దర్శి ఓటు డబ్బుకా.. వ్యక్తిత్వానికా?

దర్శిలో ఓట్ల కోసం అభ్యర్థులు కోట్లు కుమ్మరించారు. విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.

Update: 2024-05-20 04:39 GMT

సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజక వర్గం వార్తల్లోకెక్కింది. ఓటర్లు దర్శి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మిల వైపే ముగ్గు చూపారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని కానీ, స్వతంత్ర అభ్యర్థులను కానీ వేరే ఇతర పార్టీ అభ్యర్థులను కానీ పరిగణనలోకి తీసుకోలేదు. అభ్యర్థులిద్దరూ డాక్టర్లు. ప్రజా నాడీ తెలిసిన వారనడంలో సందేహం లేదు. అది వైద్య పరంగానా, రాజకీయ పరంగానా అనాల్సి వస్తే రెండింటిల్లోనూ ఇరువురు అభ్యర్థులకూ అనుభవం ఉంది.

బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో దర్శి నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి బూచేపల్లి కుటుంబం రాజకీయంగా జిల్లాలో పావులు కదుపుతూ వచ్చింది. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి 2009లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఇప్పటి వరకు ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నారు. తిరిగి 2024లో దర్శి అసెంబ్లీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
గొట్టిపాటి లక్ష్మి మొదటి సారిగా టీడీపీ అభ్యర్థిగా దర్శి అసెంబ్లీకి పోటీలో దిగారు. డాక్టర్‌గా లక్ష్మికి రాజకీయ అనుభవం కొంత తక్కువేనని చెప్పొచ్చు. అయితే ఆమె తండ్రి గొట్టిపాటి నరసయ్య మార్టూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో గడిపారు. ఆయన మరణ అనంతరం ఆయన బాబాయి కుమారుడు గొట్టిపాటి రవికుమార్‌ అద్దంకి నుంచి కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల తరపున ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం అద్దంకి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రవికుమార్‌ లక్ష్మికి స్వయాన బాబాయి. ఆయన ప్రమేయంతోటే దర్శి టీడీపీ సీటును లక్ష్మి దక్కించుకున్నారు. పార్టీ కేడర్‌ను ఉత్తేజ పరచడంలోను, ఊరూరు తిరగడంలోను, ఆకట్టుకునేట్టు ప్రచారం చేయడంలోను ముందడుగు వేశారు.
రూ. 200 కోట్లు పంపిణీ ?
ఇరు పార్టీల తరపున సుమారు రూ. 200 కోట్ల వరకు ఓటర్లకు పంపిణీ చేసినట్లు సమాచారం. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఒక్కో ఓటు కొనుగోలుకు రూ. 3వేలు ఇచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మి తరపున ఒక్కో ఓటుకు రూ. 2500 తొలుత పంపిణీ చేశారు. బూచేపల్లి రూ.3వేలు పంపిణీ చేశారని తెలియగానే మిగిలిన రూ. 500 లక్ష్మి ప్రతి ఓటరుకు అందజేసినట్లు సమాచారం. మండలాలు, వార్డుల వారీగా కొంత మంది ముఖ్యులను ఎంపిక చేసుకొని వారి ద్వారా ఈ నగదు పంపిణీ జరిగిందని స్థానికుల్లో చర్చ ఉంది. ఓట్ల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఎవరు ఇవ్వాలనుకున్న నగదును వారు ఇచ్చారే తప్ప పొరపాటున కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయడం కానీ దర్యాప్తు చేయాలని కోరడం కానీ జరగ లేదు.
ఇద్దరు అభ్యర్థులు రాష్ట్రంలో ఏ అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు పెట్టనంత డబ్బును ఈ నియోజక వర్గంలో ఓటర్ల కొనుగోలుకు ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండలాల వారీగా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి కావడం వల్ల డబ్బును మధ్య వర్తులు కాజేయకుండా జాగ్రత్తలు వహించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. లక్ష్మి మాత్రం డబ్బు పంపిణీ లో కొంత వరకు మధ్య వర్తుల బారిన పడిందని, అది ఆమె విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పోస్టల్‌ బ్యాలెట్‌కు 5వేలు
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీలు పడి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఉద్యోగులు కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నట్లు తెలిసింది. ఒక్కో ఓటు కొనుగోలుకు ఉభయ పార్టీల వారు రూ. 5వేల వరకు ఖర్చు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి పోలింగ్‌కు రెండు రోజుల ముందే వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఇచ్చినట్లు సామాచారం. వద్దంటున్నా ఇచ్చారని పేరు చెప్పని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు.
నామినేషన్‌కు ముందు రోజే ఇద్దరు అభ్యర్థుల నుంచి ఎక్కువ మొత్తంలో స్థానిక నాయకులు పెద్ద ఎత్తున డబ్బును ఆశించారు. ఏ స్థాయిలో స్థానిక నేతలు డబ్బును ఆశిస్తున్నారో ఆలోచింది నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొని వారి తరుపున వారి ఓట్లు పార్టీలకు పడేట్టుగా చేసుకుని ఒక్కో స్థానిక నేతకు రూ. 10లక్షల నుంచి రూ. 25లక్షల వరకు ముట్టజెప్పినట్లు స్థానికుల్లో చర్చ సాగుతోంది.
గొట్టిపాటి లక్ష్మి నరసరావుపేట నుంచి దర్శికి భారీగా ర్యాలీగా తరలి వచ్చేందుకు ఈ నేతలందరికీ కావాల్సిన మొత్తాన్ని లక్షల్లోనే అందజేసినట్లు సమాచారం. ఆ రోజు ప్రచారానికి హాజరైన ప్రతి గ్రామంలోను ముఖ్యులందరికీ మాంసాహారంతో ఎక్కడికక్కడ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. సుమారు రూ. 150 పొట్టేళ్ల వరకు ఈ విందుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బూచేపల్లి టీడీపీ వారు ఏర్పాటు చేసిన విందు భోజనాల స్థాయిలో అదే గ్రామంలో ఏర్పాటు చేశారు.
ఇందుకు లక్షల్లో ఇద్దరు అభ్యర్థులు డబ్బు ఖర్చు పెట్టారు. అదేకాకండా మద్యం సీసాలతో పాటు మాంసం కూడా గ్రామంలోని ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు. మహిళా ఓటర్ల కోసం చీరలు, కుక్కర్లు ఇవ్వడంతో పాటు పురుషులకు ఒక పంచె కూడా కొనుగోలు చేసి అందజేశారు. ఒక్కో గ్రామంలో 8వేల నుంచి 10వేల మంది వరకు స్థానికులకు భోజనాలు పెట్టించారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా జరగ లేదు. ఒక్క దర్శి నియోజక వర్గంలో మాత్రమే చోటు చేసుకున్నాయి. ఇన్ని జరిగినా ఎన్నికల కమిషన్‌కు దర్శి నియోజక వర్గం నుంచి ఒక ఫిర్యాదు కూడా అందలేదు.
అధికారం ఎవరిని వరిస్తుందో
దర్శిలో కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేసి ఎవరికి వారు ఓటర్లను తమ గ్రిప్‌లోకి తెచ్చుకున్నామని భావించారు. ఓటరు తీర్పు ఎలా ఉంటుంది, ఎవరిని ఆదరిస్తారు, అనేది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి ఉంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బూచేపల్లి రాజకీయ అనుభవంతో పని చేసినందున ఆయన ఫార్ములా ఫలించి గెలిచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News