకేష్ బుట్టదాఖలు చేశారు" అని తెలుగు యువత శ్రీరాం చినబాబు బహిరంగ వ్యాఖ్యలు చేయడం ద్వారా టీడీపీలోని వర్గపోరును బట్టబయలు చేశారు. ఈ వ్యవహారం పక్కన ఉంచితే, పదవుల పందేరంలో ఎవరి పట్టు వారు సాధించేందుకు సాగిస్తున్న యత్నాలతో ఈ పదవి అంతత్వరగా భర్తీ అయ్యే అవకాశం ఉంటుందా? అని కూడా మాట్లాడుకుంటున్నారు.
ఆ రోజులు వేరు...
మదనపల్లెలో 1999 ఎన్నికల వరకు టీడీపీ పరిస్థితి ఓ రకంగా ఉండేది. ఇక్కడి నుంచి రాటకొండ సాగర రెడ్డి, ఆయన మరదలు రాటకొండ శోభ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. పార్టీలో కూడా సెంట్రలైజ్డ్ నాయకల్వం ఉండేది. మాజీ ఎమ్మెల్యే శోభ అధికారంలో ఉండగా (1999-2004) ముందస్తు ఎన్నికలు జరిగే వరకు మదనపల్లె మార్కెట్ కమిటీ నియామకం జరగలేదు. అధికారం కోల్పోవడానికి సుమారు ఎనిమిది నెలలకు ముందు పులి మోహన అనే నేతను నియమిస్తూ, జీవో తీసుకుని వచ్చారు. అందులో కమిటీ సభ్యులు లేకపోవడం వల్ల, ఆ ఉత్తర్వు అమలు కాకపోవడం, చివరికి టీడీపీ అధికారం కోల్పోయింది. ఇక్కడి నేతల పనితీరుకు, ఊరించి, ఉడికిస్తారనేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే.
తమ్ముళ్ల తన్నులాట వల్లే...
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లె ఏఎంసీ (AMC) పదువులు కూడా భర్తీ చేయకపోవడం వెనుక కూడా టీడీపీలోని వర్గపోరే కారణంగా మారింది. ఇందులో పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన తమ్ముడు పెద్దరెడ్డి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాటిలో
పుంగనూరులో టీడీపీ క్యాడర్ కు కొదవలేదు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన చల్లా బాబు ఈ ప్రాంత నేతలో టచ్ లో లేరనేది ప్రధాన విషయం. దీనికి తోడు ఇక్కడ టీడీపీ క్యాడర్ తో పాటు జనసేన కూడా పోటీగా మారింది. దీంతో ఇక్కడ ఏఎంసీ పోస్టు భర్తీ కాలేదు.
తంబళ్లపల్లెలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగని సందర్భం లేదు. మాజీ ఎమ్మెల్యే జీ. శంకరయాదవ్, టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఓటమి చెందిన దాసార్లపల్లె జయచంద్రారెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధంలో పార్టీ సీనియర్లకు పదవులు దక్కడం కూడా శాపంగా మారింది.
మ్యాంగోనగర్ హ్యాపీ
మదనపల్లె టమాట మార్కెట్ తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన పీలేరు,గుర్రంకొండ, వాల్మీకిపురం, చింతపర్తి టమాట మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయించడంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమర్థత చాటుకున్నారు. ఇక్కడ ఎలాంటి వివాదం లేకుండా పోయింది.
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు మామిడి మార్కెట్ రాష్ర్టంలోనే రెండవ అతిపెద్ద ప్రధాన మార్కెట్. దీనికి మ్యాంగోనగర్ గా కూడా పేరు. ఇక్కడి 70 మండీల ద్వారా దేశ, విదేశాలకు ఏటా కనీసంగా అంటే వంద కోట్లకు పైగానే వ్యాపారం సాగుతుంది. ఈ పదవి భర్తీ చేయించడంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని శ్రద్ధ తీసుకున్నారు. కారణం, వర్గపోరు లేకపోవడమే అనేది ఇక్కడి పార్టీ శ్రేణుల్లో వినిపించే మాట.
మల్లగుల్లాలు
ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వేకోడూరు ఏఎంసీ పదవి భర్తీ జరగలేదు. ఇక్కడి నుంచి తొలిసారి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గాడ్ ఫాదర్ ముక్కా రూపానందరెడ్డి. ఈయన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ ఒకే వ్యక్తి చేతిలో ఏకీకృతమైంది. ఇక్కడ నామినేటెడ్ పదవులు జనసేనకు ఇవ్వాలా? టీడీపీ నేతలకు దక్కాలా? అనే విషయంలో సమన్వయం కుదరలేదు
రాజంపేట నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి గెలిచారు. అయితే, టీడీపీలో ఓటమి చెందిన సుగవాసి బాలసుబ్రమణ్యం, టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహనరాజు మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు కారణంగానే పదవికి ఎంపిక చేయడంలో జాప్యం జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
వాటితో పాటు కర్నలూ జిల్లా డోన్ టమాట మార్కెట్ కూడా అత్యంత ప్రధానమైనది. రోజూ ఇక్కడ రూ. లక్షల్లో వ్యాపారం సాగుతోంది. కానీ, టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష రెడ్డి, బీసీ సామాజిక వర్గ నేతల మధ్య కుదరని సయోధ్య వల్లే పదువుల పందేరం కోసం రెండు పక్షాల్లోని నేతలు నిరీక్షిస్తున్నారు.
జనసేన నేతల మాటేంటి?
రాయలసీమలో ప్రధానంగా తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి సెగ్మెంట్లలో బలిజ (కాపు) సామాజికవర్గానికి గెలుపు ఓటములు నిర్ణయించే శక్తివంతంగా ఉన్నారు. అదేవిధంగా కడప జిల్లా రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో వారిది బలమైన సామాజికవర్గం. వారిలో మెజారిటీ ఓటర్లు జనసేన పక్షాన నిలిచారు. కూటమి అభ్యర్థుల విజయంలో మమేకం అయ్యారు. అయితే ఇప్పటి వరకు కాపు సామాజికవర్గానికి పదవుల్లో ప్రాధాన్యత దక్కలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్లలో జనసేనకు రాయలసీమలో ప్రాధాన్యత లేదు. ఈ పరిస్థితుల్లో పెండింగ్ పదవుల్లో తమకు కేటాయించాలనేది జనసేన నేతల డిమాండ్ గా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో సమర్థులను ఎంపిక చేయడానికి సీఎం చంద్రబాబు ఐవీఆర్ఎస్ విధానంలో అభిప్రాయ సేకరణ సాగిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్ ఫోన్ల ద్వారా కాల్ చేయించి, ఏ నాయకుడికి పదవి ఇస్తే న్యాయం జరుగుతుంది. ఎవరు సమర్థులు అనే విషయంలో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ పరిణామాలు ఎలా ఉంటాయనేది పూర్తిగా నియమకాలు జరిగిన తరువాత వెల్లడయ్యే అవకావం ఉందని భావిస్తున్నారు.