’మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్‘
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన “అమరజీవి జలధార” కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.
వైఎస్సార్సీపీ మీద, ఆ పార్టీ నాయకుల , శ్రేణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన “అమరజీవి జలధార” కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం అని కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నాం... మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన నక్సలిజమే కకావికలం అయిపోయింది. ఇలా బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని హెచ్చరించారు.
అమరజీవి జలధార” ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అని పవన్ కల్యాణ్ తెలిపారు.