'రఘురామ ఓ 420, చీటర్, ఆయన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర పరువు పోతుంది?'
ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు
By : The Federal
Update: 2025-12-20 10:42 GMT
ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఆయన శనివారం ఓ ట్వీట్ చేశారు. రఘురామకృష్ణరాజును ఆ పదవి నుంచి తొలగించాలని పరోక్షంగా కూటమి ప్రభుత్వాన్ని కోరారు. రఘురామ అరెస్ట్ అయితే కూటమి ప్రభుత్వం పరువు పోతుందని ఆయన ఎక్స్ లో స్పష్టం చేశారు. రఘురామ కృష్ణరాజుపై ఆయన ఏమన్నారంటే...
420 రఘురామకృష్ణ రాజు అరెస్ట్ కాబోతున్న CBI పెట్టిన చీటింగ్ కేసు FIR ఇది (13 పేజీల ఎఫ్ఐఆర్ ప్రతిని ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు). ₹ 945 కోట్లు కాజేసిన గజదొంగ రఘురామకృష్ణ. ఆయన రాజు. ఆయనపై సిబిఐ కేసు ఇది. RRRకుటుంబ సభ్యుల పేర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. సుప్రీం కోర్టు RRR ని, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యుటీ స్పీకర్ హోదా లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే ఆది ఆయనకి కాదు రాష్ట్రం మొత్తానికి తల వంపులు తెస్తుంది. అమరావతి బ్రాండ్ దెబ్బ తింటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి పోతారు.
ఆయన అరెస్ట్ అయితే ఇలాంటి గజదొంగ ను , చీటర్ ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా?
ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి డైనమిక్ లీడర్ నారా లోకేష్ ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కి పోవా?
ఈ కేసు దర్యాప్తు ముగిసి, కోర్టులో విచారణ పూర్తి అయితే రఘురామకృష్ణ రాజుకి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవి అయినా ఇవ్వండి. అభ్యంతరం లేదు.
ఉప సభాపతి హోదా లో రఘురామ కృష్ణ రాజు గారు అరెస్ట్ అయితే అది రాష్ట్రానికే అవమానం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయన అరెస్ట్ అయితే ఆయన వరకే ఆది పరిమితం అవుతుంది
మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా …. మీరు ప్రజల పక్షాన ఉండాలి. ఒక వ్యక్తి వైపు కాదు . ఇందులో నాకు వ్యక్తిగతం గా ఏమీ కోపం లేదు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట పౌరుడిగా నా బాధ్యత
420 రఘురామ కృష్ణ రాజు మీద ఇంకా అనేక అభియోగాలు ఉన్నాయి. ఆ రిపోర్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటిల్లో కూడా కొత్త కేసులు నమోదు అవుతాయి. అందుకోసం నేను సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ లు వేస్తాను .
ఈ కేసులో 420 రఘురామకృష్ణ రాజు గారు బయటపడటం జరగదు
అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. పైగా దర్యాప్తు చేస్తున్నది CBI.
ఒక 420 కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ఇమేజ్ ను ఫణం గా పెట్టవద్దు
నేను చెప్పిన విషయాలు అసత్యం అయితే నా మీద చర్య తీసుకోండి. నేను సిద్ధం. నిజం కాబట్టి తక్షణం 420రఘురామకృష్ణ రాజును అన్ని పదవుల నుండి తొలగించాలి.
అమరావతి బ్రాండ్ ఇమేజ్ కోసం అమరావతి రైతులు 420 రఘురామకృష్ణ రాజుని అన్ని పదవుల నుండి తొలగించేలా ఉద్యమం చేయాలి
జై అమరావతి… జై స్వర్ణాంధ్రప్రదేశ్… జై భీమ్
అంటూ సునీల్ కుమార్ ముగించారు. పూర్తి వివరాలను తన సోషల్ మీడియాలో ఉంచానని తెలిపారు.
ఆయన పెట్టిన ఈ పోస్టులో కాస్తంత వెటకారం ధ్వనించేలా ఉన్నా అవన్నీ వాస్తవాలేనని దళిత సంఘాలు కూడా సునీల్ కుమార్ ను సమర్ధించడం కొసమెరుపు.
3 రోజుల కిందట కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా రఘురామకృష్ణం రాజును టార్గెట్ చేసేలా ఉంది. అందులో ఏముందంటే...
చట్టం ముందు అందరూ సమానమేనని.. అలాంటప్పుడు తన సస్పెన్షన్ విషయంలో జరిగింది అవతలివాళ్లకు కూడా వర్తించాలి కదా? అంటూ ఆయన ఓ సూటి ప్రశ్న సంధిస్తూ పోస్ట్ చేశారు. నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు డీజీపీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ను సస్పెండ్ చేసి.. విచారణకు కూడా పిలిచారు. అయితే.. ‘‘నన్ను సస్పెండ్ చేశారు మంచిదే. కానీ దర్యాప్తు న్యాయంగా జరగాలంటే రఘురామకృష్ణరాజును కూడా అన్ని పదవులనుండి తొలగించాలి కదా. అని ఆయన పోస్ట్ చేశారు.
ఒకరిని సస్పెండ్ చేసి, మరొకరిని పదవిలో కొనసాగించడం అన్యాయని.. రఘురామకృష్ణరాజు పదవిలో ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని.. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామను పదవుల నుండి తొలగించాలని.. తద్వారా చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఈ మేరకు డిసెంబర్ 17న సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ ఉంచారు.